‘స్టేష‌న్‌’లో కారు దూసుకెళ్లేనా?

‘స్టేష‌న్‌’లో కారు దూసుకెళ్లేనా?
  • ఫ‌లించ‌ని రాజ‌య్య‌ దింపుడు క‌ల్లం ఆశ‌
  • శ్రీ‌హ‌రికి రాజ‌య్య‌వ‌ర్గం స‌హ‌క‌రించేనా?


విధాత‌ : పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చింది అన్నట్టు బీఆరెస్ నాయ‌కుల‌ మధ్య విభేదాలు విపక్ష పార్టీ అభ్యర్థికి మేలు చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌లో సిటింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వర్గాల పోరు అధికారపార్టీ పుట్టి ముంచినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని జిల్లాలోని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.


అయితే.. తనను కాదని శ్రీహరికి టికెట్‌ ఇవ్వడంపై రాజయ్య ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు. రైతుబంధు సమితి చైర్మన్‌ పదవి ఇచ్చినా ప్రజల ఆదరణ తనకే ఉన్నదని ఆయన ఇప్పటికీ అంటున్నారు. అంతేకాదు అధిష్ఠానం పునరాలోచన చేసి తనకే టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. అది కుదరదని తేలిపోయింది. దీంతో అక్కడ శ్రీహరి గెలుపు కోసం రాజయ్యవర్గం ఎంత మేర‌కు ప‌నిచేస్తుంద‌నేది సందేహాస్ప‌ద‌మేన‌ని అంటున్నారు.


రెండు సార్లు అధికారంలోకి ఉన్న బీఆరెస్‌కు 2014, 2018 ఎన్నికల్లో కేసీఆరే కర్త, కర్మ, క్రియ. ఈ రెండు ఎన్నికల్లోనూ అంతా తానై ప్రచారం చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో పార్టీలోనే అసంతృప్తి ఉన్నా, ప్రజలకు కూడా నచ్చకపోయినా సీఎంగా కేసీఆర్‌ ఉంటేనే తమకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అక్క‌డి ఓట‌ర్లు అధికారపార్టీ అభ్యర్థులను గెలిపించారు. కానీ తొమ్మిదిన్నరేళ్ల తర్వాత ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు.


మార్పు మంచిదే కదా! అన్న చ‌ర్చ కూడా కొంద‌రి మ‌ధ్య వినిపిస్తున్న‌ద‌ని చెబుతున్నారు. మొదటి ఐదేళ్ల పాలనకు, తర్వాత పాలనకు బేరీజు వేసుకుంటున్నారని ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న సంక్షేమం, అభివృద్ధి కంటే ప్రభుత్వ అవలంబిస్తున్న విధానాలే తమకు అనేక సమస్యలు తెచ్చిపెడుతున్నాయ‌ని ప్రజలు భావిస్తున్నార‌ని తెలుస్తున్న‌ది. గత ఎన్నికల్లో కేసీఆర్‌ ముఖం చూసి ఓట్లు వేసిన వాళ్లే ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో ముఖం చాటేస్తున్నారట.


దీనికి తోడు టికెట్‌ ఆశించి భంగపడిన అభ్యర్థులు, బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య సయోధ్య కోసం పార్టీ అధిష్ఠానం చేసిన ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని తెలుస్తోంది. స్టేషన్‌ ఘన్‌పూర్‌లోనూ ఈసారి శ్రీహరి, రాజయ్యల మధ్య విభేదాలు విపక్ష పార్టీకి వరంగా మారనున్నదని వాదన బలంగా వినిపిస్తున్నది. పోలింగ్‌కు ఇంకా 40 రోజులుకు పైగా సమయం ఉన్నది. అప్పటివరకు పరిస్థితి ఏమైనా మారుతుందా? లేదా అన్నది చూడాలి.