నకిలీ బర్త్ సర్టిఫికెట్ కేసులో ఆజాంఖాన్‌కు ఏడేండ్ల జైలు

- భార్య, కొడుకుకు కూడా దోషులు
- ఉత్తరప్రదేశ్‌లో రామ్‌పూర్ న్యాయస్థానం తీర్పు
- వెంటనే జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలింపు
విధాత: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాది పార్టీ నాయకుడు ఆజం ఖాన్‌కు కోర్టు చుక్కెదురైంది. 2019నాటి నకిలీ బర్త్ సర్టిఫికెట్ కేసులో ఆయనతోపాటు భార్య తజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా ఆజంలను దోషులుగా నిర్ధారించిన రాంపూర్ కోర్టు వారికి ఏడేండ్ల జైలు శిక్ష విధించింది.
కోర్టు తీర్పు అనంతరం పోలీసులు ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారని, కోర్టు నుంచే జైలుకు తరలించారని ప్రాసిక్యూషన్ తరపున వాదిస్తున్న మాజీ జిల్లా ప్రభుత్వ న్యాయవాది అరుణ్ ప్రకాష్ సక్సేనా తెలిపారు. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మేజిస్ట్రేట్ షోబిత్ బన్సల్ ఈ ముగ్గురు దోషులకు గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.
తమ కుమారుడికి రెండు నకిలీ పుట్టిన తేదీ సర్టిఫికెట్లను పొందేందుకు ఆజం ఖాన్, ఆయన భార్య సహాయం చేశారని బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా రాంపూర్‌లోని గంజ్ పోలీస్ స్టేషన్‌లో 2019 జనవరి 3న నమోదు ఫిర్యాదు చేశారు. ఒకటి లక్నో, మరొకటి రాంపూర్ నుంచి అబ్దుల్లా ఆజం బర్త్ సర్టిఫికెట్లను పొందాడని పేర్కొన్నారు.
కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్ మున్సిపాలిటీ జారీ చేసిన సర్టిఫికెట్‌లో అబ్దుల్లా అజం పుట్టిన తేదీ జనవరి 1, 1993గా పేర్కొనగా.. మరో సర్టిఫికెట్‌లో సెప్టెంబర్ 30, 1990న లక్నోలో జన్మించినట్టు పేర్కొన్నట్టు చార్జిషీటులో వెల్లడించారు.