సైదులు.. వ్యవసాయం ఎట్లుంది! మంత్రి జగదీష్‌రెడ్డి ఆరా

డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి.. కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తున్నా ఖాళీగా ఉంచితే ఎలా..?: మంత్రి జగదీష్‌రెడ్డి విధాత: వానా కాలం సాగు చేసిన పత్తి, వరి పంటల తరువాత యాసంగిలో ఆకుకూరలు, కూరగాయల వంటి డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగు చేసుకోవాలని రైతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పంట మార్పిడి సాగు వల్ల భూమిలో సారం కూడా పెరుగుతుందని తెలిపారు. శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి […]

సైదులు.. వ్యవసాయం ఎట్లుంది! మంత్రి జగదీష్‌రెడ్డి ఆరా
  • డిమాండ్‌ ఉన్న పంటలు వేయాలి..
  • కాళేశ్వ‌రం నీళ్లు వ‌స్తున్నా ఖాళీగా ఉంచితే ఎలా..?: మంత్రి జగదీష్‌రెడ్డి

విధాత: వానా కాలం సాగు చేసిన పత్తి, వరి పంటల తరువాత యాసంగిలో ఆకుకూరలు, కూరగాయల వంటి డిమాండ్ ఉన్న ఇతర పంటల సాగు చేసుకోవాలని రైతులకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. పంట మార్పిడి సాగు వల్ల భూమిలో సారం కూడా పెరుగుతుందని తెలిపారు.

శనివారం సూర్యాపేట నియోజకవర్గంలోని పలు శుభకార్యాలకు హాజరైన మంత్రి పెన్ పహాడ్ మండలం అనాజి పురం, అనంతారం మధ్య కారు దిగి రైతులతో మాట్లాడారు. రైతులు ఉన్నబోయిన సైదులు, నూకల జానయ్యలతో కాసేపు ముచ్చటించారు. సైదులు వ్యవసాయం ఎట్లా ఉందని, వానాకాలంలో ఏ పంటను సాగు చేశారంటూ మంత్రి ఆరా తీశారు. వానా కాలం పంటగా వేసిన పత్తి దిగుబడి ఎంత వచ్చిందని? మారెట్‌లో ధర ఎంత ఉన్నదని? పంట చేతికొచ్చేవరకు ఎన్ని తడులు నీళ్లు పెట్టారంటూ రైతులను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం చాలా మంది రైతులు పత్తి సాగు తరువాత తమ భూములను ఖాళీగా ఉంచడం చూసిన మంత్రి అలా ఖాళీగా ఎందుకు? ఉంచారని అడిగారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండటంతో దిగుబడి పెరిగిందని, రైతులు పొన్నబోయిన సైదులు, నూకల జానయ్యలు మంత్రికి వివరించారు. భూముల పక్క నుంచే కాలువల ద్వారా కాళేశ్వరం నీరు వెళుతున్నా ఖాళీగా ఉంచడం బాగోలేదని మంత్రి అన్నారు.

రెండవ పంటగా కూరగాయలు, ఆకు కూరలు సాగు చేస్తే, రైతులతో పాటు మరో ముగ్గురు వ్యవసాయ కూలీలకు ఉపాధి లభిస్తుందని మంత్రి అన్నారు. ఒకరిద్దరు రైతులు మొదలు పెడితే క్రమ క్రమంగా మిమ్మ‌ల్ని చూసి రైతులంద‌రూ మీ దారిలో నడుస్తారనీ మంత్రి అన్నారు. సూర్యాపేట వంటి పట్టణాలు గ్రామాలకు దగ్గర గా ఉండటంతో మార్కెట్ లో డిమాండ్‌ ఉన్న పంటల సాగును రైతులు చేపట్టాలన్నారు.

మంత్రి జగదీష్ రెడ్డి తమ బిజీ షెడ్యూల్ ను పక్కన పెట్టి తమలో ఒకడిగా కలిసిపోయి వ్యవసాయంపై చర్చించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రి వెంట పెన్ పహాడ్ ఎంపిపి నెమ్మాది భిక్షం, సూర్యాపేట జడ్పీటిసి జీడి భిక్షం, అనాజిపురం సర్పంచ్ చెన్ను శ్రీనివాస్ రెడ్డి, పెన్ పహాడ్ యూత్ మండల అధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.