జగదీశ్ రెడ్డి వర్సెస్ మంత్రులు
శాసన సభలో విద్యుత్తు రంగం శ్వేత పత్రంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి, మంత్రులకు, ముఖ్యంగా కోమటిరెడ్డి

♦ జగదీశ్ రెడ్డి వర్సెస్ మంత్రులు
♦ కోమటిరెడ్డి బ్రదర్స్‌తో వాగ్వివాదం
శాసన సభలో విద్యుత్తు రంగం శ్వేత పత్రంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డికి, మంత్రులకు, ముఖ్యంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు మధ్య సాగిన పరస్పర విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది.జగదీశ్ రెడ్డి శ్వేతపత్రంపై చర్చను ప్రారంభించి మాట్లాడుతూ తమ పాలనలో విద్యుత్తు రంగాన్ని దేశంలో నెంబర్ వన్‌గా చేశామని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తనతో పాటు విద్యార్థులతో పదవ తరగతి పరీక్షలొస్తే కిరోసిన్ దీపాలు, కొవ్వోత్తుల వెలుగుల్లో చదివే దుస్థితి ఉండేదని, వ్యవసాయ, పరిశ్రమలు కరెంటు కోతలతో కష్టనష్టాలతో సాగేవన్నారు.
మంత్రి వ్యాఖ్యలపై శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బీఆరెస్ సభ్యుల మాటలు చూస్తే తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడి ప్రజలు తాగునీళ్లు, కరెంటు చూడనట్లుగా, నాగరికత లేనట్లుగా, వాళ్లే వచ్చి తెలంగాణ రాష్ట్రం కనిపెట్టినట్లుగా, విద్యార్థులతో విద్యుత్తు పరంగా చదవనట్లుగా చెప్పడం అతిగా ఉందని కౌంటర్ వేశారు.
వాళ్ల ఇళ్లలో ఇచ్చిన కరెంటు ఆనాటి కాంగ్రెస్ పాలకులు ఇచ్చిందేనన్న సంగతి మరువరాదన్నారు. యూపీఏ హాయంలో ఏర్పాటైన విద్యుత్తు ప్రాజక్టులు, గ్రిడ్‌లతో దేశంలో విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా పెరిగిందన్నారు. తెలంగాణ డిమాండ్‌కు ప్రధాన కారణాల్లో విద్యుత్తు సమస్య కూడా ఒకటని అందుకే అంతా కలిసి స్వరాష్ట్రం కోసం కొట్లాడామన్నారు.
డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ 2014కు ముందు రాష్ట్రంలో విద్యుత్తు లేనట్లుగా జగదీశ్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. 81,516కోట్ల బకాయిలు ఉన్నాయని, డిస్కంలకు ప్రభుత్వ బకాయిలు 28,842కోట్లు, సాగునీటి బకాయిలు 14,193కోట్లు ఉన్నాయని, డిస్కంల ఆర్ధిక భారాన్ని 14,928కోట్లు మరింత పెంచాయన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ 24ఉచిత విద్యుత్తులో జగదీశ్‌రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని, దీన్ని తాము ఇప్పటికే లాగ్ బుక్‌ల ద్వారా నిరూపించామని, దెబ్బకు అన్ని సబ్ స్టేషన్ల లాగ్ బుక్‌లను హైద్రాబాద్‌కు తెప్పించుకున్నారని విమర్శించారు.
ఉచిత విద్యుత్తు కాంగ్రెస్ పేటెంట్ అన్నారు. యాదాద్రి పవర్ ఫ్లాంట్ ఒపెన్ టెండర్ వేయకుండా 20వేల కోట్ల స్కాం చేసి జగదీశ్‌రెడ్డి 10వేల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. అవినీతి పరులు, దొంగలంటే జగదీశ్‌రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడన్నారు. జగదీశ్‌రెడ్డి, సీఎండి ప్రభాకర్‌రావు సహా బీఆరెస్ వాళ్లు దోచుకు తిన్నదంతా కక్కిస్తామన్నారు.
