కాషాయపార్టీని కలవరపెడుతున్న యూపీ

కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన నిర్ణయాలు కాషాయపార్టీని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అని నినదించిన ఆ పార్టీనే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నిత్యం స్మరిస్తున్నది.

కాషాయపార్టీని కలవరపెడుతున్న యూపీ

విధాత‌: కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠాన నిర్ణయాలు కాషాయపార్టీని కలవరపెడుతున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్త్‌ భారత్‌ అని నినదించిన ఆ పార్టీనే ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నిత్యం స్మరిస్తున్నది. రాహుల్‌గాంధీని పప్పు అని హేళన చేసి 56 ఇంచుల మోడీని ఆయన ఢీ కొట్టలేరని కమలనాథులు గప్పాలు కొట్టారు. భారత్‌ జోడో, న్యాయ యాత్రల తర్వాత రాహుల్‌ గాంధీ ఛరిష్మా ఏమిటో తెలిసి వచ్చింది. దీంతో కంగారపడ్డ బీజేపీ నేతలు ఈసారి ఎన్నికల ప్రచారంలో ఆయనను, కాంగ్రెస్‌పార్టీనే టార్గెట్‌ చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ నేతల వలె ప్రజలకు ఉపయోగపడని నినాదాలు వల్లెవేయడం లేదు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడటం లేదు. పదేళ్ల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇదే వారికి మింగుడు పడటం లేదు.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత పదేళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలను ఎలా నిర్వీర్యం చేసిందో, రిజర్వేషన్లను రద్దు చేయడానికి దొడ్డి దారిన ఎలా ప్రయత్నిస్తున్నదో, వారి హయాంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు ఎలా అన్యాయం జరుగుతున్నదో ప్రజలకు వివరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ బీజేపీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు కౌంటర్‌ ఇస్తున్నారు. తాజాగా ‘ఎక్స్‌’ వేదికగా బీజేపీ వైఫల్యాలపై పోస్ట్‌ పెట్టారు. ‘2013లో ప్రభుత్వ రంగంలో 14 లక్షల శాశ్వత పోస్టులుండగా అవి 2023 నాటికి 8.4 లక్షలకు చేరాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌, సెయిల్‌, బీహెచ్‌ఈఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ నాశనం చేసింది. మోడీ మోడల్‌ ప్రవేటీకరణ, దేశ వనరులను కొల్లగొట్టడమే. దీనిద్వారా అణగారిన వర్గాల రిజర్వేషన్లు లాగేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేస్తాం. వాటిల్లో ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు కాంగ్రెస్‌ కుటుంబంపై మోడీ సహా బీజేపీ నేతలు చేస్తున్నవ్యాఖ్యలను ప్రియాంక గాంధీ ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు. గాంధీ కుటుంబ వారసత్వ రాజకీయాలపై మోడీ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా మధ్యప్రదేశ్‌ ప్రచారంలో స్పందించారు. మా నాన్న రాజీవ్‌గాంధీ తన తల్లి నుంచి ఆస్తిని కాకుండా బలిదానాన్ని వారసత్వంగా స్వీకరించారని, మా నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశం కోసం ప్రాణాలర్పించారు. అదే రీతిలో నా తండ్రి ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు వారి కుటుంబంపై హీనంగా మాట్లాడుతున్నా ధైర్యంగా సమాధానాలు చెబుతున్నారు. దేశం కోసం వారి కుటుంబ చేసిన త్యాగాలను ప్రస్తావిస్తున్నారు. బీజేపీ నేతలు దేశం కోసం ఏం చేశారో చెప్పాలని ఆమె సంధిస్తున్న ప్రశ్నలకు స్పష్టంగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.

రాయబరేలీ, అమేథీ నియోజకవర్గాల్లో పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై చివరిదాకా గోప్యత పాటించింది. కాంగ్రెస్‌ పార్టీ కంచుకోటల తిరిగి నిలబెట్టుకోవడానికి వ్యూహాత్మంగా వ్యవహరించింది. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయబరేలీలో రాహుల్‌ను బరిలోకి దింపింది. అమేథీ నుంచి ప్రియాంక గాంధీని నిలబెట్టాలని అనుకున్నారు. ప్రణబ్‌ ముఖర్జీ తర్వాత ప్రియాంకనే ఇప్పుడు పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా మారిపోయారు. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో పార్టీని అధికారంలోకి తేవడంలో ఆమెదే కీలక పాత్ర. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఆమె దేశమంతా ప్రచారం చేస్తున్నారు. అలాగే బీజేపీ చేస్తున్న వారసత్వ రాజకీయాలకు చెక్‌ పెట్టడానికి ఈసారి ఆమె పోటీ దూరంగా ఉన్నారని సమాచారం. దీంతో అక్కడ గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన కిశోరీ లాల్‌ శర్మను పోటీకి నిలిపింది.

పంజాబ్‌లోని లుథియానకు చెందిన ఆయన 1983లో రాజీవ్‌గాంధీ తో కలిసి రాయబరేలీ, అమేథీలో అడుగుపెట్టారు. గాంధీ కుటుంబం ఢిల్లీలో ఉన్న సమయంలో వారి తరఫున ఈ రెండు నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుని కార్యక్రమాలను ఆయనే చక్కబెట్టేవారు. సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో శర్మనే అమేథీలో అన్నీ చూసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతాయి. దీన్నిబట్టి పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంత కసరత్తు చేసిందో తెలుస్తోంది. యూపీలో ఈసారి కాంగ్రెస్‌ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేస్తున్నది. మిగిలిన 63 స్థానాల్లో ఎస్పీ, మిత్రపక్షాలు బరిలో దిగుతాయి.

యూపీలో ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు తొలిగించడానికి ప్రియాంక గాంధీనే చొరవ తీసుకున్నారు. 80 స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు ఏ కూటమి గెలిస్తే వారిదే ఢిల్లీ సర్కార్‌ అన్న నానుడి ఉన్నది. అందుకే కాంగ్రెస్‌ యూపీలో పోటీ చేసే స్థానాలపై ఫోకస్‌ పెట్టింది. గత రెండు దఫాలుగా యూపీలో మెజార్టీ సీట్లు దక్కించుకున్న బీజేపీ ఈసారి కూడా ఎక్కువ సీట్లు గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నది. దీనికి కాంగ్రెస్, ఎస్పీల కూటమి అక్కడే బీజేపీకి అక్కడే అడ్డుకట్ట వేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.