మూడోసారి బీఆర్ఎస్‌ను ఆశీర్వదించండి: గుత్తా

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి ప్రజలు ఆశీర్వదించాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. సోమవారం నల్గొండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసిన కేసీఆర్ మరో ఐదేళ్లల్లో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. బీపీఎల్ కుటుంబాలకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. రైతు బీమాకు సమానంగా కేసీఆర్ బీమా అందించడం సంతోషకరమన్నారు. రైతులపై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు నిదర్శనంగా మరోసారి రైతుబంధు మొత్తాన్ని పెంచారన్నారు. వచ్చే ఐదేళ్లల్లో రైతుబంధు మొత్తాన్ని ఎకరాకు రూ.16వేలు చేయబోతున్నారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసినా, చేయకపోయినా పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఒక్క తెలంగాణ మాత్రమే అన్నారు. మహిళా సంక్షేమం కోసం మహాలక్ష్మీ, గ్యాస్ సబ్సిడీ, పెన్షనర్లు, కులవృత్తులకు పెన్షన్ మార్చి నెల నుంచి రూ.3016, సంవత్సరానికి రూ.500లు పెంచుతూ ఐదేళ్లల్లో రూ.5వేలు, వికలాంగులకు రూ.6వేల వరకు పెంచడం దేశానికే మార్గదర్శకంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు కూడా రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టాలనుకోవడం మంచి నిర్ణయం అన్నారు. అసైన్డ్ ల్యాండ్ పట్టాదారులకు సంపూర్ణమైన హక్కులు కల్పించాలని ఆలోచనతో ఉన్నారని చెప్పారు. మైనార్టీల సంక్షేమాన్ని భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లాలనే యోచనతో ముఖ్యమంత్రి ముందుకెళ్తున్నారని తెలిపారు.