కేసీఆర్..ఇదిగో నీ అఫిడవిట్..సన్నాసివని ఒప్పుకుంటావా?

కేసీఆర్..ఇదిగో నీ అఫిడవిట్..సన్నాసివని ఒప్పుకుంటావా?

– నీ భూమి రికార్డుల్లోనే గుంట భూమిని ఎక్కువగా చూపింది

– మరి ఇప్పుడేమంటావ్… నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటావా?

– ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తవా?

– కాంగ్రెస్ కు ప్రజల్లో ఇమేజ్ లేనేలేదు

– బీఆర్ఎస్ ను ఓడగొట్టేది బీజేపీయే

– బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్

విధాత బ్యూరో, కరీంనగర్: ‘ధరణి గురించి మాట్లాడితే నన్ను సన్నాసి అన్నడు. నాకేం తెల్వదన్నడు..ఇదిగో కేసీఆర్…ఎన్నికల కమిషన్ కు నువ్వు ఇచ్చిన అఫిడవిట్… అందులో నువ్వే రాసిచ్చినవ్ కదా.. ఇప్పుడు ధరణి పోర్టల్ రైతులను అరిగోస పెడుతుందని అంగీకరిస్తవా?’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి ఎన్నికల సన్నాహక సమావేశం శనివారం గంగాధర మండలకేంద్రంలో జరిగింది. చొప్పదండి నియోజకవర్గ అభ్యర్థి బొడిగె శోభ, పార్టీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి సహా పలువురు జిల్లా నేతలు హాజరయ్యారు.


ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ తన అఫిడవిట్ లో ‘‘నాకు మొత్తం 53 ఎకరాల 30 గుంటల భూమి మాత్రమే ఉంది. కానీ ధరణి రికార్డుల్లో మాత్రం 53 ఎకరాల 31 గుంటల భూమి ఉన్నట్లు చూపుతుంది. అంటే గుంట భూమి ఎక్కువ చూపుతోంది. దీనిని కరెక్ట్ చేయాల్సి ఉంది’ అని రాసిచ్చినవ్ కదా…. ఇది ఎవరి తప్పు అని నిలదీశారు. ఇప్పుడు ఎవరు సన్నాసి? నువ్వే పెద్ద సన్నాసివని ఒప్పుకుంటవా? నీదో దిక్కుమాలిన ప్రభుత్వమని నీకు అనిపిస్తలేదా..? ఇట్ల తెలంగాణ రైతుల భూముల రికార్డులు తారుమార్జేసినవ్. ధరణి పేరుతో ఎందరి జీవితాలతో ఆడుకుంటున్నవ్ కేసీఆర్ అని సూటిగా నిలదీశారు.

– బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తి సీఎం కావడం తథ్యం

‘బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అవుతానని చెప్పను. నాకు అలవాటు కూడా లేదు. ముఖ్యమంత్రిగా ఎవరిని చేయాలనేది ఎన్నికైన ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారు… ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకు బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతే తప్ప నేను సీఎం అవుతానని ఎన్నడూ చెప్పను’ అని బండి సంజయ్ అన్నారు. సామాన్య కార్యకర్తనైన తనకు ఎంపీగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవులిచ్చి గౌరవించిన పార్టీ బీజేపీయేనన్నారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయమే తనకు శిరోధార్యమన్నారు. ప్రధానిసహా పార్టీ జాతీయ నాయకత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో పార్టీ అధికారంలోకి వస్తే బీసీ నాయకుడే ముఖ్యమంత్రి అవుతారని ఉద్ఘాటించారు.

సిగ్గు లేని బీఆరెస్ నేతలు

చొప్పదండిలో బొడిగె శోభ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన శిలాఫలకాలపై బీఆర్ఎస్ నేతలు పోస్టర్లు వేయడం సిగ్గు చేటని బండి సంజయ్ అన్నారు. దమ్ముంటే మీరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకోవాలని, అంతేతప్ప గతంలో ఎమ్మెల్యేగా శోభ చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలియకుండా చేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. దుబ్బాకలో, జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇలాంటి పనులే చేశారని, చివరకు ప్రజలు బీఆర్ఎస్ ను ఓడగొట్టారన్నారు. ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు, కాంగ్రెస్ గ్రాఫ్ ను పెంచే కుట్రకు కేసీఆర్ తెరతీశారని ఆయన ఆరోపించారు. పొరపాటున బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… కొద్ది నెలల్లోనే ఎన్నికలు రావడం తథ్యమన్నారు. తెలంగాణలో సుస్థిర పాలన కావాలంటే అది బీజేపీకే సాధ్యమని తెలిపారు.