KTR | రాజకీయ కక్షలు..ప్రతీకారాలకు పరిమితులుంటాయి: కేటీఆర్

రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని విద్యుత్తు కమిషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పునరుద్ఘాటిస్తుందని తెలిపారు.

KTR | రాజకీయ కక్షలు..ప్రతీకారాలకు పరిమితులుంటాయి: కేటీఆర్

సుప్రీం తీర్పుపై కేటీఆర్ ట్వీట్‌
ప్రతిష్టాత్మక తీర్పు ఇచ్చిందని వ్యాఖ్య
ప్రజాక్షేత్రంలోనూ ఇలాంటి తీర్పే వస్తుందని జోస్యం

విధాత, హైదరాబాద్: రాజకీయ కక్షలు, ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని బీఆరెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని విద్యుత్తు కమిషన్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయం పునరుద్ఘాటిస్తుందని తెలిపారు. కేసీఆర్‌ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్ఠాత్మక తీర్పునిచ్చిందన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడని అభిప్రాయపడ్డారు. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిపిన విద్యుత్తు కొనుగోళ్లు- కొత్త విద్యుత్కేంద్రాల నిర్మాణంపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ విద్యుత్తు విచారణ సంఘం సారథి జస్టిస్‌ నర్సింహారెడ్డి నేతృత్వంలో గత మార్చి 14న ఏకసభ్య విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆనాటి వ్యవహారాలపై వివరణ ఇచ్చేందుకు తన ముందు హాజరు కావాల్సిందిగా మాజీ సీఎం కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. అయితే, విచారణ ప్రక్రియ పూర్తి కాకుండానే జస్టిస్‌ నర్సింహారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి, తప్పు జరిగిపోయిందన్నట్టుగా మాట్లాడడం సరికాదని, న్యాయ ప్రాధికార సంస్థ అయిన విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆమోదించిన నిర్ణయాల మీద ప్రభుత్వం మళ్లీ విచారణకు ఆదేశించడం చెల్లదని వాదిస్తూ కేసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. జస్టిస్‌ ఎల్‌ నర్సింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. విచారణ సంఘం సారథిగా ఆయన వ్యవహార శైలిని తప్పుబట్టింది. ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ నేపథ్యంలో జస్టిస్‌ నర్సింహారెడ్డ్డి, విచారణ సంఘం బాధ్యతల నుంచి వైదొలిగారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే ఆయన రాజీనామాను సమర్పించారు. అయితే నూతన చైర్మన్ ఆధ్వర్యంలో విద్యుత్తు కమిషన్ విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.