మోడీవి దిగజారీన రాజకీయాలు: సీపీఐ నారాయణ

మోడీవి దిగజారీన రాజకీయాలు: సీపీఐ నారాయణ
  • ప్రభుత్వ ఖర్చులతో వచ్చి పార్టీ ప్రచారమా
  • కాంగ్రెస్‌తో పొత్తు నిశ్చితార్ధం వద్దనే ఉంది

విధాత : కేసీఆర్‌ ఎన్డీయేలో కలుస్తారని పాత విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు ఎందుకు చెప్పారని, ఆయనవన్ని దిగజారుడు రాజకీయాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ విమర్శించారు. హైద్రాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రభుత్వ ఖర్చులతో రాష్ట్రంలో పర్యటిస్తూ పార్టీ సభల్లో రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.


కేసీఆర్‌ను ఉద్ధేశించి మోడీ చేసిన వ్యాఖ్యలపై స్వయంగా కేసీఆర్‌ సమాధానం చెప్పాలన్నారు. లేదంటే మోడీని నమ్మనట్లుగానే కేసీఆర్‌ను కూడా అనుమానించాల్సివుంటుందన్నారు. ఏపీలో విలువైన ఇసుక బీచ్‌లను ఆదానీకి ఎందుకు అప్పగించారన్న రహస్యాన్ని ప్రధాని మోడీ చెప్పాలన్నారు.


లిక్కర్‌ స్కామ్‌లో బీఆరెస్‌, వైసీపీలు బీజేపీతో కలిసిపోయాయని, మిగతా పార్టీల వారిని జైళ్లలో ఉంచుతున్నారని, వేలకోట్లు తిన్న వాళ్లు బయట ఉన్నారని విమర్శించారు. కేంద్రంలో ప్రధాని మోడీ, ఏపీలో జగన్‌ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని నారాయణ విమర్శించారు.


వందల కోట్ల అవినీతి పేరుతో చంద్రబాబును జైల్లో పెట్టారని , ఆయనను అక్రమ పద్దతిలో అరెస్టు చేశారని, చంద్రబాబు ఏమన్నా దేశం వదిలి పారిపోడు కదా అని, అలాంటప్పుడు ఆయన్ని జైల్లో పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు. చంద్రబాబును దెబ్బకొడితే ఏపీలో బీజేపీకి బూస్టు ఇవ్వవచ్చన్నది మోడీ ప్లాన్‌గా కనిపిస్తుందన్నారు.


ఎన్నో అవినీతి కేసులున్న ఏపీ సీఎం జగన్‌ను పక్కన పెట్టడం మోడీకి పెద్ద పనేమి కాదన్నారు. ఆ విషయం తెలియని జగన్‌ ఎగిరెగిరి పడుతున్నారన్నారు. తెలంగాణలో వామపక్షాలతో కాంగెస్‌ పొత్తు వ్యవహారం నిశ్చితార్ధం వరకే వచ్చిందన్నారు. ఇంకా సీట్ల సర్ధుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయన్నారు.


ఏపీలో ఎన్నికలు చాల దూరం ఉన్నాయని, అక్కడ పొత్తులపై ఇప్పటికైతే ఆలోచన లేదన్నారు. దేశంలో నిజమైన కూటమి బీజేపీ బీఆరెస్‌ ఎంఐఎంలదేనని నారాయణ చురకలేశారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే ఉత్తర భారత్‌, దక్షిణ భారత్‌ అంటూ దేశం విడిపోయే ప్రమాదముందన్నారు.