ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కమిటీ.. మాదిగలకు న్యాయం చేస్తాం: ప్రధాని

- మాదిగల విశ్వరూప సభలో ప్రధాని మోడీ ప్రకటన
- బీఆరెస్ కాంగ్రెస్‌లు రెండు మాదిగ విరోధులు
- అవినీతిలో ఆ రెండు పార్టీలు ఒక్కటే
- సభా వేదికపై మోడీ అలింగనంతో మంద కృష్ణ భావోద్వేగం
విధాత : మాదిగలు 30ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ వర్గీకరణకు భారత ప్రభుత్వం కమిటీ వేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభకు ముఖ్య అతిధిగా హాజరైన మోడీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై వారికి భరోసా నిచ్చారు. సుప్రీం కోర్టులో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సాగుతున్న కేసు పరిష్కారానికి కేంద్రం తనవంతు కృషి చేస్తుందన్నారు. చట్టపర ఇబ్బందులు లేకుండా చేసి అదాలత్‌లో కూడా మీకు న్యాం జరిగేలా చూస్తామని కీలక హామీ ఇచ్చారు. మాదిగల రిజర్వేషన్ల వర్గీకరణ కల నెరవేర్చి వారికి న్యాయం చేస్తామన్నారు. మాదిగల హక్కుల సాధన ఉద్యమంలో నా చిన్న తమ్ముడు మంద కృష్ణ సాగిస్తున్న ఉద్యమంలో నేను ప్రధాని హోదాలో ఆయనకు సహాయకుడిగా పనిచేస్తానన్నారు. మాదిగలకు న్యాయం జరిగేలా చూస్తామని, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

తెలంగాణ ప్రభుత్వం దళితులకు అన్యాయం చేసిందని, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో దళిత సీఎంను చేస్తామన్న సీఎం కేసీఆర్ ఆ కుర్చీని కబ్జా చేశారన్నారు. మూడెకరాల భూమి ఇస్తామని ఇవ్వలేదని, దళితు బంధు పథకాన్ని ఎమ్మెల్యేల బంధుగా మార్చారన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదన్నారు.దళితులకు అన్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆరెస్‌లు పోటీ పడుతున్నాయన్నారు. ఆ రెండు పార్టీలు ఒకటేనని, అవినీతి, దళిత వ్యతిరేక పార్టీలని మోడీ ధ్వజమెత్తారు. డాక్టర్ అంబేద్కర్‌ను రెండు సార్లు ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందన్నారు. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఆయన ఫోటో కూడా పెట్టలేదన్నారు. అయితే బీజేపీ మాత్రం అంబేద్కర్ ఫోటోను పెట్టడంతో పాటు భారత రత్నతో గౌరవించిందన్నారు. బీజేపీ దళితుడైన రామ్‌నాథ్ కోవిద్‌ను, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేయగా, కాంగ్రెస్ వారిద్దరిని ఓడించేందుకు ప్రయత్నించడంతో పాటు వారిని రాష్ట్రపతులుగా గుర్తించకుండా అవమానిస్తుందని విమర్శించారు. బీఆరెస్, కాంగ్రెస్‌లు రెండు దళిత విరోధ పార్టీలేనన్నారు. బాబు జగ్జీవన్ రామ్‌ను కూడా కాంగ్రెస్ అణిచివేసిందన్నారు. రాజస్థాన్‌లో దళిత అధికారిణి చీఫ్ ఇన్పర్మేషన్ అధికారిగా నియమిస్తే ప్రమాణ స్వీకారాన్ని వ్యతిరేకించిందన్నారు. దళిత సాహితీ వేత్త గుర్రం జాషువా కాశీ విశ్వనాధుడికి తన బాధను వ్యక్తపరిచాడని, అదే విశ్వనాధుడి ఆశీస్సులతో వారణాసి ఎంపీగా, ప్రధానిగా అయ్యాయని, మీకు న్యాయం చేసేందుకు, మీ ఉద్యమంలో భాగస్వామ్యమయ్యేందుకు భరోసానిచ్చేందుకు వచ్చానన్నారు. దళితుడైన బంగారు లక్ష్మణ్ సారధ్యంలో తాను బీజేపీలో పనిశానన్నారు. కృష్ణ మాదిగా 30ఏళ్ల పాటు తన జీవితాన్ని త్యాగం చేసి ఒకే లక్ష్యంతో ఎస్సీ వర్గీకరణకు అహింసాయుతంగా నిర్వహించిన ఉద్యమం స్ఫూర్తిదాయకమన్నారు.
