బ్రోకర్ చేతిలో కాంగ్రెస్ నడుస్తుంది: పాల్వాయి స్రవంతి
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా కేవలం డబ్బు అనే నినాదంతో ఓ బ్రోకర్ చేతిలో నడుస్తుందని మునుగోడు నియోజకవర్గం ఏఐసీసీ సభ్యులు, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి విమర్శించారు.

- రాజీనామాపై కంటతడిపెట్టిన స్రవంతి
- బీఆరెస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటన
విధాత : ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా కేవలం డబ్బు అనే నినాదంతో ఓ బ్రోకర్ చేతిలో నడుస్తుందని మునుగోడు నియోజకవర్గం ఏఐసీసీ సభ్యులు, మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి స్రవంతి విమర్శించారు. శనివారం ఆమె కాంగ్రెస్ పార్టీకి, సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపైన తీవ్ర విమర్శలు చేసి, బీఆరెస్ పార్టీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గించారని స్రవంతి ఆవేదన వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో డబ్బు రాజకీయాలే సాగుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నిలువెత్తున వేలం పాట గా మారిందన్నారు. ఫిరాయింపు దారులతో కాంగ్రెస్ నడుస్తుందని, ఎంతో మందిని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. ఇన్ని రోజులు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతుగా కృషి చేస్తూ పని చేశానని, కానీ నేడు జరుగుతున్న పరిణామాలను చూసి కాంగ్రెస్ పార్టీ ని విడాల్సి వస్తుందని కంటతడి పెట్టుకున్నారు.
మునుగోడు నియోజకవర్గంలో తనను కాదని వ్యాపారులకు, ఫిరాయింపుదారులకు పెద్దపీట వేసి కాంగ్రెస్ తన నిబద్దతను పొగొట్టుకుందని, ఈరోజు ఏం మొఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని అడుగుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్‌దని అనడంతో కాంగ్రేస్ పార్టీ లో ఏం జరుగుతుందో ఆలోచించాలన్నారు.
రాష్ట్రం లో ఇప్పుడు ఉన్న మూడు పార్టీలలో బీఆరెస్ పార్టీ ప్రజల పక్షాన ఉందని నాకు అనిపించిందని, తెలంగాణ ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆరెస్ పార్టీ మాత్రమేనని భావించి ఆ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. ప్రతి పార్టీలో కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు కానీ బీఆరెస్ పార్టీ లో ఆ లోటుపాట్లను సవరిస్తూ అందరిని కలుపుకొని ముందుకు పోతుందని స్రవంతి పేర్కోన్నారు.