Minister Seethakka | బీఆరెఎస్ అసత్య ప్రచారాలను నమ్మొద్దు: మంత్రి సీతక్క
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని ఆరునెలలు కాకుండానే కావాలని నేడు కాంగ్రెస్ పార్టీ మీద బీఆరెస్ అసత్య ప్రచారాలు చేస్తుందని రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క విమర్శించారు

పదేండ్లపాలనలో ప్రజలను కొల్లగొట్టిన బీఆరెఎస్
ఉద్యోగాల భర్తీలో బీఆరెస్ నిర్లక్ష్యం
విధాత, వరంగల్ ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి పట్టుమని ఆరునెలలు కాకుండానే కావాలని నేడు కాంగ్రెస్ పార్టీ మీద బీఆరెస్ అసత్య ప్రచారాలు చేస్తుందని రాష్ట్ర మంత్రి దనసరి సీతక్క విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు 500 రూపాయల బోనస్ పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు.
గ్రాడ్యుయేషన్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో శనివారం వివిధ కార్యక్రమాలు జరిగాయి. వరంగల్లో వాకర్స్‌ను కలిసి ప్రచారం నిర్వహించారు. ములుగులో జరిగిన సన్నాహక సమావేశంలో, అనంతరం మీడియాతో మంత్రి సీతక్క ప్రసంగించారు. పదేండ్ల పాలనలో ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టిన బీఆరెఎస్ ఇప్పుడు నీతులు వల్లిస్తుందని విమర్శించారు.
ఇంటికొక ఉద్యోగం ఇస్తా అని చెప్పి యువతను మోసం చేసి యువత భవిష్యత్తును నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. దొరల అహంకార పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఎస్సీ,ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయకుండా యువత భవిష్యత్తు నాశనం చేశారని విమర్శించారు. టీఎస్పిఎస్సీ లీకేజీ ద్వారా, ఉద్యోగ భర్తీ ప్రకటనలు ఇవ్వకుండా యువతను గందరగోళానికి గురి చేశారని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించి వందల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. లిక్కర్ కుంభకోణం, పేపర్ లీకేజీ ఇలా ఎన్నో దారుణాలు చేసిన బీఆరెస్ నీతులుచెప్పడం సిగ్గుచేటన్నారు. పదేండ్ల పాలనలో యావత్తు తెలంగాణ ప్రజలను మోసం చేసి తెలంగాణ రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు, ఆగస్టు 15 వరకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుందని అన్నారు. ఇప్పటికే ఎన్నో మెగా డి.ఎస్.సి లాంటి ప్రకటనలు ఇచ్చారన్నారు.
మతి భ్రమించిన బీఆరెస్ నాయకులు
అధికారం కోల్పోయిన బీఆరెఎస్ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ పార్టీపై కావాలని కొందరు అసత్య ప్రచారాలు చేయడం దుర్మార్గం అని అన్నారు. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. మల్లన్న కూడా పోరాట పటిమ కలిగిన వ్యక్తని, దొరల అహంకార పూరిత ధోరణిపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యక్తన్నారు. పట్టభద్రులు అందరూ మే 27 న రెండవ నెంబర్ యందు హస్తం గుర్తుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.