కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది

- ఇంటికి వెళ్లి కండువా కప్పిన రేవంత్‌రెడ్డి
- కలిసి పోరాడాలని పిలుపు
విధాత, హైదరాబాద్ : మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి, కార్పోరేటర్ నిహారికలు కాంగ్రెస్ లో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా సుధీర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనకు కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. రేవంత్ ఆహ్వానం మేరకు వారంతా తమ మద్దతుదారులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ సుధీర్ రెడ్డి గొప్ప నిర్ణయం తీసుకున్నారని, వారిని మనస్పూర్తిగా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు. నన్ను గల్లీ నుంచి ఢిల్లీకి పంపించడంలో ఈ నియోజకవర్గ ప్రజల శ్రమ ఉందన్నారు. పాలు అమ్ముకునే వాడొకడు..కాలేజీ సీట్లు అమ్ముకునేవాడొకడు ఇక్కడ ఉన్నారని, ఆ మామా అల్లుళ్లకు బుద్ది చెప్పి నన్ను ఎంపీగా గెలిపించారన్నారు. ఇక్కడి ప్రజలకు, ఈ ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నానన్నారు. పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. జవహర్ నగర్ డంప్ యార్డు నుంచి విముక్తి కల్పించే బాధ్యత మాదేనన్నారు.
Former Medchal MLA Malipeddi Sudhir Reddy garu , Zilla Parishad Chairman Sarath Chandra Reddy garu, Corporator Niharika garu ,former sarpanches and other leaders joined @INCIndia today. #Congress6Guarantees#Congress6TelanganaVictoryFix#KCRNeverAgain #ByeByeKCR pic.twitter.com/hwHJ27ukP3
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2023
అంతర్జాతీయ ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఐటీ హబ్ గా మారుస్తామని, మెట్రో రైలును ఈ ప్రాంతానికి పొడగించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత సుధీర్ రెడ్డికి రాజకీయంగా సముచిత గౌరవం కల్పిస్తామన్నారు. టికెట్ రానివారి ఆవేదనను నేను అర్ధం చేసుకోగలనని, ఎవరిపై మాకు ద్వేషం లేదన్నారు. అందరినీ కలుపుకుని పనిచేయాలని, ముందున్న లక్ష్యాన్ని చూడాలని, కార్యకర్తల కష్టాలు చూడాలని, వారి అభిష్టం మేరకు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా పోరాడాలని కోరారు. పార్టీ గెలిచాక అందరికి న్యాయం, గౌరవం దక్కుతుందన్నారు.