అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ తడబాటు.. పార్టీలో రేగిన అసమ్మతి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శుక్రవారం 14 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే ప్రకటించిన అభ్యర్థులలో పలుమార్లు మార్పులు, చేర్పులకు పాల్పడటంతో అభ్యర్థులను టెన్షన్‌కు గురి చేసింది

అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ తడబాటు.. పార్టీలో రేగిన అసమ్మతి
  • గ్రూపుల ఒత్తిళ్లతో మారిన టికెట్లు
  • కాంగ్రెస్‌లోనూ అదే పోకడ


విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ శుక్రవారం 14 మందితో తుది జాబితాను విడుదల చేసింది. అయితే ప్రకటించిన అభ్యర్థులలో పలుమార్లు మార్పులు, చేర్పులకు పాల్పడటంతో అభ్యర్థులను టెన్షన్‌కు గురి చేసింది. సుదీర్ఘ అనుభవమున్న బీజేపీ పార్టీలో అభ్యర్థుల ప్రకటనలో ఈ తరహా కుప్పిగంతలు ఏమిటంటూ ఆ పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. బెల్లంపల్లి టికెట్‌ను ముందుగా అమరరాజుల శ్రీదేవికి ప్రకటించి తర్వాతా కోయల ఏమోజీ పేరు ప్రకటించింది.


చివరి నిమిషాల్లో మళ్లీ శ్రీదేవికే టికెట్ కట్టబెట్టారు. సంగారెడ్డిలో ముందుగా పులిమామిడి రాజు పేరు ఖరారు చేసి తర్వాతా రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే పేరు ప్రకటించారు. ఆయన ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసే సమయంలో మళ్లీ పులిమామిడి రాజు పేరును ప్రకటించి బీఫామ్ ఆయనకే ఇచ్చారు. దీంతో దేశ్‌పాండే ఆర్వో కార్యాలయం వద్ద కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానంటూ హల్‌చల్ చేశారు.


ఇదే రీతిలో వనపర్తి స్థానంలో ముందుగా ప్రకటించిన ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డికి బదులుగా అనుజ్ఞ రెడ్డికి టికెట్ కేటాయించారు. అలాగే వేములవాడ టికెట్ ముందుగా ప్రకటించిన ఈటల రాజేందర్ వర్గానికి చెందిన తులా ఉమాకు బదులుగా వికాస్ రావు ను అభ్యర్థిగా ప్రకటించి ఆయనకే బీఫామ్ అందజేశారు. తుది జాబితా ప్రకటన అనంతరం బండి సంజయ్ ఈ టికెట్‌ను వికాస్‌రావుకే ఇవ్వాలంటూ పట్టుబట్టడంతో అధిష్టానం మార్పు చేసింది. అంతకుముందు చాంద్రాయణగుట్ట అభ్యర్థి సత్యనారాయణ అస్వస్థత కారణంగా ఆయన పేరును మార్చి ఈ సీటును కె.మహేందర్‌కు టికెట్ కేటాయించారు.


మొత్తంగా బీజేపీ 119 స్థానాల్లో 111 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, 8 స్థానాలను మిత్రపక్షం జనసేనకు కేటాయించింది. తుది జాబితాలో బెల్లంపల్లికి అమరరాజుల శ్రీదేవి, పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి పులిమామిడి రాజు, మేడ్చల్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజిగిరికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు , శేర్లింగంపల్లి రవికుమార్ యాదవ్, నాంపల్లి రాహుల్ చంద్ర , చాంద్రాయణగుట్ట కే. మహేందర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ గణేష్ నారాయణ్, దేవరకద్ర కొండ ప్రశాంత్ రెడ్డి, అలంపూర్ కు మీరమ్మ, నర్సంపేట పుల్లారావు, మధిరకు విజయరాజులను అభ్యర్థులుగా ప్రకటించారు.


కాంగ్రెస్‌లోనూ అదే పోకడ


కాంగ్రెస్ పార్టీ సైతం నామినేషన్ల చివరి రోజు అభ్యర్థుల మార్పుకు పాల్పడింది. ముందుగా నారాయణఖేడ్ టికెట్‌ను సురేష్ షెట్కార్‌కు ఇవ్వగా, ఆయన స్వచ్చందంగా పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో పటోళ్ల సంజవ రెడ్డికి టికెట్ ఇవ్వగా, ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే పటాన్‌చెరు కాంగ్రెస్‌లో నీలం మధు ముదిరాజ్‌కు ముందుగా టికెట్ కేటాయించి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఒత్తిడితో మధు టికెట్‌ను రద్దు చేసింది. ఆయన స్థానంల కాటా శ్రీనివాస్ గౌడ్‌కు టికెట్ కేటాయించింది.


టికెట్ చేజారిపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన నీలం మధు వెంటనే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఎస్పీ చేరి ఆ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు మాజీ వనపర్తి టికెట్‌ను మాజీ మంత్రి చిన్నారెడ్డికి ముందుగా ప్రకటించి తదుపరి మేఘారెడ్డికి కేటాయించింది. బోధ్‌లో కూడా వెన్నెల అశోక్ మార్చి ఆడే గజేందర్‌కు చివరకు టికెట్ ఇచ్చింది.


ఇక సూర్యాపేట, మిర్యాలగూడ, తుంగతుర్తి(ఎస్సీ) స్థానాల అభ్యర్థుల ప్రకటన నామినేషన్ల ఆఖరి రోజు వరకు సాగదీసినప్పటికి అసమ్మతిని నివారించలేకపోయింది. సూర్యాపేట టికెట్‌ను ఆర్‌. దామోదర్‌రెడ్డికి ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిికి గురైన పటేల్ రమేశ్‌రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తు తన బీ ఫామ్ కూడా సమర్పించారు. అటు బీఆరెస్ సైతం అలంపూర్ అభ్యర్థి అబ్రహంను మార్చి విజయుడికి కేటాయించింది.