ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
సుప్రసిద్ధ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు మఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామి, అమ్మవార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు

విధాత: సుప్రసిద్ధ శ్రీ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవం కన్నులపండువగా జరిగింది. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. 11.34 నిమిషాలకు మఖ నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తమున స్వామి, అమ్మవార్లకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ఉదయం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణానికి మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. కల్యాణానికి విచ్చేసిన భక్తులకు క్యూ లైన్లలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా, మూడు రోజులపాటు జరుగనున్న కల్యాణోత్సవాలలో ఇక బుధవారం ఉదయం 8 గంటలకు మహాశాంతి చండీహోమం, సాయంత్రం 6 గంటలకు ఎల్లమ్మ అమ్మవారిని రథంపై పురవీధుల్లో ఊరేగించనున్నారు.