తెలుగు రాష్ట్రాల జల వివాదం విచారణ వాయిదా

విధాత : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ విచారణ నవంబర్ 22,23 తేదీలకు వాయిదా పడింది. రెండు రాష్ట్రాల మధ్య నీటీ పంపకాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన ఆదేశాలివ్వాలని ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టం మేరకు రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నది జలాల పంపకాలపై విచారణ అధికారాలను కేంద్రం నోటిఫై చేసింది.
బుధవారం విచారణ సందర్భంగా కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సివుందని, అందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ట్రైబ్యునల్‌ను కోరింది. అయితే ఏపీ అభ్యర్థపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. నీటి పంపకాలపై వెంటనే విచారణ చేపట్టాలని ట్రైబ్యూనల్‌ను కోరింది.
అయితే ఏపీ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను ట్రైబ్యూనల్ వాయిదా వేసింది. నవంబర్ 15వ తేదీలోగా కేంద్రం ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌పై అభిప్రాయం చెప్పాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 22,23తేదీలకు వాయిదా వేసింది.