Telangana | కొడుకు నుంచి రక్షణ కల్పించండి.. డీజీపీకి వృద్ద తల్లిదండ్రుల మొర

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన సీఐ ఉద్యోగం చేస్తున్న కొడుకు ఆస్తి కోసం కన్నవారిపైనే వేధింపులకు పాల్పడ్డాడు.

Telangana | కొడుకు నుంచి రక్షణ కల్పించండి.. డీజీపీకి వృద్ద తల్లిదండ్రుల మొర

విధాత, హైదరాబాద్ : వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలవాల్సిన సీఐ ఉద్యోగం చేస్తున్న కొడుకు ఆస్తి కోసం కన్నవారిపైనే వేధింపులకు పాల్పడ్డాడు. వనపర్తి జిల్లా నల్లా ఘణపురం మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి, బొజ్జమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కొడుకు నాగేశ్వర్ రెడ్డి సీఐగా, చిన్న కొడుకు యాదయ్య కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. తమకున్న 30 ఎకరాల భూమిని తల్లిదండ్రులు కొడుకులకు చెరి సమానంగా పంచి ఒక్కొక్కరికి 15 ఎకరాలు రాసిచ్చారు.

రాచకొండ కమిషనరేట్ మల్టీజోన్-2లో సీఐగా పనిచేస్తున్న నాగేశ్వర్ రెడ్డి తనకు మరింత భూమి రాసివ్వాలని దూషించడంతో పాటు తమపై దాడి చేస్తున్నట్లు తల్లిదండ్రులు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. సీఐగా ఉన్న పెద్ద కుమారుడి వేధింపులు తాళలేక చిన్న కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. పెద్ద కుమారుడి నుంచి తమకు రక్షణ కల్పించాలని డీజీపీని వృద్ధ దంపతులు వేడుకున్నారు. ఈ ఘటన రోజురోజుకు అంతరించిపోతున్న కుటుంబ విలువలకు నిదర్శనంగా నిలవగా, ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.