నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు

నాంపల్లి బజార్‌ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.

నాంపల్లి అగ్నిప్రమాదంలో తొమ్మిదికి చేరిన మృతులు
  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం
  • సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్‌
  • మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేటీఆర్‌
  • రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి : గవర్నర్‌ తమిళి సై
  • ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే అగ్నిప్రమాదలు : రేవంత్‌ రెడ్డి, కిషన్‌ రెడ్డిలు


విధాత : నాంపల్లి బజార్‌ఘాట్‌లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఫ్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందడం అందరినీ కలిచివేసింది. నాలుగు అంతస్తుల భవనంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లోని గ్యారేజ్‌లో అగ్నిప్రమాదం సంభవించగా, మంటలు పై అంతస్తుల వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది మరణించారు. వారిలో కొందరు సజీవ దహనమవ్వగా, మరికొందరు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక నాలుగు రోజుల పసికందు కూడా ఉన్నారు. మొదటి, రెండో ఫ్లోర్‌లలో ఉన్న వారే ఏడుగురు మృతి చెందగారు.


మూడు, నాలుగు అంతస్తుల్లో ఉన్నవారిని డీఆర్‌ఎఫ్‌, ఫైర్‌ సిబ్బంది రక్షించారు. వారిలో కూడా ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు చెలరేగి అక్కడే నిల్వ ఉంచిన కెమికల్స్‌, డీజిల్‌ డ్రమ్ముల కారణంగా అపార్ట్‌మెంట్‌ అంతా విస్తరించాయి. అపార్ట్‌మెంట్‌ యజమాని రమేశ్‌ జైశ్వాల్‌ అక్రమంగా నిల్వ ఉంచిన కెమికల్స్‌ కారణంగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడానికి కారణమయ్యాయని పోలీసులు గుర్తించారు. అతడు ప్రస్తుతం పరారిలో ఉన్నాడు.


డీసీపీ సత్యనారాయణ ఘటన స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల్లో ఆరుగురు ఓకే కుటుంబానికి చెందిన వారు కావడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బీడీఎస్ డాక్టర్ తహూరా ఫర్హీన్ సెలవులు కావడంతో తన ఇద్దరు చిన్నారులతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఉదయం జరిగిన ప్రమాదంలో తన ఇద్దరు చిన్నారులతో సహా ఫర్హీన్‌ ప్రాణాలు కోల్పోయింది. మృతుల్లో మహ్మద్‌ ఆజమ్(58), రెహానా సుల్తానా(50), మహ్మద్ హసీబుర్ రెహమాన్(32), ఫైజా సమీన్‌ (25), బీడీఎస్‌ డాక్టర్‌ తహురా ఫర్హీన్‌(38), ఆమె పిల్లలు తూభ(5), తరుబా(12)లు, నికత్‌ సుల్తానా(55), జకీర్‌ హుస్సెన్‌(66)లు ఉన్నారు.


మృతులకు 5లక్షల సహాయం – మంత్రి కేటీఆర్‌


నాంపల్లి అగ్ని ప్రమాద మృతులకు కుటుంబాలకు ప్రభుత్వ పరంగా 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లుగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. సంఘటన స్థలాన్ని మంత్రి తలసానితో కలిసి సందర్శించిన కేటీఆర్‌ గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా కెమికల్స్ నిల్వ చేశారా అనే దానిపై విచారణ జరిపిస్తామన్నారు. ఆరు నెలల కిందటే ఫైర్ సేఫ్టీ ఆడిట్ చేయించామన్నారు. అటు నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


గవర్నర్‌ తమిళి సై ప్రమాదం పట్ల తన విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక అందించాలని అధికారులకు ఆదేశించారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి సైతం ప్రమాద స్థలాన్ని సందర్శంచి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే తరుచు అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. కాగా అగ్నిప్రమాద బాధితులను పరమార్శించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ వచ్చిన సందర్భంలో కాంగ్రెస్‌, బీఆరెస్‌ వర్గాల మధ్య తోపులాట సాగగా, పోలీసులు వారిని చెదరగొట్టారు.


నాంపల్లి అగ్ని ప్రమాదం పై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి


నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


అగ్ని ప్రమాదంపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి


నాంపల్లి బజార్ ఘాట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ అగ్ని ప్రమాదాలకు నిలయంగా మారిపోయిందన్నారు. వరస అగ్ని ప్రమాదలు జరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమైందన్నారు. తాజా అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. అపార్ట్‌ మెంట్‌ సెల్లర్ లో కారు మరమ్మతులు ఏమిటని ప్రశ్నించారు.


రెసిడెన్షియల్ ఏరియా లో కెమికల్ డ్రమ్ములు ఎలా నిలువ చేశారని, ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలన్నారు. మృతులకు ప్రగాఢ సంతాపం.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్‌ చేశారు.