తెలంగాణ వెలుగుల్లో సోనియమ్మ త్యాగం: రేవంత్ రెడ్డి

బిడ్డలు కష్టంలో ఉంటే జీసన్ త్యాగం చేసినట్లు.. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సోనియమ్మ త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు

తెలంగాణ వెలుగుల్లో సోనియమ్మ త్యాగం: రేవంత్ రెడ్డి
  • బీఆరెస్ పదేళ్ల పాలనలో స్వేచ్ఛకు అడ్డుకట్ట
  • దేశంలో చెలరేగుతున్న మోదీ ఆధిపత్యం
  • తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ను ఆమోదిస్తాం
  • టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి


విధాత: బిడ్డలు కష్టంలో ఉంటే జీసన్ త్యాగం చేసినట్లు.. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సోనియమ్మ త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్ లో నిర్వహించిన తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. చరిత్రను మనం క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అని ప్రస్తావిస్తాం.. అలాగే తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ వచ్చాక.. తెలంగాణ రాకముందు అని చెబుతామన్నారు.


తెలంగాణలో పదేళ్లుగా స్వేచ్ఛ ఉందా? మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ లో జరిగిన దాడులను చూసైనా ఇక్కడి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఓడిన వారిని బానిసలు అన్నట్లుగా మోదీ ఆధిపత్యం చలాయిస్తున్నారని అన్నారు. తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన డిక్లరేషన్ ప్రజలకు ఉపయోగపడుతుందని భావిస్తున్నామన్నారు. భవిష్యత్ లో ఈ డిక్లరేషన్ ను ఆమోదించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


కాంగ్రెస్ గెలుపు.. ప్రజాస్వామ్యం గెలుపు


తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని కాంక్షించిందన్నారు. తెలంగాణలో ప్రస్తుతతం జరుగుతున్న ఎన్నికలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో మోదీని గద్దె దించేందుకు పునాది కావాలన్నారు. తెలంగాణలో గెలవడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే 2023 డిసెంబర్ లో ఒక మిరాకిల్ జరగబోతుందన్నారు. ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అంటూనే, కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనంగా రేవంత్ అభివర్ణించారు.