ఇండియా కూటమి అజెండాలోకి బీజేపీ
సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలకమైన నాలుగోదశ పోలింగ్ మే13న జరగనున్నది. మూడు దశల లో 284 స్థానాలకు పోలింగ్ ముగిసింది. అంటే సగం స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.

విధాత : సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలకమైన నాలుగోదశ పోలింగ్ మే13న జరగనున్నది. మూడు దశల లో 284 స్థానాలకు పోలింగ్ ముగిసింది. అంటే సగం స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడు దశలలో జరిగే లోక్‌సభ ఎన్నికలలో తర్వాత నాలుగు దశలు (ఫేజ్-4 లో 96, ఫేజ్=5లో 49, ఫేజ్-6లో 57, ఫేజ్-57) కీలకం. మూడు దశల పోలింగ్ ముగిసే సరికి ప్రధాని మోడీలో ఆందోళన కనిపించింది. 2019 నాటి ఎన్నికల్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదు. దానికి కారణం ఎన్నికల షెడ్యూల్‌కు ముందు ఆ పార్టీ నమ్మకం పెట్టుకున్న రామ మందిరం, హిందుత్వ నినాదం మూడోసారి గట్టెక్కిస్తుందని కాషాయ నేతలు బలంగా విశ్వసించారు. ఇదే నమ్మకంతో మరోసారి మోడీని గెలిపించాలని, ఈసారి 400 సీట్లు బీజేపీకి ఇవ్వాలని ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ నేతల ఈ నినాదమే వారికి బూమ్ రాంగ్ అయ్యింది.
బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని విపక్ష ఇండియా కూటమితో పాటు దేశంలోని ప్రజాస్వామికవాదులంతా ప్రజలను అప్రమత్తం చేశారు. దానికి పదేళ్ల మోడీ పాలనలో తీసుకున్న పాలన విధానాలను ఉదహరిస్తున్నారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగం, రైతులకు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న ‘సామాజిక-ఆర్థిక సర్వే’ వంటి అంశాల ప్రభావం మూడు దశల పోలింగ్‌లలో కనిపించినట్టు తెలుస్తోంది.
మోడీ గ్యారెంటీపై అనుబంధ సంఘాల్లోనే విముఖత
దీనికితోడు మరోముఖ్యమైన అంశం ఈసారి బీజేపీ ఎన్నికల ప్రచారంలో కనిపించింది. ఇది ఆపార్టీ సిద్ధాంతాలు, ఆ విధానాలను అనుసరించే వారికి మింగుడు పడలేదని సమాచారం. ప్రాంతీయపార్టీలు వ్యక్తి కేంద్రంగా నడుస్తాయి. ప్రచారంతో పాటు ప్రజలకు ఇచ్చే హామీలన్నీ వ్యక్తి కేంద్రంగానే ఉంటాయి. కానీ జాతీయపార్టీలు అలా కాదు. వాటికంటూ ఒక విధానం ఉంటుంది. పార్టీ ముందు వ్యక్తులు తర్వాత అన్నట్టు ఉంటుంది. బీజేపీ దేశ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటికీ మోడీ గ్యారెంటీ అని ఆపార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తున్నది.
రెండు సార్లు అధికారంలోకి వచ్చాక మోడీ-షాల ద్వయం బీజేపీ అనుబంధం సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్, బజరంగదళ్‌వంటి వాటన్నింటిలోనూ వీరి మాటే చెల్లుబాటు అయ్యేలా చేసుకున్నారనే విమర్శ ఉన్నది. ఇది ఇలాగే ఉంటే భవిష్యత్తులో కష్టమనే అభిప్రాయం చాలామంది ఉన్నదట. అందుకే 2014, 2019 ఎన్నికల సమయంలో వలె ఈసారి ఎక్కడా ఆర్‌ఎస్‌ఎస్, ఇతర హిందుత్వ సంఘాలు బీజేపీ తరఫున పెద్దగా ప్రచారం చేస్తున్నట్టు కనిపించలేదు. కొన్నిచోట్ల చేసినా స్థానిక సమస్యల ముందు అవి పనిచేయడం లేదని క్షేత్రస్థాయిలో వెళ్లినవారికి అవగతమైంది.
యూపీలో ఆ ప్రచారం పనిచేయదా?
ఈ నేపథ్యంలోనే తీహార్ జైలు నుంచి విడుదలై ప్రచారంలో పాల్గొన్న అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ తరఫున తర్వాత ప్రధాని ఎవరు అన్న చర్చకు తెరలేపారు. సాంకేతికంగా బీజేపీ తరఫున ఎన్నికైన మెజారిటీ ఎంపీల నిర్ణయమే మేరకే ప్రధాని అభ్యర్థి ఎవరు అన్నది తేలుతుంది. కానీ బీజేపీ తరఫున ప్రధాని ఎవరు కావాలన్నా వారికి ఆర్‌ఎస్‌ఎస్ అండదండలు కావాలంటారు. కానీ కేజ్రీవాల్ ఆరోపించినట్టు బీజేపీలో 75 ఏళ్ల రిటైర్మైంట్ నిబంధన ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోడీకి వర్తిస్తుందని, అందుకే ఆయన తన వారసుడిగా అమిత్ కోసం ఓట్లు అడుగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు బీజేపీకి రెండు సార్లు సంపూర్ణ మెజారిటీ రావడానికి కారణం యూపీలో మెజారిటీ సీట్లు ఆ పార్టీ దక్కించుకోవడం. ప్రధాని మోడీ కరిష్మాతో పాటు యోగి ఆదిత్యనాథ్ నాయకత్వమూ దీనికి కారణం అంటారు. అంతేకాదు భవిష్యత్తు ప్రధాని ఆయనే అని ప్రచారం గత ఎన్నికల నాటి నుంచే జరుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే యోగీకి మోడీ చెక్ పెట్టాలని భావించారనే వాదనలు వచ్చాయి. అయితే ఒకవేళ యోగీని మారిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందనే వెనక్కినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ ఓటమే లక్ష్యంగా పనిచేసిన బీఎస్పీ గత లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన 10 స్థానాలను నిలబెట్టుకోవాలన్నా, తన పార్టీ ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్నది. బీజేపీ మళ్లీ వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లు రద్దవుతాయనే ప్రచారం ఉధృతంగా సాగుతున్న ఈసమయంలో బీఎస్పీ తటస్థంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని గ్రహించినట్టు ఉన్నది. అందుకే ఆపార్టీ చీఫ్ మాయావతి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం శాంతిభద్రతలు కాపాడానికి బుల్డొజర్లను ఉపయోగిస్తున్నదనే విమర్శలున్నాయి. మా హయంలో బుల్డొజర్ల అవసరం రాలేదన్నారు.
