Seethakka: 313 అంగన్వాడీ సెంటర్లు మూత: మంత్రి సీతక్క విచారం

Seethakka: 313 అంగన్వాడీ సెంటర్లు మూత: మంత్రి సీతక్క విచారం

విధాత: రాష్ట్రంలో 313 అంగన్వాడీ సెంటర్లు మూత పడటం బాధాకరమని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క విచారం వ్యక్తం చేశారు. గురువారం మహిళా శిశుసంక్షేమ శాఖ కార్యక్రమాలపై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మూతపడిన అంగన్వాడీ కేంద్రాలను తెరిపించేందుకు ప్రయత్నించాలని..లేదంటే డిమాండ్ ఉన్న చోట్లకు తరలించాలని సీతక్క అధికారులను ఆదేశించారు. 30 అంగ‌న్వాడీ కేంద్రాల్లో అస‌లు పిల్ల‌లు లేరని.. 198 కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య 5 లోపే ఉందని… 586 కేంద్రాల్లో ప‌ది మంది లోపునే పిల్లలున్నారన్నారు. ప్ర‌తి సెంట‌ర్ లో క‌నీసం 20 మంది చిన్నారులు ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టాలని, బ‌డి బాట త‌ర‌హాలోనే గ్రామాల్లో చిన్నారుల‌ను గుర్తించి అంగ‌న్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు.

పోషకాహార తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం

పోషకాహార తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు అంగన్వాడీలు పూర్తిస్థాయిలో పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. చిన్నారుల సంఖ్య పెరగాలని..వారికి పోషకాహారం అందించడంలో నాణ్యతపై రాజీ లేదని స్పష్టం చేశారు. అంగన్వాడీ కేంద్రాలకు ఇకపై గ్రేడింగ్, అవార్డులు అందిస్తామన్నారు. ప్ర‌భుత్వం చిన్నారుల సంక్షేమంపై వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తుందని.. మీరు సీరియ‌స్ గా ఉంటేనే లక్ష్యాలు నెరవేరుతాయని సీతక్క తెలిపారు. అంగన్వాడీ సెంటర్లలో చిన్నారుల సంఖ్య పెంచే బాధ్యత మీదేనని స్పష్టం చేశారు.

సరకుల పంపిణీలో ఈ-టెండర్ విధానం

అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల పంపిణీలో ఈ-టెండర్ విధానం తప్పనిసరి చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. బాలల భవిష్యత్‌తో ఆడకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని లేదంటే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కంది ప‌ప్పు కోనుగోలు విష‌యంలో సొంత నిర్ణ‌యాలు ఎందుకు తీసుకున్నారని సీతక్క అధికారులను ప్రశ్నించారు. ఈ-టెండ‌ర్ విధానాన్ని పాటించాలన్న ఆదేశాలను ఎందుకు పాటించలేదని మండిపడ్డారు. మీ తప్పిదాల వ‌ల్ల మేము విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని అసహనం వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల అధికారులు పాత కాంట్రాక్టర్లకి కందిపప్పు సరఫరాను నామినేషన్ పద్ధతిలో ఎందుకు కట్టబెట్టాల్సి వచ్చిందన్నదానిపై..సంజాయిషీ ఇవ్వాల్సిందేనన్నారు. పాత కాంట్రాక్ట‌ర్ల‌కు నామినేష‌న్ ప‌ద్ద‌తిని నిలిపి వేసి ఈ- టెండ‌ర్ విధానాన్నీ అవలంబించాలని సీతక్క ఆదేశించారు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలోని డిస్టిక్ ప్రొక్యుర్ మెంట్ క‌మిటీ ద్వారా టెండ‌ర్లు పిలవాలని ఆదేశించారు.

పోషకాహార లోపాల పిల్లల లెక్కలు తేల్చండి

సామ్, మామ్ చిన్నారుల‌ను గుర్తించి రిపోర్ట్ చేయండని..మీకు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని పిల్ల‌ల పోష‌కాహ‌ర లోపాన్ని దాచి పెడితే స‌మాజానికి న‌ష్టమని మంత్రి సీతక్క అధికారులకు చురకలేశారు. 50 శాతం మంది అస‌లు రిపోర్ట్ చేయ‌డం లేదని.. అందుకే చిన్నారుల భ‌విష్య‌త్తు దృష్ట్యా..బ‌ల‌హీన‌మైన పిల్ల‌ల‌ను గుర్తించి మాకు నివేదించండని.. ఏం చేయాలో మేము చెబుతామని తెలిపారు. పిల్ల‌ల అమ్మ‌కాలు, బాల్య వివాహాలు, నిబంధన‌ల‌కు విరుద్దంగా ద‌త్త‌తల‌పై దృష్టి పెట్టాలని సూచించారు. ఆయా విష‌యాల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని, వారిలో చైత‌న్యం తెచ్చే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు.