ధరణి లోపాలకు కేసీఆర్ భూమి రికార్డే నిదర్శనం: బండి సంజయ్

ధరణి పోర్టల్ తప్పుల తడకని సీఎం కేసీఆర్ భూమి రికార్డుతోనే తేలిపోయిందని, కేసీఆర్ అఫిడవిట్ మేరకు ఆయన భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ధరణి ఎక్కువగా చూపిందని, ధరణి తప్పులపై మరి ఇప్పుడేమంటావ్ అంటూ బీజేపీ ఎంపీ, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నిలదీశారు

ధరణి లోపాలకు కేసీఆర్ భూమి రికార్డే నిదర్శనం: బండి సంజయ్

విధాత : ధరణి పోర్టల్ తప్పుల తడకని సీఎం కేసీఆర్ భూమి రికార్డుతోనే తేలిపోయిందని, కేసీఆర్ అఫిడవిట్ మేరకు ఆయన భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ధరణి ఎక్కువగా చూపిందని, ధరణి తప్పులపై మరి ఇప్పుడేమంటావ్ అంటూ బీజేపీ ఎంపీ, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ నిలదీశారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలను దుయ్యబట్టారు.


ధరణి తెచ్చిన నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా అని, ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తావా’’ అని ప్రశ్నించారు. నేనయితే సీఎం అవుతానని చెప్పనని తెలిపారు. ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు పార్టీ అధిష్టానమే సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తుందని. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం కావడం తథ్యం అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ హైకమాండ్, ప్రధాని మోడీ ఇదే విషయాన్ని ప్రకటించారన్నారు.


బీఆర్ఎస్‌ను ఓడగొట్టేది బీజేపీ మాత్రమేనన్నారు.కాంగ్రెస్‌‌కు ప్రజల్లో వేవ్‌, ఇమేజ్‌లు ఏవి లేవన్నారు బీఆరెస్ మళ్లీ గెలిస్తే ఈ సారి మధ్యంతర ఎన్నికలు తప్పవన్నారు. సీఎం కుర్చీ కోసం కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య రగడతో మధ్యంతరం తప్పదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినా వారిని సీఎం కేసీఆర్ కొనేస్తారని, ఇప్పటికే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బు సంచులు పంపిస్తున్నారని ఆరోపించారు.