పంటల బీమాతో మీకేం ఇబ్బంది?.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

- ఎందుకు అమలు చేయటం లేదు?
- 10 వేలు ఇవ్వడం కంటే ఇవి మంచివి కదా!
- పథకం కేంద్రానిదా? రాష్ట్రానిదా? అని కాదు..
- అది రైతుకు ప్రయోజనం చేకూర్చేదై ఉండాలి
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయండి
- తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా
విధాత, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఎఫ్‌బీవై పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ అమలు చేస్తే మీకు ఇబ్బందేంటని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పలు శాఖల అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన్ (పీఎంఎఫ్‌బీవై)ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇక్కడి రైతులకు కూడా వర్తింపజేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను హైకోర్టు సూమోటో పిల్‌గా విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
దేశవ్యాప్తంగా ప్రకటించిన ఈ పథకం తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నదని ఆయన పిల్‌లో పేర్కొన్నారు. దాదాపు 2 కోట్ల ఎకరాలకుపైగా సాగు భూమి ఉన్న రాష్ట్రంలో 58.33 లక్షల మంది రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ప్రతీసారి వరదలు, ఇతర కారణాలతో పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నారని న్యాయస్థానానికి వివరించారు. ఇలాంటి వారికి బీమా పథకం ఎంతో అవసరమని, పలుమార్లు దెబ్బతిన్న పంటలకు పీఎంఎఫ్‌బీఐ బదులు నష్ట పరిహారం అందజేస్తున్నా.. అది అందరికీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.
గత మార్చి, ఏప్రిల్‌లోనే సుమారు 7 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని, ఇలాంటి పరిస్థితుల్లో సమగ్ర పంటల బీమా పథకం అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు. ‘రైతులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చే పీఎంఎఫ్‌బీవైను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు? ఆ పథకం అమలు చేయడంలో మీకేంటి ఇబ్బంది? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
సంబంధం లేకుండా రూ.10 వేలు ఇవ్వడం కంటే.. రైతులకు ఎక్కువ ప్రయోజనం చేకూర్చే ఫసల్ బీమా యోజనను అమలు చేయడం మంచిది కదా అని వ్యాఖ్యానించింది. పథకం కేంద్ర ప్రభుత్వానిదా.. రాష్ట్ర ప్రభుత్వానిదా అని కాకుండా రైతుకు ప్రయోజనం చేకూర్చేదై ఉండాలని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసనం సూచించింది. దీనిపై పూర్తి వివరాలతో ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.