ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి చ‌రిత్రాత్మ‌క పోరాటానికి స‌న్న‌ద్ధ‌మైన రైతుల‌ను అణ‌చివేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మ‌రోసారి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది

  • అన్న‌దాత‌ల‌ అరెస్టు స‌రికాదంటూ తిర‌స్క‌రించిన ఆప్ ప్ర‌భుత్వం

న్యూఢిల్లీ : ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో మ‌రోసారి చ‌రిత్రాత్మ‌క పోరాటానికి స‌న్న‌ద్ధ‌మైన రైతుల‌ను అణ‌చివేసేందుకు కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు మ‌రోసారి కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్న‌ది. రైతుల‌ను అరెస్టు చేసి, ఉంచేందుకు వీలుగా భావ‌నాలోని రాజీవ్‌గాంధీ స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాల‌ని ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేసింది. అయితే.. ఆందోళ‌న‌కు దిగిన‌ అన్న‌దాత‌ల‌ను అరెస్టు చేయ‌డం స‌రికాద‌న్న ఢిల్లీ స‌ర్కార్.. కేంద్రం విజ్ఞప్తిని కొట్టిపారేసింది.

సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటిక‌ల్‌), కిసాన్ మ‌జ్దూర్ మోర్చా నాయ‌క‌త్వంలో రైతులు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం, ఇత‌ర డిమాండ్ల ప‌రిష్కారానికి మంగ‌ళ‌వారం చలో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన నేప‌థ్యంలో ఈ ప‌రిణామం చోటు చేసుకున్న‌ది. ఖానౌరీలోని ఫ‌తేగ‌ఢ్ సాహిబ్‌, మిహాల్ క‌లాన్ నుంచి ఢిల్లీ దిశ‌గా వంద‌ల ట్రాక్ట‌ర్ల‌తో అనేక గ్రూపులు క‌దులుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేశ్‌కుమార్ చేసిన విజ్ఞ‌ప్తిని తిర‌స్క‌రిస్తూ ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గెహ్లాట్ ఆయ‌న‌కు తిరుగు లేఖ రాశారు. తాము రైతుల ఆందోళ‌న‌కు సంఘీభావం తెలియ‌జేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. రైతులు చేస్తున్న డిమాండ్లు అన్నీ నిష్క‌ప‌ట‌మైన‌వ‌ని గెహ్లాట్ పేర్కొన్నారు.

శాంతియుతంగా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసుకునేందుకు దేశంలోని ప్ర‌తి పౌరుడికీ రాజ్యాంగ బ‌ద్ధంగా హ‌క్కు ఉన్న‌ది. క‌నుక వారిని అరెస్టు చేయ‌డం స‌రికాద‌ని స్ప‌ష్టం చేశారు. నిజానికి కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌ను చ‌ర్చ‌ల‌కు పిలిచి, వారి స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మార్గం క‌నుగొనాల్సి ఉన్న‌ద‌ని గెహ్లాట్ పేర్కొన్నారు. రైతులు ఈ దేశాన్ని అన్న‌దాత‌లు. ఈ విధంగా వారిని అరెస్టు చేయ‌డ‌మంటే వారి పుండుపై కారం చ‌ల్ల‌డ‌మే. కేంద్ర ప్ర‌భుత్వ ఈ నిర్ణ‌యంలో మేం భాగ‌స్వాములు కాద‌ల్చుకోలేదు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

పంజాబ్‌లోని ఆప్ ప్ర‌భుత్వం రైతుల‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. రైతులు ముందుకు క‌ద‌ల‌కుండా రోడ్ల‌ను దిగ్బంధిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ను స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు చూస్తే.. వారి స‌మాధుల‌ను చీల్చుకుని బ‌య‌ట‌కు వ‌స్తార‌ని ఆప్ నేత గోపాల్ రాయ్ వ్యాఖ్యానించారు. రైతులు ఢిల్లీకి వెళ్లాల‌నుకుంటే.. రైతుల‌ను అడ్డుకునేందుకు బారికేడ్లు పెట్టార‌న్న గోపాల్‌రాయ్‌.. భార‌త్‌, పాకిస్థాన్ స‌రిహ‌ద్దుల కంటే బ‌లమైన బారికేడ్ల‌ను నిర్మించారంటూ కేంద్రంపై నిప్పులు చెరిగారు.

Updated On 13 Feb 2024 12:40 PM GMT
Somu

Somu

Next Story