TELANGANA | మేడిగడ్డ వరదలపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ ట్వీట్ల వార్‌

గోదావరి వరదలతో మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85గేట్ల గుండా వరద నీరు దిగువకు ఉరకలేస్తున్న రీతిలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల మధ్య మాటల యుద్దం కూడా అంతే ఉదృతంగా సాగుతుంది

TELANGANA | మేడిగడ్డ వరదలపై బీఆరెస్‌, కాంగ్రెస్‌ ట్వీట్ల వార్‌

మేడిగడ్డ నిలబడింది..కేసీఆర్‌కు సెల్యూట్‌ : కేటీఆర్‌ ట్వీట్‌
డ్రోన్‌ వీడియోలో గంతలు కట్టే ప్రయత్నం : కాంగ్రెస్‌ ఫైర్‌

విధాత, హైదరాబాద్ : గోదావరి వరదలతో మేడిగడ్డ బ్యారేజీ మొత్తం 85గేట్ల గుండా వరద నీరు దిగువకు ఉరకలేస్తున్న రీతిలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆరెస్‌ పార్టీల మధ్య మాటల యుద్దం కూడా అంతే ఉదృతంగా సాగుతుంది. ట్విటర్‌ ఎక్స్‌లో బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌పై కేటీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీపై కాంగ్రెస్‌ సాగించిన ప్రచారాన్ని తప్పుబడుతూ ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కాంగ్రెస్ కుట్రలే కొట్టుకుపోయాయని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రం సగర్వంగా తలెత్తుకుని సలాం చేస్తోందని ట్వీట్‌ చేశారు. పోటెత్తిన వరదకు దుష్టశక్తుల పన్నాగాలే పటాపంచలయ్యాయని, కానీ కేసిఆర్ సమున్నత సంకల్పం జై కొడుతోంది.. జల హారతి పడుతోందని, లక్షల క్యూసెక్కుల గంగా ప్రవాహంలో లక్షకోట్లు వృధా చేశారనే విమర్శలే గల్లంతయ్యాయని, కానీ మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మొక్కవోని దీక్షతో నిలబడిందని, కొండంత బలాన్ని చాటిచెబుతోందని పేర్కోన్నారు. ఎవరెన్నికుతంత్రాలు చేసినా దశాబ్దాలుగా దగాపడ్డ ఈ తెలంగాణ నేలకు ఇప్పటికీ.. ఎప్పటికీ మేడిగడ్డే మన రైతుల కష్టాలు తీర్చే “మేటి”గడ్డ..! అని కేటీఆర్‌ అభివర్ణించారు.
కాళేశ్వరమే కరువును పారదోలే “కల్పతరువు అని, బురద రాజకీయాలను భూస్థాపితం చేసిన ఈ మానవ నిర్మిత అద్భుతానికి, కేసీఆర్‌కు తెలంగాణ సమాజం పక్షాన మరోసారి సెల్యూట్ అంటూ జై తెలంగాణ జై కాళేశ్వరం అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. అంతకముందు కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరంపై చిల్లర ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు సిగ్గుతో తల దించుకోవాలన్నారు. మేం మొదటి నుంచి చెబుతున్నట్లుగా అక్కడ జరిగిన చిన్న విషయంపై తప్పుడు ప్రచారం చేశారని, కొన్ని రోజుల్లోనే రిపేర్లు పూర్తి అయ్యాయన్నారు. ఇప్పుడు భారీ వరద వస్తున్నా తట్టుకొని మేడిగడ్డ నిలబడడం అంటే అదే కాళేశ్వరం గొప్పతనమని, త్వరలోనే మేడిగడ్డను సందర్శిస్తామని, ప్రజలకు వాస్తవాలను వివరిస్తామన్నారు.

