లీక్‌లతో కాంగ్రెస్ ఫేక్ ప్రచారం: హరీష్ రావు

- కాంట్రాక్టర్ల బిల్లులపై ప్రేమ.. రైతులపై లేదు
- హామీల అమలులో కాంగ్రెస్ మోసం
- మాజీ మంత్రి టి.హరీశ్‌రావు
విధాత : రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక అవినీతి విచారణల పేరుతో లీక్‌లు ఇస్తూ ఫేక్ ప్రచారాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తుందని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం కామారెడ్డి నియోజకవర్గం బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రైతాంగాన్ని అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, రైతులంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపని.. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంటేనే రైతులకు భరోసా అని హరీశ్‌రావు స్పష్టం చేశారు . రాష్ట్రంలో 280 మంది రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీ కారణమైందని.. 38 మంది ఆటో కార్మికుల ఆత్మహత్యలకు కారణమైందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కరువు వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలో ఉన్న ప్రేమ రైతులపై లేదని మండిపడ్డారు. సాగునీరు లేక పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను పరమర్శించడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులకు సమయం లేదా అని ప్రశ్నించారు. 100 మందిరోజులుగా కాంగ్రెస్ పార్టీ ఉద్దెర మాటలు చెప్పింది గానీ ఉద్దరించిందేమీ లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రైతులకు, ప్రజలకు కరెంటు కష్టాలు తప్పవని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని రేవంత్‌రెడ్డి అన్నారని.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అన్ని గ్యారంటీలకు ఎగనామం పెడతారన్నారు. రుణమాఫీ ఎగ్గొట్టినా, రైతుబంధు ఇవ్వకున్నా తమకే ఓటేశారని రేవంత్ అంటడని, ఇప్పటికే డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని ఇంతవరకు చేయలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని హరీష్ రావు కోరారు.
ఎమ్మెల్యేలను కొనవచ్చేమో…ఉద్యమకారులను కొనలేరు
సీఎం రేవంత్‌రెడ్డి మా పార్టీ ఎమ్మెల్యేలను కొంటారు తప్ప ఉద్యమకారులను, కార్యరక్తలను కొనలేరని హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సే.. ఎవరూ అధైర్యపడవద్దన్నారు. పార్టీ మారిన దొంగలను మళ్లీ పార్టీలోకి తీసుకోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే బీఆరెస్ పార్టీ గెలిపించాలని పిలుపునిచ్చారు ప్రజలకు నిజమేంటో నిలకడమీద తెలుస్తుందని.. కాంగ్రెస్ మోసాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిదన్నారు. కేసీఆర్ మాట తప్పని మనిషి అని.. కల్యాణలక్ష్మి, పింఛన్లు.. ఏ హామీ విషయంలోనూ మాట తప్పలేదని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి యాసంగి వడ్లకు, మక్కలకు 500 బోనస్ ఇస్తా అన్న మాటను నిలబెట్టుకోవాలని.. కారుకు ఓటేసి వాళ్లకు గుణపాఠం నేర్పాలన్నారు. ప్రతి నెల రూ.2,500, డిసెంబర్ నెల నుంచి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దేవుళ్లను రాజకీయ కోసం వాడుకుంటున్న పార్టీ బీజేపీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మెనార్జీలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ కన్నా యజ్ఞ యాగాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరు లేరన్నారు. బీజీపీ దేశంలో రైతుల కోసం, గిరిజనుల కోసం చేసిందేం లేదని. తెలంగాణ రాష్ట్రం తరపున ప్రశ్నించే గొంతుకగా, ఆత్మగౌరవ ప్రతీక అయిన బీఆరెస్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆరెస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్‌ను గెలిపించుకోవాలన్నారు.