ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ.. అక్రమ రవాణాపై సీఎం రేవంత్ ఆగ్రహం

రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు

ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీ.. అక్రమ రవాణాపై సీఎం రేవంత్ ఆగ్రహం

83 లారీలు త‌నిఖీలు చేస్తే అనుమ‌తి లేనివి 22

25 శాతం ఇసుక అక్ర‌మ ర‌వాణా

టోల్ గేట్ల డాటా ఆధారంగా త‌నిఖీలు

48 గంట‌ల్లో అధికారులు పద్ధతి మార్చుకోవాలి

విజిలెన్స్ ఏసీబీ విభాగాలతో తనిఖీలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

విధాత‌: రాష్ట్రంలో ఇసుక అమ్మకాలకు కొత్త పాలసీని తయారు చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండే కొత్త పాలసీ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక పాలసీ అవినీతి దందాగా మారిందని సీఎం అన్నారు. అన్ని స్థాయిల్లో అక్రమాలు జరుగుతున్నాయన్నారు. 

అక్ర‌మ క్వారీయింగ్‌, ర‌వాణ‌కు అడ్డుక‌ట్ట‌

నిబంధనలు ఉల్లంఘించి జరుగుతున్న ఇసుక క్వారీయింగ్, అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టాలని ముఖ్యమంత్రి హెచ్చరించారు. 48 గంటల్లో అన్ని స్థాయిల్లో అధికారులు తమ పద్ధతి మార్చుకోవాలని డెడ్ లైన్‌ విధించారు. రెండు రోజుల తర్వాత విజిలెన్స్, ఏసీబీ విభాగాలను రంగంలోకి దింపాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో వెంటనే తనిఖీలు చేపట్టాలని, బాధ్యులైన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని సీఎం హెచ్చరించారు.

టోల్ గేట్ల డేటా ఆధారంగా…

అన్ని రూట్లలో ఉన్న టోల్ గేట్ల వద్ద నమోదైన డేటా ఆధారంగా ఇసుక లారీల అక్రమ రవాణా మొత్తం బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడున్న ఇసుక రీచ్‌లు, డంప్ ల‌న్నీ తనిఖీలు చేయాలని, తప్పులుంటే జరిమానాలు వేస్తే సరిపోదని, అంతకు మించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇసుక రీచ్ లన్నింటా సీసీ కెమెరాలున్నాయని అధికారులు ఇచ్చిన సమాధానంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది మార్చి ఒకటిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాదయాత్రకు వెళ్లినప్పుడు మానేరు వాగులో తనుగుల ఇసుక క్వారీకి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసి.. అక్కడ సీసీ కెమెరాలు లేవని అన్నారు. 

83 లారీలను త‌నిఖీ చేస్తే 22 లారీల‌కు అనుమ‌తి లేదు

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీన రవాణా విభాగంతో నిజామాబాద్, వరంగల్ రూట్లలో ఆకస్మిక తనిఖీలు చేయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. 83 ఇసుక లారీలను తనిఖీ చేస్తే.. 22 లారీలకు అనుమతి లేదని గుర్తించారు. ఒకే పర్మిట్, ఒకటే నెంబర్ తో నాలుగైదు లారీలు ఇసుక రవాణా చేస్తున్నట్లు బయటపడిందని అన్నారు. ఈ లెక్కన 25 శాతం అక్రమంగా ఇసుక తరలిపోతుందని సీఎం అంచనాగా చెప్పారు. టీఎస్ఎండీసీ కేంద్రంగా జరుగుతున్న అక్రమాలను అరికట్టి, గనులు, భూగర్భ వనరుల విభాగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని సీఎం అన్నారు. 

హైద‌రాబాద్ చుట్టూ అనుమ‌తి లేని స్టోన్ క్ర‌ష‌ర్స్ సీజ్ చేయండి

హైదరాబాద్ చుట్టుపక్కల అనుమతి లేకుండా నిర్వహించే స్టోన్ క్రషర్స్ సీజ్ చేయాలని సీఎం ఆదేశించారు. భారీ కాంప్లెక్స్ లు నిర్మించేటప్పుడు రోడ్లపై కంకర, బిల్డింగ్ మెటీరియల్ వేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు.

ఆరు మీటర్ల కంటే లోతుగా భూగర్భంలో సెల్లార్లకు తవ్వకాలు చేపడితే నిబంధనల ప్రకారం పన్ను వసూలు చేయాలని ఖనిజ వనరుల శాఖను సీఎం ఆదేశించారు. నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే, అటువంటి భవనాల వివరాలు మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చేరేలా ఇంటిగ్రేటేడ్ ఆన్ లైన్ విధానం అమలు చేయాలని సూచించారు. గ్రానైట్, ఖనిజాల తవ్వకాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు జియో ట్యాగింగ్, జీపీఆర్ఎస్ ను వినియోగించాలని సీఎం సూచించారు. గ్రానైట్ తో పాటు ఇతర క్వారీలకు సంబంధించిన కేసులు ఏమేమి ఉన్నాయి? ఏయే ఏజెన్సీల వద్ద ఉన్నాయి? ఇప్పుడున్న పురోగతిపై నివేదికను అందించాలని చెప్పారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్‌ శాంతికుమారి, మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ మహేష్ దత్ ఎక్కా, మైనింగ్ విభాగం డైరెక్టర్ సుశీల్ కుమార్ త‌దిత‌ర‌ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.