మునుగోడు నియోజకవర్గ రాజకీయం మళ్లీ ఆసక్తికరంగా మారింది

  • రాజ‌గోపాల్ ఓడింది 10వేల ఓట్ల‌తో
  • ఇప్పుడు క‌మ్యూనిస్టులూ దూరం
  • కాంగ్రెస్‌కు స్ర‌వంతి రాజీనామా
  • బ‌రిలో బీఆరెస్‌, కాంగ్రెస్, బీజేపీ
  • త్రిముఖ పోటీలో గెలిచేదెవ‌రు?
  • ఎవ‌రికైనా స్వ‌ల్ప మెజార్టీయే!

విధాత: మునుగోడు నియోజకవర్గ రాజకీయం మళ్లీ ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికలో ఆయన ఓటమిపాలయ్యారు. దానికి ప్రధాన కారణాలు మూడు. ఒకటి కాంగ్రెస్‌ క్యాడర్‌ మొత్తం రాజగోపాల్‌ వెంట వెళ్లకపోవడం, రెండు కమ్యూనిస్టులు బీఆరెస్‌కు మద్దతు పలుకడం, మూడు పాల్వాయి స్రవంతిని కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబెట్టడం.

ఫలితంగా రాజగోపాల్‌రెడ్డి అతివిశ్వాసం, బీజేపీ అంచనాలు రెండు తప్పాయి. ఈసారి ఆయన అక్కడ బీజేపీ నుంచే పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా చివరి నిమిషంలో ఆయన తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరడంతో అక్కడ రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది. ఇప్పుడు అక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే చర్చ జరుగుతున్నది.

రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడిన తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున టికెట్‌ పాల్వాయి స్రవంతితో పాటు, చలమల్ల కృష్ణారెడ్డి కూడా ఆశించారు. ఆ నియోజకవర్గంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ప్రాబల్యం ఎక్కువగానే ఉంటుంది. ఆయన 1967 ఎన్నికల నుంచి 1999 ఎన్నికల వరకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు.

దీంతో పార్టీ అధిష్ఠానం స్రవంతికే టికెట్‌ ఇచ్చింది. కమ్యూనిస్టులు బీఆరెస్‌ కోసం, కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు స్రవంతి గెలుపు కోసం చాలా కృషి చేశారు. దీంతో రాజగోపాల్‌రెడ్డికి చుక్కెదురైంది. ఉప ఎన్నికలో స్రవంతికి దాదాపు 23,906 ఓట్లు వచ్చాయి. రాజగోపాల్‌రెడ్డిపై బీఆరెస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్లతో గెలుపొందారు. కోమటిరెడ్డి ఎందుకు ఓడారన్నది దీన్నిబట్టి అర్థమౌతుంది.

ముగ్గురూ బ‌ల‌వంతులే

ఈసారి అక్కడ బీఆర్‌ఎస్‌ నుంచి కూసుకుంట్ల, కాంగ్రెస్‌ నుంచి కోమటిరెడ్డి, బీజేపీ నుంచి చలమల్ల బరిలో ఉన్నారు. ముక్కోణపు పోటీ ఉంటుంది. ఒక్క అధికారపార్టీ అభ్యర్థి తప్పా మిగిలిన ఇద్దరికి వ్యక్తిగతంగా చాలా బలం ఉన్నది. టికెట్‌ రాని చిలుమల్ల బీజేపీలో వెళ్లగా, స్రవంతి ఏ నిర్ణయం తీసుకుంటారనేది కీలకంగా మారింది. కోమటి రెడ్డి బ్రదర్స్‌ అత్యుత్సాహం ఆపార్టీ క్యాడర్‌కే నచ్చడం లేదని సమాచారం.

అందుకే ఆ పార్టీలోనే ఉండి ఆయన కోసం పనిచేయడం కంటే బైటికి వెళ్లిపోవడమే మంచిదనే అభిప్రాయం అక్కడి పార్టీ శ్రేణుల్లో ఉన్నదని తెలుస్తోంది. ఫలితంగా ఇవాళ పాల్వాయి స్రవంతి పార్టీ వీడారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన తనకు సరైన గుర్తింపు రాకపోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులిచ్చినోళ్లకే కాంగ్రెస్‌పార్టీలో కిరీటాలు అని ఆరోపించారు. అవమానాలు భరించలేక, పార్టీలో ఇమడలేకపోతున్నానని తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపారు.

స్ర‌వంతి ఎఫెక్ట్ ఎంత‌?

స్రవంతి పార్టీ వీడి బీఆర్‌ఎస్‌లో చేరడం, కృష్ణారెడ్డి బీజేపీ తరఫున బరిలో ఉండటంతో రాజగోపాల్‌రెడ్డికి ప్రతికూలంగా మారిందంటున్నారు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలోని నారాయణపూర్‌, చౌటుప్పల్‌లో బీజేపీ ప్రభావం ఉంటుంది. చండూర్‌ మండలంలో అయితే పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిమానులే ఎక్కువ. ఉప ఎన్నిక సందర్భంగా చౌటుప్పల్‌ మండలంలోనే తమకు ఎక్కువ ఓట్లు వస్తాయని రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీ భావించింది.

అక్కడ వాళ్ల అంచనాలు తలకిందులయ్యాయి. అలాగే బీఎస్పీ ఆర్ఎస్‌ ప్రభావం కూడా అక్కడి దళితవర్గాల యువతపై అధికంగానే ఉన్నది. కనుక ఈసారి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కష్టాలు తప్పకపోవచ్చని నియోజకర్గంలో చర్చించుకుంటున్నారు. ఏ పార్టీ గెలిచినా స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతుందంటున్నారు.

Somu

Somu

Next Story