25, 26 తేదీల్లో.. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్

  • By: sr    news    Apr 23, 2025 7:27 PM IST
25, 26 తేదీల్లో.. హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్

విధాత: సమృద్ద భారత్ ఫౌండేషన్ సహకారంతో ఈ నెల 25,26 తేదీల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో భారత్ సమ్మిట్ -2025 నిర్వహణకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి 100 దేశాల నుంచి 450 మంది ప్రముఖులు హాజరవుతారని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. భారత్ సమ్మిట్ లోగో, థీమ్ ను ఇప్పటికే ఆవిష్కరించారు. సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైంకర్, కాంగ్రెస్ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

మొదటి రోజు ఖర్గే, రాహుల్ కీలక ప్రసంగాలు, రెండోరోజు ప్రియాంక, కేసీ వేణుగోపాల్‌ ప్రసంగాలుంటాయి. దేశ, విదేశాలకు చెందిన దాదాపు వంద ప్రగతిశీల పార్టీలు, 40 నుంచి 50 మంది మంత్రులు, 50 మంది సెనేటర్లు, ఎంపీలు, అనేక పార్టీల అధిపతులు దాదాపు వంద మంది వివిధ రంగాల నిపుణులు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనున్నారు. నేతలు కీలక ప్రసంగాలు చేయనున్నారు. ప్రజాస్వామ్య తిరోగమనం, పెరుగుతున్న అసమానతలు, భౌగోళిక, రాజకీయ మార్పులు వంటి ప్రపంచ సవాళ్లకు ప్రతిస్పందనగా ‘గ్లోబల్ జస్టిస్ అందించడం’ అనే ఇతివృత్తంతో ఈ సమ్మిట్ జరగనుంది.

 

ఈ సమ్మిట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ సమాచార న్యాయం వైపు మార్గాన్ని సూచిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. వచ్చే 25 ఏళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచేందుకు ఈ సమ్మిట్ ఎంతో ఉపయోగపడుతుందని తెలలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది. వివిధ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేలా ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేస్తుంది.