సెకండ్ ఛాన్సు చకోరాలు

మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలకు చెందిన ముగ్గురు అభ్యర్ధులు సెకండ్ ఛాన్సు కోసం ఉవ్విళ్ళూరుతున్నారు

సెకండ్ ఛాన్సు చకోరాలు
  • మానుకోట పీఠం కోసం పోటీ
  • ముగ్గురూ ఒక్కసారి విజేతలు
  • మరోసారి గెలిచేందుకు ప్రయత్నం
  • పార్టీలను నమ్ముకున్న క్యాండేట్లు
  • ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ పార్టీయే
  • పార్టీ బలం పైన్నే బీఆరెస్ భరోసా
  • మోదీ ఛరిస్మాపై బీజేపీ ఆధారం

విధాత ప్రత్యేక ప్రతినిధి: మానుకోట పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీచేస్తున్న మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీలకు చెందిన ముగ్గురు అభ్యర్ధులు సెకండ్ ఛాన్సు కోసం ఉవ్విళ్ళూరుతున్నారు. ఎస్టీ రిజర్వుడు స్థానంగా ఉన్న మానుకోట నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్, మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్ధి ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, సిట్టింగ్ ఎంపీ, బీఆరెస్ అభ్యర్ధి మాలోత్ కవిత పోటీలో ఉన్నారు. తాము తొలిసారి ఎంపీగా గెలిచినప్పుడు తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ సారి వివరిస్తున్నప్పటికీ ముగ్గురు క్యాండేట్లు పార్టీ పలుకుబడిని నమ్ముకున్నారు. పార్టీల ప్రధాన నేతల ప్రచారం పై విశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. బలరామ్ నాయక్ మినహా సీతారాం నాయక్, కవితలు పార్టీలు మారారు. ముగ్గురు లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం

మానుకోట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు పినపాక, ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్, నర్సంపేట, ములుగు, భద్రాచలం ఉన్నాయి. ఒక్క నర్సంపేట మినహా ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలు. మొన్నటి ఎన్నికల్లో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనుకయ్య, డాక్టర్ మురళీనాయక్, డాక్టర్ రామచంద్రునాయక్ , దొంతి మాధవరెడ్డి, ధనసరి అనసూయ సీతక్క గెలుపొందారు. ఒక్క భద్రచలం స్థానంలో బీఆరెస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గెలుపొందారు. గెలిచిన ఈ ఒక్క ఎమ్మెల్యే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి పూర్తి ఎమ్మెల్యేల బలం చేకూరింది. గతంలో బీఆరెస్ ఆధిపత్యం కొనసాగింది. కాంగ్రెస్,టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆరెస్ లో చేర్చుకున్నారు.

కాంగ్రెస్ అభ్యర్ధి బలరాం

కాంగ్రెస్ అభ్యర్ధి బలరామ్ నాయక్ మానుకోట ఎంపీగా నాలుగోసారి పోటీచేయడం గమనార్హం. నాలుగు పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్ధిగానే పోటీచేశారు. 2009లో తొలిసారి పోటీచేసి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పనిచేశారు.2014,2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం మరోసారి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు మంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులే ఇప్పటికీ ఉన్నాయని, రెండు పర్యాయాలు ఏ అభివృద్ధి చేయలేదని విమర్శిస్తున్నారు. మరోసారి అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ ప్రకటిస్తున్నారు. పార్టీ బలం, తన పరిచయం పై ఆధారపడి బలరామ్ నాయక్ ఎన్నికల బరిలో ఉన్నారు. రెండవ సారి గెలుపు ఖాయమనే భరోసాతో ఉన్నారు.

బీఆరెస్ అభ్యర్ధి కవిత

మాలోత్ కవిత ప్రస్తుతం బీఆరెస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రెండవ పర్యాయం ఎంపీగా పోటీచేస్తున్నారు. కవిత గతంలో కాంగ్రెస్ పార్టీలో మానుకోట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల తర్వాత తన తండ్రి డిఎస్ రెడ్యానాయక్ తో పాటు బీఆరెస్ లో చేరారు. 2019లో మానుకోట ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. రెండవ సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎమ్మెల్యేల బలం పూర్తి తారుమారైంది. దీంతో పార్టీ నిర్మాణం, గతంలో తాను చేసిన పనులను చూసి ఆదరిస్తారని భావిస్తున్నారు.

బీజేపీ అభ్యర్ధి సీతారాం

2014 ఎన్నికల్లో సీతారాం నాయక్ బీఆరెస్ నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో బీఆరెస్ ఆయనకు టికెట్ నిరాకరించింది. అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయం లేక మొన్నటి దాకా బీఆరెస్ లోనే కొనసాగారు. మొన్నటికి మొన్న బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలో ఉన్నారు. రెండవసారి విజయం ఆశతో ఉన్నారు. మోదీ ప్రభావం తప్ప ఈ నియోజకవర్గంలో బీజేపీ నిర్మాణాత్మకంగా బలంగా ఉందీలేదు. స్వంతంగా సీతారాం నాయక్ కు ఉన్న చరిష్మా సైతం లేదు.

ముగ్గురి కోసం అధ్యక్షుల ప్రచారం

మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధుల విజయం కోసం ఆయా పార్టీల అధ్యక్షులు ప్రచారం చేపట్టారు. బలరాంకు మద్ధతుగా మానుకోటలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి తుమ్మల ఇంచార్జ్ గా ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ పార్లమెంటు పరిధిలోనే ములుగు ఎమ్మెల్యేగా మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్ధి సీతారం ప్రచారంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. మానుకోటలో జరిగిన సభలో ఆయన పాల్గొన్నారు. కవిత ఎన్నికల ప్రచారంలో బుధవారం మానుకోట రోడ్ షోలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొననున్నారు.