తాను ఈ ఉద్యమంలో ఆయన సహాయకుడి పోరాడి ఎస్సీ మాదిగల ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు. వర్గీకరణ ఉద్యమంలో ఇంతకాలం మందకృష్ణకు మద్దతుగా ఉన్న బీజేపీ మాదిగల హక్కుల సాధనకు కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు జరుగుతున్న అన్యాయానికి ముగింపు పలికేందుకే తాను ఇక్కడికి వచ్చానన్నారు. సామాజిక న్యాయం సాధనకు, దేశంలో సబ్ కా సాత్, సబ్ కా వికాస్ నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని మోడీ అన్నారు. మంద కృష్ణ వంటి పోరాట యోధుడిని కన్న వారి తల్లిదండ్రులు ధన్యులన్నారు. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వలు ఎక్కడైనా అభివృద్ధి అంశాలలో పరసర్పరం సహకరించుకుంటాయని కాని కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్న ఆమ్‌ఆద్మీ, బీఆరెస్ పార్టీలు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అవినీతి చేసుకోవడంలో సహకరించుకుంటున్నాయని మోడీ దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి భాగస్వామిగా ఉన్న బీహార్ సీఎం నితీష్‌కుమార్ అక్కడ దళితుడైన రామ్ విలాస్ పాశ్వాన్‌ను రాజ్యసభసభ్యుడిగా చేయడంలో తమకు అడ్డుపడి అవమానించిందని, జితేన్ రామ్‌ను కూడా అవమానించిందని, తాము పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్‌కు న్యాయం చేశామన్నారు. స్వాతంత్య్రం వచ్చాకా దేశాన్ని దశాబ్ధాల కాలం పాటు పాలించిన పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయన్నారు. ఆ పార్టీలన్ని రాజకీయంగా మిమ్మల్ని వాడుకున్నాయన్నారు. ఆ పార్టీ తరపునా తాను మాదిగలకు క్షమాపణలు చెబుతున్నానని, వారికి సామాజిక న్యాయం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గరీబ్ కల్యాణ్ అవాజ్ యోజన, పీఎం విశ్వకర్మ, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, ముద్ర తదితర పథకాల్లో అధిక శాతం లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీలేనన్నారు. తెలంగాణలోని 13లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు 1000కోట్ల స్కాలర్ షిప్‌లు అందించామన్నారు. పేదల కోసం ఉచిత రేషన్ బియ్యాన్ని మరో ఐదేళ్లు పొడగించామన్నారు. ఇప్పటికే 20లక్షల బాయిల్డ్ రైస్ కొనడం ద్వారా రైతులకు మద్దతు ధర అందించేందుకు సహకరిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం సత్వరమే ధాన్యం కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు.
నేను ప్రధానిగా ఉండవచ్చని, కాని మీకు ప్రధాన సేవకుడినన్నారు. అభ్యున్నతికి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఒకవైపు ఉంటే కాంగ్రెస్, బీఆరెస్‌లో ఇంకోవైపు ఉన్నాయని, సామాజిక న్యాయం, బీసీ సీఎం అమలుకు బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీలు సహకరించాలని కోరారు. సభలో మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఓ యువతి ఫ్లడ్ లైట్ స్తంభం ఎక్కగా గమినించిన మోదీ బేటా ఇది సరికాదని, తల్లి కిందకు దిగాలని,ఇది మంచిది కాదని, నేను మీకోసమే ఇక్కడకు వచ్చానని, నేను మీ వింటాను ఇలా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, మీరంతా కృష్ణ మాట వినాలని అభ్యర్థింంచారు. పలుమార్లు మోడీ చేసిన విన్నపంతో ఆ యువతి కిందకు దిగగా, తిరిగి మోడీ తన ప్రసంగం కొనసాగించారు.
ప్రధాని మోడీతోనే వర్గీకరణ సాధ్యం – మంద కృష్ణ మాదిగ
దేశాన్ని ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని మాదిగలు నమ్ముతున్నారని, ఎస్సీ వర్గీకరణ చేస్తే ప్రధాని మోడీకి దక్షిణ భారత రాజకీయాల్లో లక్ష్మణుడిగా నేను వెంట నడుస్తానని మంద కృష్ణ మాదిగ అన్నారు. సభ వేదికపై ప్రధాని మోడీ మందకృష్ణను అలింగనం చేసుకోగా భావోద్వేగంతో కృష్ణ కంటతడి పెట్టారు. పక్కన కూర్చున్న మోడీ ఆయన భుజం తట్టి భరోసనిచ్చారు. అనంతరం మాట్లాడిన మందకృష్ణ గతంలో ఏ భారత ప్రధాని కూడా మోడీ మాదిరిగా మాదిగలను ఆదరించలేదన్నారు. మాదిగల సభకు స్వయంగా మోడీ రావడంతో మాదిగలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఏర్పడిందన్నారు. దేశంలో మోడీ మాట ఇస్తే తిరుగు ఉండదన్న విశ్వాసం దేశ ప్రజల్లో ఉందన్నారు.ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణ చేస్తే రాజకీయాలకు పార్టీలకు అతీతంగా మోడీ వెంట మాదిగలు నడుస్తారన్నారు. దశాబ్ధాలుగా మాదిగలను సమాజం మనుషులుగా చూడలేదన్నారు.
మోడీ ప్రభుత్వమే దళితుడిని, ఆదివాసిని రాష్ట్రపతిగా చేసి గౌరవించిందన్నారు. సామాజిక న్యాయంపై కాంగ్రెస్, బీఆరెస్‌లు మాటలకే పరిమితమైతే మోడీ మాత్రం సామాజిక న్యాయంకు చేతల ద్వారా చేసి చూపిస్తున్నారన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ మాదిగలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా అవమానించారన్నారు. రాష్ట్రంలో ఒక్క శాతం లేని వెలమలకు నాలుగు మంత్రి పదవులు, నాలుగు శాతం ఉన్న రెండ్లకు ఏడు మంత్రి పదవులు ఇచ్చారన్నారు. బీజేపీ మాత్రం తెలంగాణలో బీసీని సీఎంగా చేస్తామని చెప్పడంతో పాటు మాదిగల సభకు ప్రధాని స్వయంగా వచ్చా మా హక్కుల సాధన ఉద్యమానికి మద్దతునిచ్చారన్నారు. ప్రధాని మోడీ బలహీన వర్గాలకు చెందిన వాడిగా, ఛాయ్ అమ్ముకున్న సాధారణ స్థితి నుంచి ఎదిగిన వాడు కావడంతోనే ఇవ్వాళ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం అందించగలుగుతున్నారన్నారు. బీజేపీ పార్టీ అణగారిన వర్గాలకు అండగా నిలబడుతుందని, మా ఆకాంక్షలు నేరవేరుస్తుందని నమ్ముతున్నామన్నారు. ఈ సభలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, మురుగన్ సహా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.