మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌తో భేటీయైన జిట్టా

మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌తో భేటీయైన జిట్టా
  • బీఆరెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం


విధాత : యువ‌జ‌న సంఘాల నేత‌, తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, భువనగిరి కాంగ్రెస్ నేత జిట్టా బాల‌కృష్ణ రెడ్డి హైద‌రాబాద్‌లో మంత్రులు హ‌రీశ్‌రావు, కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పైన, పార్టీలో జిట్టా చేరికపై చర్చలు జరిగినట్లుగా సమాచారం. త్వ‌ర‌లోనే జిట్టా బాల‌కృష్ణ రెడ్డి త‌న అనుచ‌రులు, మద్దతుదారులతో క‌లిసి కారెక్కేందుకు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. జిట్టా భువనగిరి కేంద్రంగా తెలంగాణ మలిదశ ఉద్యమ విస్తరణలో కీలకంగా వ్యవహారించారు.


తెలంగాణ సంబురాలు, ధూమ్‌ధామ్‌ల నిర్వాహణతో ఉద్యమ విస్తరణకు పాటుపడ్డారు. 2004ఎన్నికల్లో ఆలే నరేంద్ర కోసం తన భువనగిరి టికెట్‌ త్యాగం చేశారు. 2009లో మహాకూటమి పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీటు వదిలేయడంతో కేసీఆర్‌తో విబేధించి రెబల్‌గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. వైఎస్‌ ప్రభుత్వ హాయంలో కాంగ్రెస్‌లో చేరారు. 2014, 2018ఎన్నికల్లోనూ యువతెలంగాణ పార్టీ నుంచి బరిలోకి దిగి ఓటమి చెందారు.


2022జూన్‌ 2న బీజేపీలో ఆ పార్టీని విలీనం చేసి, అందులోనూ ఇమడలేక భువనగిరి కాంగ్రెస్‌ టికెట్‌ హామీతో ఆ పార్టీలో చేరారు. అయితే ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆరెస్‌లో చేరిన నెల రోజులకే తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో టికెట్‌ రాదన్న అభిప్రాయంతో జిట్టా తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇన్నాళ్లకు మళ్లీ తన సొంత గూటికి చేరుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌లతో చర్చలు జరిపారు.