ఇండియా కూటమిని బలహీనపరచడానికి యూపీలో ఆర్‌ఎల్‌డీ ని ఎన్డీఏలో చేర్చుకున్నా ఇప్పుడు ఆ పార్టీ నేతలు అంటీమట్టనట్టుగా ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. యూపీ, కేంద్ర ప్రభుత్వాల విధానాలను ప్రశ్నించినందుకు వరుణ్‌గాంధీకి పిలీభీత్ టికెట్ నిరాకరించింది. దీనిపై మేనకా గాంధీ స్పందించారు. యూపీ, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు మినహా వరుణ్‌కు టికెట్ ఇవ్వకపోవడానికి మరో కారణం కనిపించలేదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు తన కుమారుడికి టికెట్ రాకపోవడంపట్ల సంతోషంగా లేను అన్నారు. తాను పోటీ చేస్తున్న సుల్తాన్‌పూర్ స్థానానికి 6వ దశలో పోలింగ్ జరగనున్నది. తన నియోజకవర్గంలో జాతీయ అంశాలకన్నా స్థానిక అంశాలే ప్రభావం చూపుతుంటాయని పేర్కొన్నారు. అయోధ్యకు సమీపంలోనే సుల్తాన్‌పూర్ ఉన్నప్పటికీ రామాయలం నిర్మాణం ప్రచా అంశం కాలేదని మేనకా చెప్పడం గమనార్హం. యూపీలో ఈసారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సీన్ రివర్స్
నిజానికి మోడీ వేసే ట్రాప్‌లోకి విపక్షాలు వెళ్లేవి. గత రెండు సార్వత్రిక ఎన్నికల సమయంలో హిందుత్వవాదం, దేశభక్తి వంటి వాటిని ముందు పెట్ట మోడీ చేసిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఓట్లు కూడా అదేస్థాయిలో ఆయన నాయకత్వానికి వేయడం వల్ల రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్‌ఘఢ్, హర్యానా, యూపీ, బీహార్, ఢిల్లీ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కాషాయపార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసిన జనం లోక్‌సభ ఎన్నికల నాటికి గంపగుత్తగా మోడీకే ఓటు వేశారు. కానీ పోలింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లు, నూతన పార్లమెంటు భవనం, నేర న్యాయ చట్టాల గురించి, రామమందిర నిర్మాణం వంటివి పెద్దగా ప్రచారం చేయడం లేదు. వాటికి ఆ పార్టీ ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
మోడీ ట్రాప్ ఈసారి రివర్స్ అయ్యింది. ఇండియా కూటమి తెరమీదికి తెచ్చిన రిజర్వేషన్లు, రాజ్యాంగంవైపు బీజేపీ మళ్లింది. తాము రాజ్యాంగాన్ని మార్చమని, రిజర్వేషన్లు రద్దు చేయమని వివరణ ఇచ్చుకుంటున్నది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లలో మెజారిటీ ఇండియా కూటమి వైపు మళ్లకుండా ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తెచ్చింది. చివరికి ప్రధాని విశ్రాంతి తీసుకుంటారని, అమిత్‌ను తన వారసుడిగా తీసుకొచ్చేందుకు మోడీ ఓట్లు అడుగుతున్నారన్న కేజ్రీవాల్‌కు మేము అధికారంలోకి వస్తే ఐదేళ్లు ప్రధాని మోడీనే అని బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ లు వివరణ ఇచ్చుకున్నారంటే పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.
బీజేపీ సంక్షేమ మంత్ర జపం
ఇలా మూడు నెలలకు ముందు బీజేపీ ప్రచార అజెండా మొత్తం మూడు దశలల పోలింగ్ ముగిసే నాటికి మారిపోయింది. ఇండియా కూటమి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లిన రాజ్యాంగం మార్పు, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలపై వివరణ ఇస్తున్నది. కాంగ్రెస్ 5 గ్యారెంటీలు, 25 హామీల పేరుతో ముందుకు తెచ్చిన సంక్షేమ మంత్రాన్ని బీజేపీ కూడా జపం చేస్తున్నది. తాము నమ్ముకున్న నినాదాలను పక్కనపెట్టి ఇండియా కూటమి అజెండాలోని అంశాలను ప్రస్తావిస్తున్న బీజేపిని ప్రజలు ఆదరిస్తారా? లేదా అన్నది చూడాలి.