దీనిపై జగదీశ్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ అవినీతి అంటూ ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సిటింగ్ జడ్జితో విచారణ జరుపుకొవచ్చన్నారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందిస్తూ చత్తీస్ ఘడ్ నుంచి విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపైన, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాలపైన, ఒప్పందాలపైన జ్యూడిషియల్ విచారణ జరిపిస్తున్నట్లుగా ప్రకటించారు.
గత పాలకులు విద్యుత్తు రంగంలో చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా మంత్రులపై ఎదురుదాడికి దిగడం సరికాదన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ విద్యుత్తు రంగంలో గత ప్రభుత్వం అనేక తప్పులకు పాల్పడిందన్నారు.
♥ రాజగోపాల్‌రెడ్డితో రచ్చరచ్చ
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యుత్తు రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పులమయంగా చేసిందన్నారు. కేసీఆర్ నియంత పాలన నుంచి విముక్తి అయ్యారన్నారు. ఈ సందర్భంగా బీఆరెస్ పక్షం నుంచి పార్టీలు మారిన నీవు మాట్లాడేందన్న వ్యాఖ్యలు వినిపించాయి.
దీంతో రెచ్చిపోయిన రాజగోపాల్‌రెడ్డి నేను మీ పార్టీల వారిలాగా పార్టీ ఫిరాయించలేదని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారానన్నారు. మీ కేసీఆర్ పార్టీలు మారలేదా మీ గత మంత్రులు పార్టీలు మారలేదా అంటు విమర్శలకు దిగారు. నేను ఏ పార్టీలో ఉన్న కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడనన్నారు.
బీఆరెస్ రానున్న రోజుల్లో కనుమరుగవ్వడం ఖాయని, ఆ పార్టీ నేతలను దేవుడు కూడా కాపాడలేరని, నా మీద దాడి చేస్తే సహించేది లేదని, పదేళ్ల పాటు మీ విమర్శలను భరించానని, ఖబడ్ధార్ అంటూ విరుచుకపడ్డారు.
జగదీశ్ రెడ్డి ప్రస్టేషన్‌లో ఉన్నారని, కిరోసిన్ దీపంతో చదివిన జగదీష్ కి వేలకోట్లు ఎలా వచ్చాయని, ఇంతకాలం మీరు చేయాల్సింది చేశారు ఇప్పుడు మేము చేస్తాం అంటూ హెచ్చరికగా మాట్లాడారు. దీంతో జగదీశ్‌రెడ్డి సభ్యుడు ఖబడ్ధార్ అంటూ బెదిరింపులకు దిగి అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడారని, దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ సభ్యులంతా దీనిపై పట్టుబట్టారు.
దీంతో స్పీకర్ ప్రసాద్ స్పందిస్తూ రికార్డులను పరిశీలించి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను తొలగిస్తామన్నారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి చర్చను కొనసాగించారు. రాష్ట్రాన్ని బీఆరెస్ పాలన అప్పుల పాలు చేసిందని, అభివృద్ధి కోసం కాకుండా కమిషన్ల కోసమే అంచనాలు పెంచి ప్రాజెక్టులు, ఫ్లాంట్లు కట్టారని ఆరోపించారు. విద్యుత్తు శాఖ అప్పులు వాస్తవానికి 1లక్ష 16వేల కోట్ల పైగా ఉన్నాయన్నారు.
అదనంగా లక్ష 16 వేల కోట్ల పైచిలుక అవుతుంది. మార్కెట్లో తక్కువ రేటుకు పవర్ దొరుకుతున్నప్పటికీ ఎక్కువ ధరకు ఎందుకు కొనుగోలు చేశారని ప్రశ్నించారు. బొగ్గు గని ప్రాంతాల్లో పెట్టకుండా యాదాద్రి ఫ్లాంటను దామరచర్లలో పెట్టి ఆ ప్రాంతమంతా కాలుష్య భరితం చేస్తున్నారు.
ప్రజల సొమ్ము వృధా చేశారని, ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు గత పాలకులు ఏకపక్షంగా ప్రతిపక్షాల అభిప్రాయలు తీసుకోకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ శాఖతోపాటు ఆర్ధిక రంగాన్ని గాడిలో పెడుతుందని, ఇచ్చిన హామీల అమలు చేస్తుందన్నారు.