డ్రోన్‌ వీడియోలో గంతలు కట్టే ప్రయత్నం : కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫైర్‌

మేడిగడ్డలో ఏం జరిగిందో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కళ్లారా చూశారని, ఇప్పుడు డ్రోన్ వీడియోలతో ఆ తెలంగాణ సమాజం కళ్లకు గంతలు కట్టాలని కేటీఆర్ అండ్ కో ఆరాట పడుతోందని కాంగ్రెస్‌ పార్టీ ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ వేసింది. రాష్ట్ర ఇంజనీర్ల నుంచి నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వరకు అందరూ సాంకేతికంగా విచారించి, విశ్లేషించి కూలిన మేడిగడ్డ పై నివేదికలు ఇచ్చారని, గేట్లు మూస్తే ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. తాత్కాలిక మరమ్మతులు సూచించారని, కేసీఆర్ “స్కామిలీ” వల్ల కూలింది కాళేశ్వరం కాదని, తెలంగాణ ప్రజల ఆశలు అని తేలిందని పేర్కోంది. అక్టోబర్ 2023లో మేడిగడ్డ కూలితే తేలుకుట్టిన దొంగల్లా ఉన్నది ఎవరో కూడా తెలంగాణ సమాజం చూసిందని, దీనిపై ప్రజా ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ తో విచారణ జరిపిస్తోందని, నిజం నిగ్గుతేలడం ఖాయమని, అప్పటి వరకు “డ్రోన్ షాట్స్” భ్రమలో బతకండని సెటైర్‌ వేసింది. పింకీలు మీకు అలవాటే కదా…!
సోషల్ మీడియాలో మీ నైజం ఎలాంటిదో నిన్న ఒక సీనియర్ జర్నలిస్టు ఆవేదనతో రాసిన పోస్టు చెప్పకనే చెబుతోందని, తెలంగాణ ప్రజలంతా కళ్లారా చూసిన కూలిన మేడిగడ్డపై కూడా ఒక్క డ్రోన్ షాట్ తో కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేస్తున్నారంటే మీ బరితెగింపు సామాన్యమైనది కాదు కేటీఆర్ అండ్ కో!! అంటూ మండిపడింది.

నీటి నిల్వకే బ్యారేజీ..వదలడానికి కాదని సెటర్లు

మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహ ఉదృతి విజువల్స్‌తో బీఆరెస్‌ చేస్తున్న ప్రచారానికి కాంగ్రెస్‌ శ్రేణులు సైతం ట్విటర్‌ వేదికగా కౌంటర్‌ వేస్తున్నాయి. బ్యారేజీలు కట్టేది నీటిని ఆపి స్టోరేజ్ చెయ్యడానికని, వస్తున్న నీళ్లను వచ్చినట్టు వదిలేస్తుంటే ఇగ బ్యారేజీ ఎందుకంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 6రోజుల్లో 73టీఎంసీలు సముద్రం పాలవ్వడమే నిదర్శనమంటున్నారు. కాగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తింది. 2లక్షల క్యూసెక్కుల మేరకు ఇన్‌ఫ్లో సాగుతుండగా, బ్యారేజీ పూర్తి నీటి నిల్వ 16టీఎంసీలుగా ఉంది. దీంతో వచ్చిన వరద నీటిని వచ్చినట్లుగానే పూర్తిగా బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి‌, దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. మరోవైపు భారీ వరదతో మేడిగడ్డ బ్యారేజీ ప్రమాదంలో పడిందన్న ప్రచారం సైతం చోటుచేసుకుంది. అది మేడిగడ్డ కాదు మేడిపండు అని, భారీ వరదతో 20వ పీయర్ మరింత కుంగిందని.. 21వ పీయర్‌ పగుళ్లు పెరిగాయన్న ప్రచారం వినిపిస్తుంది.

గోదావరి వద్ధ మొదటి ప్రమాద హెచ్చరిక

భారీ వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి పెరుగుతున్నది. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం శనివారం మధ్యాహ్నం 4 గంటల వరకు 35 అడుగులకు నీటమట్టం చేరింది. నీటిమట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలు కొనసాగుతున్న క్రమంలో గోదావరిలో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని, 44 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కోన్నారు. గోదావరిలో 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద జారీ చేస్తారు. వరదల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు అధికారులను అప్రమత్తం చేశారు. మరో వైపు భద్రాచలంలోని తాలిపేరు జలాశయానికి భారీగా వరద కొనసాగుతున్నది. దాంతో అధికారులు ప్రాజెక్టు 26గేట్లు ఎత్తివేశారు. వచ్చిన వరదను దిగువకు వదులుతున్నారు.