Warangal: BJP.. ఢిల్లీ గద్దె దిగే వరకు CPI పోరాటం ఆగదు: చాడ వెంకట్ రెడ్డి

బీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి ప్రజాపోరు యాత్రకు జనగామలో ఘన స్వాగతం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నదని, బీజేపీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి అన్నారు. విభజన హామీలు […]

Warangal: BJP.. ఢిల్లీ గద్దె దిగే వరకు CPI పోరాటం ఆగదు: చాడ వెంకట్ రెడ్డి
  • బీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు
  • విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం
  • సీపీఐ జాతీయ సమితి కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి
  • ప్రజాపోరు యాత్రకు జనగామలో ఘన స్వాగతం

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నదని, బీజేపీని గద్దె దించే వరకు పోరాటం చేస్తామని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్ రెడ్డి అన్నారు.

విభజన హామీలు అమలు చేయాలనీ సిపిఐ ఆధ్వర్యంలో బయ్యారం నుండి చేపట్టిన ప్రజాపోరు యాత్ర సోమవారం జనగామకు చేరుకుంది. వడ్లకొండ క్రాస్ రోడ్డు వద్ద భారీ స్వాగతం పలికారు. అక్కడి నుండి పాదయాత్రగా ప్రెస్టన్ గ్రౌండ్ చేరుకున్నారు. వివిధ గ్రామాల నుండి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఈ సందర్బంగా జరిగిన సభకు మాజీ ఎమ్మెల్యే సిపిఐ జనగామ జిల్లా కార్యదర్శి సి.హెచ్. రాజారెడ్డి అధ్యక్షత వహించగా వెంకట్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి మోడీ దేశ సంపద ను కార్పొరేట్ శక్తులకు కట్ట బెట్టారన్నారు. ఆదాని ఆస్తులు ఒక్కసారి పెరగడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. ఆదాని ఆస్తుల గురుంచి మాట్లాడేందుకు కమిటీ ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగం సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీకి రాజ్యాంగం పై నమ్మకం లేదు

బీజేపీకి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పై గారవం లేదన్నారు. మతోన్మాదంతో మనుధర్మం చొప్పిస్తుందని చాడ విమర్శించారు. వీటిపైన ప్రశ్నించన వారి గొంతు నొక్కుతుందన్నారు. వర‌వ‌ర‌రావు, సాయిబాబా లాంటి వారిని జైల్లో పెట్టినప్పుడే అర్ధం అయిందన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపే ఉదాహరణ అన్నారు. ఇక బీజేపీ ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అన్నారు.

విభజన హామీల అమలు పట్ల నిర్లక్ష్యం

విభజన హామీలను ఎందుకు తుంగలో తొక్కారని చాడ ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఖాజిపేట కోచ్ ప్యాకేట్ట్రీ, గిరిజన యూనివర్సిటీ వంటి వంటి హామీలు ఎందుకు అమలు చేయలేదన్నారు. నీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా మరిచి పోయారని మండిపడ్డారు. వీటిపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. సిపిఐ ప్రజల కోసమే పోరాటాలు చేస్తుందన్నారు. బయ్యారం ఉక్కు ను వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన అల్లుడికి లీజుకు ఇస్తే అడ్డుకుంది సిపిఐ అన్నారు. దీని వలన వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఇప్పటికైనా విభజన హామీలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గుడిసెలు వేసుకున్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. గుడిసెలు వేసుకున్న వారికీ ఇండ్లు కట్టిస్తామని తనతో స్వయంగా చెప్పారన్నారు. ఇప్పటికైనా ఇవ్వాలని, సొంత జాగా ఉన్న వారికీ 5లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

యాత్ర ద్వారా లక్షమందిని కలిశాం

విభజన హామీలు అమలు చేయాలనే డిమాండ్ తోనే పోరుయాత్ర చేపట్టడం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాసరావు అన్నారు. 36 మండలాల్లో పర్యటించి లక్ష మందిని కలిశామన్నారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా ఈ యాత్ర సాగుతుంది అన్నారు. తెలంగాణ ఏర్పాటు సందర్బంగా అనేక హామీలు ఇచ్చారన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కోచ్ ప్యాకెర్టీ, గిరిజన యూనివర్సిటీ ముఖ్యమైనవి అన్నారు. వాటిని సాధించాలనే లక్ష్యంతో పోరుయాత్ర చేస్తున్నామని అన్నారు. 9ఏండ్లు గా మోసం చేసిన బీజేపీ ఇంకా నమ్మిస్తే ప్రజలు ఊరుకోరన్నారు.

ఇప్పటికి అయినా విభజన హామీలు అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ నెల 5 హన్మకొండ లో జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ సందర్బంగా కళాకారుల అటపాఠాలు అలరించాయి. రెడ్ షర్ట్ వాలింటర్స్ తో జనగామ ఎరుపెక్కింది. కార్యక్రమంలో కొరిమి రాజ్ కుమార్,కర్రె భిక్షపతి, తమ్మెర విశ్వేశ్వరరావు, పంజాల రమేష్, ఎన్ జ్యోతి, పాతూరి సుగుణమ్మ, ఎస్ కె బాష్మియా, ఆది సాయన్న, మంద సదాలక్ష్మి, ఆకుల శ్రీనివాస్, చొప్పరి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.