హైదరాబాద్ అభివృద్ధికి విజన్‌ – 2050

హైదారబాద్ నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి తమ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు

హైదరాబాద్ అభివృద్ధికి విజన్‌ – 2050
  • వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నాం
  • 2034 వరకు అధికారంలో కాంగ్రెస్సే
  • సిటీలో ప్రతీ గల్లీని అభివృద్ధి చేస్తాం
  • ఓల్డ్‌ సిటీ కాదు.. అది ఒరిజినల్‌ సిటీ
  • మూసీ పరివాహక అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
  • మెట్రో రైలు విస్తరణతో సమగ్రాభివృద్ధి
  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు
  • ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మెట్రో రైలు విస్తరణ పనులకు భూమి పూజ
  • రేవంత్‌ ప్రభుత్వానికి అండగా ఉంటాం
  • ఐదేళ్లు ప్రశాంతంగా పనిచేసుకోండి
  • ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ

విధాత, హైదరాబాద్ : హైదారబాద్ నగర ప్రతిష్ఠను నిలబెట్టడానికి తమ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం పాతబస్తీలో ఎంజీబీఎస్‌- ఫలక్‌నుమా మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధికి 2050 విజన్‌తో కూడిన వైబ్రెంట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. 2034వరకు కాంగ్రెస్ అధికారంలోకి ఉంటుందని, హైదరాబాద్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేసే బాధ్యత మాదని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని, ఇందుకోసం ఇప్పటికే లండన్‌లోని థేమ్స్‌ నదిని అక్బరుద్దీన్‌తో కలిసి సందర్శించామని గుర్తు చేశారు. గండిపేట నుంచి నగరంలోని 55 కి.మీ.ల పరిధిలోని మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని సైతం సబర్మతి, గంగ నదుల సుందరీకరణ మాదిరిగా, గుజరాత్ అభివృద్ధి మాదిరిగా మూసీ అభివృద్ధికి నిధులివ్వాలని కోరానని తెలిపారు.

ఇది ఒరిజినల్‌ సిటీ

కులీ కుతుబ్ షాహీ నుంచి నిజాం వరకు హైదరాబాద్‌ నగర అభివృద్ధికి కృషి చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇది ఓల్డ్ సిటీ కాదని, ఇది ఒరిజినల్ హైదరాబాద్ సిటీ అని పేర్కొన్నారు. ఒరిజినల్ సిటీని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2ను తీసుకొస్తున్నామని తెలిపారు. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రోరైలు ప్రాజెక్టును విస్తరించనున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్ ఏర్పాటు చేయబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మెట్రో విస్తరణతో సిటీలోని పలు ప్రాంతాల మధ్య సమగ్రాభివృద్ధికి బాటలు పడుతాయన్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలో పెద్దపెద్దవారే ఎక్కువ ఉంటారని, పాతబస్తీకి మెట్రో వస్తేనే సామాన్యులకు ఎక్కువ మేలు జరుగుతుందని చెప్పారు. ఒవైసీ కోరినట్లుగా చంచల్ గూడ జైలును తరలించి అక్కడ విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామని ప్రకటించారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఉంటాయని, మిగతా సమయంలో అభివృద్ధిపైనే తమ దృష్టి కేంద్రీకరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఒవైసీని ఓడించడానికి తాము ప్రయత్నించామని, ఆయన గెలుస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. ముస్లింల తరుఫున పోరాడే ఒకే ఒక్కరు ఒవైసీ అన్నారు. ఐదేళ్లలో పాతబస్తీ మెట్రో పూర్తి చేస్తామని, ఎంఐఎం సలహాలు, సూచనలతో పాతబస్తీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. పాతబస్తీ అభివృద్ధి పనులకు 120 కోట్లు కోరగా 200 కోట్లు మంజూరు చేస్తానని చెప్పానన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్‌కు భారీ పరిశ్రమలు, పెట్టుబడులు, ఎయిర్ పోర్టు, మెట్రో, అవుటర్ రింగ్ రోడ్డు వంటివి వచ్చాయన్నారు. మైనారిటీల కోసం 4శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు.

పట్టుదలతో సీఎం అయిన రేవంత్‌

సీఎం రేవంత్‌రెడ్డి చాలా మొండిఘటమని, పట్టుదల ఉన్న మనిషి అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆ పట్టుదలతోనే సీఎం స్థాయికి వచ్చారని చెప్పారు. తాము రాష్ట్ర ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామన్న అసదుద్దీన్‌.. రేవంత్‌రెడ్డి ఐదేళ్లు ప్రశాంతంగా పాలన చేసుకోవచ్చన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తాము అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి జీవిస్తారని, కానీ కొన్ని శక్తులు విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. అలాంటి శక్తులను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. తాము పాతబస్తీ అభివృద్ధి కోసం రేవంత్‌రెడ్డిని కలవగా, వెంటనే 120 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించాలని, చంచల్‌గూడ జైలును తరలించాలని కోరారు. మూసీ అభివృద్ధి ప్రణాళికకు తాము పూర్తిగా సహకరిస్తామని తెలిపారు.