ఆగమ శాస్త్ర ప్రకారం మాఢ వీధుల నిర్మాణం: విప్ దాస్యం వినయ్ భాస్కర్
భద్రకాళి ఆలయ మాఢ వీధుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ కింద రూ.20 కోట్లు.. కుడా ఖర్చు చేయనున్న రూ.10 కోట్ల నిధులు విధాత, వరంగల్: చారిత్రక భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాఢ వీధుల నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో భద్రకాళి మాఢ వీధుల నిర్మాణం పై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ […]

- భద్రకాళి ఆలయ మాఢ వీధుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ కింద రూ.20 కోట్లు..
- కుడా ఖర్చు చేయనున్న రూ.10 కోట్ల నిధులు
విధాత, వరంగల్: చారిత్రక భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాఢ వీధుల నిర్మాణం ఆగమ శాస్త్ర ప్రకారమే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో భద్రకాళి మాఢ వీధుల నిర్మాణం పై చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్ష సమావేశంనకు అధ్యక్షత వహించిన చీఫ్ విప్ పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి భద్రకాళీ దేవాలయం చుట్టూ మాఢ వీధులు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
భద్రకాళీ ఆలయం చుట్టూ మాఢ వీధులు నిర్మాణం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయని అన్నారు. అమ్మ వారి మాఢ విధుల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌డీఎఫ్ (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) కింద రూ.20 కోట్లు, కుడా కింద రూ.10 కోట్లు నిధులు ఖర్చు చేస్తుందని అన్నారు.
మాఢ వీధుల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహకారం నీట్ ప్రొఫెసర్లు అందిస్తారని అన్నారు. రాజగోపురం, మాఢ విధుల నిర్మాణానికి సంబంధించిన పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, మాఢ విధులు నిర్మాణం అమ్మ వారి పాదాల కింద ఉండే విధంగా నిర్మాణలు చేపట్టాలని అన్నారు.
నిర్మాణాలు అన్నీ సాంకేతిక నైపుణ్యం కలిగిన నిపుణులతో పాటు, శాస్త్ర ప్రకారమే ఉండాలన్నారు. నిర్మాణాలలో ఎటువంటి లోటు పాట్లు ఉండకూడదని, వరద నీరు ఎక్కడ నిలవకుండా చూడాలని అన్నారు. వచ్చే నెల వరకు అన్ని రకాల డిజైన్ లను తయారు చేయాలని తెలిపారు.
దసరా నాటికీ భక్తులకు మాఢ వీధులు అందుబాటులోకి తేవాలని, ప్రతి వారం ఈ వీధుల నిర్మాణంపై సమీక్ష సమావేశం ఉంటుందని స్పష్టం చేసారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చారిత్రక దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారన్నారు.
భద్రకాళీ దేవాలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవాలు పెద్ద ఎత్తున జరుపుతారని ఇక ఈ సేవలు మాడవీధుల్లో జరుగుతాయని అన్నారు. భద్రకాళి చెరువు నీటిలో గుర్రపు డెక్క ఆకులు, వ్యర్థ పదార్ధాలను ఎప్పటికప్పుడు తొలగించాలని అధికారులకు సూచించారు.
నగరంలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధ సహజమైన అందాలను అనుసంధానం చేయడం ద్వారా టురిజాన్ని ప్రోత్సహించవచ్చునని తెలిపారు. కాళోజీ కాలక్షేత్రం పనుల నత్త నడకపై కాంట్రాక్టర్‌పై అసహనం వ్యక్తం చేసారు. పనులను యుద్ధ ప్రతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.
స్మార్ట్ సిటీ పనులపై మాట్లాడుతూ.. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేయాలని అన్నారు. పూర్తయిన ప్రాజెక్టుల సమర్థ నిర్వహణపైనా అధికారులు దృష్టి సారించాలన్నారు. అధికారులు 100 ఫీట్ రోడ్డు సందర్శించి, ప్రజాప్రతినిధులు, ప్రజల సూచనల పరిగణనలోకి తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. సమ్మయ్య నగర్ దగ్గర నాలా దారి మల్లింపు పనులలో పైపులకు బదులు స్లాబ్‌తో నిర్మించాలని అన్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ భద్రకాళి దేవాలయం నిర్మాణానికి ఎటువంటి నిధుల కొరత లేదని, అవసరమైతే మరిన్ని నిధులు తెస్తామన్నారు. నిర్మాణంలో ఎక్కడ రాజీ పడరాదని అన్నారు.
ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మాట్లాడుతూ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని అన్నారు. అనంతరం అధికారులు భద్రకాళి మాడవీధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డిఆర్ఓ వాసు చంద్ర, కూడా పిఓ అజిత్ రెడ్డి, భద్రకాళి దేవస్థానం ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ హెడ్ పాండురంగారావు, తెలంగాణ రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ఏడీజీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఎస్ఓ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.