కమ్యూనిస్ట్ యోధుడు.. పేదల పక్షపాతి కేవల్ కిషన్: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్

సమాధి వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ రావు విధాత, మెద‌క్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో: కమ్యూనిస్ట్ యోధుడు, పేదల పక్షపాతి.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వ్యక్తి కేవల్ కిషన్ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో క‌లిసి కెవల్ కిషన్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. జల్, జంగల్, జమీన్ కోసం పేద ప్రజల భుక్తి కోసం అలుపెరుగని పోరాటం […]

కమ్యూనిస్ట్ యోధుడు.. పేదల పక్షపాతి కేవల్ కిషన్: ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
  • సమాధి వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యేలు ఈటెల, రఘునందన్ రావు

విధాత, మెద‌క్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో: కమ్యూనిస్ట్ యోధుడు, పేదల పక్షపాతి.. జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన వ్యక్తి కేవల్ కిషన్ అని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో క‌లిసి కెవల్ కిషన్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జల్, జంగల్, జమీన్ కోసం పేద ప్రజల భుక్తి కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహాయోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని కొనియాడారు. 62వ వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా పొలంపల్లి గ్రామ శివారులోని కామ్రేడ్ కిషన్ సమాధుల వద్ద నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

స్వాతంత్ర్యానికి పూర్వం నుండి స్వాతంత్ర్య‌ అనంతరం వరకు చాలామంది యోధులు పేద ప్రజల పక్షాన పోరాడారని తెలిపారు. పంతాలు వేరైనా సిద్ధాంతాలు వేరైనా అందరి గమ్యం పేద ప్రజల కోసమేనని పేర్కొన్నారు. అలనాటి కొమరం భీము నుండి మెదక్ జిల్లా వాసి కామ్రేడ్ కేవల్ కిషన్ వరకు ఎంతోమంది పేద ప్రజల కోసం పోరాటాలు చేసిన స్ఫూర్తిని ప్రజలు మర్చిపోలేదన్నారు.

పీడిత ప్రజల కోసం తన సొంత భూమి సైతం పంచిపెట్టి భూస్వాముల చేతిలో దారుణ హత్యకు గుర‌వ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఖమ్మం పట్టణంలో కామ్రేడ్ కిషన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అటవీ ప్రాంతంలో కిషన్ పేరు పెట్టడం, స్మారక స్థూపం ఏర్పాటు చేయడం తదితర అంశాలను ప్రభుత్వం తీసుకొస్తున్నట్టు తెలిపారు.

ఒక వ్యక్తిని దైవ స్వరూపంలో భావిస్తూ ఆరాధిస్తున్నారంటే అతని గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నారు. కేవలం దేవాలయాల వద్ద మాత్రమే జరిగే బండ్ల ఊరేగింపు సమాధి వద్ద జరగడం అతని గొప్పతనానికి నిదర్శనమని పిలుపునిచ్చారు. ఎంతోమంది తమ బిడ్డలకు కిషన్ పేరు పెట్టి అతని స్వరూపాన్ని గుండెల్లో దాచుకుంటున్నార‌న్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, పంజా విజయ్ కుమార్, మండల శాఖ అధ్యక్షులు చింతల భూపాల్, ముదిరాజ్ మహాసభ మండల జిల్లా శాఖ అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, స్థానిక బీజేపీ నాయకులు నాగభూషణం గోవింద కృష్ణ, రఘువీరారావు, సాయిబాబా సంతోష్ తదిత‌రులు పాల్గొన్నారు.