పాలమూరులో మూడు పార్టీల ఢీ

- కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ రసవత్తర పోరు
- పట్టు కోసం ఎత్తుకు పైఎత్తులు
- అభ్యర్థి ప్రకటనతో గులాబీ ప్రచార జోరు
- కాంగ్రెస్, బీజేపీలో తేలని అభ్యర్థులు
- అయోమయంలో శ్రేణులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: పాలమూరు నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికల బరిలోకి దూకనున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. పట్టు కోసం రసవత్తర పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గత ఎన్నికలో ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి మంచి పట్టు ఉండేది. ఆ పార్టీ నేత పొడపాటి చంద్రశేఖర్ పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, నాలుగుసార్లు మంత్రి పదవి చేపట్టారు.
అప్పట్లో కాంగ్రెస్ ఒక్కటే పోటీగా ఉండేది. 2004లో టీడీపీకి కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. టీడీపీ అభ్యర్థి చంద్రశేఖర్ పై కాంగ్రెస్ అభ్యర్థి పులి వీరన్న భారీ విజయం సాధించారు. ఆ తర్వాత టీడీపీ కనుమరుగైంది. 2009 ఎన్నికల్లో అనూహ్యంగా స్వతంత్ర అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. ప్రధాన పార్టీలు ఖంగుతిన్నాయి. ఎన్నికైన రెండున్నరేళ్లకు రాజేశ్వర్ రెడ్డి మరణించారు. 2012లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, తెరాస నుంచి సయ్యద్ ఇబ్రహీం మధ్య ప్రధాన పోటీ ఏర్పడింది.
కాంగ్రెస్ నామమాత్రంగా అభ్యర్థిని నిలిపింది. బీజేపీ అభ్యర్థి ఎన్నం తెరాసపై కేవలం 1859 స్వల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో బీజేపీకి పట్టు దొరికిందని ఆ పార్టీ నేతలు అనుకున్నారు. గతంలో ఎన్నం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా తెరాస అధ్యక్షులుగా పనిచేసి, కొద్దికాలానికి పలు కారణాల వల్ల ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరారు. 2012 ఎన్నికల్లో తెరాస కార్యకర్తలు, పలువురు నాయకులు ఎన్నంకే ఓట్లు వేయడంతో ఆయన గెలిచారనే చర్చ అప్పట్లో సాగింది.
కొత్త రాష్ట్రంలో గులాబీ పాగా
పాలమూరు నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నం, తెరాస నుంచి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ నుంచి ఓబేదుల్లా కొత్వాల్, తెరాస టికెట్ ఆశించి రాకపోవడంతో సయ్యద్ ఇబ్రహీం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెరాసకు బలం పెరిగింది. ఉద్యమ నేత శ్రీనివాస్ గౌడ్ ను రంగంలోకి దింపింది. ఇక్కడ గెలుపు సునాయాసంగా ఉంటుందని భావించిన తెరాసకు బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.
తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు 45447 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి ఎన్నంకు 42308 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 22749 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి సయ్యద్ ఇబ్రహీంకు 27395 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కంటే స్వతంత్ర అభ్యర్థికే ఓట్లు అధికంగా రావడం విశేషం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో తప్పిదం చేశామనే అభిప్రాయం వ్యక్తం చేసింది. తర్వాతి క్రమంలో పాలమూరు నియోజకవర్గంలో రోజురోజుకూ కాంగ్రెస్, బీజేపీ పట్టుకోల్పోయే స్థితికి వచ్చాయి. 2018 ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గం మహాకూటమి (కాంగ్రెస్, టీడీపీ, వామపక్ష పార్టీలు)కి కేటాయించారు.
అంతకు ముందే బీజేపీని వీడిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. టికెట్ చివరి నిమిషంలో ఈ స్థానం మహాకూటమిలోని టీడీపీకి దక్కింది. ఈపార్టీ తరపున ఎర్ర శేఖర్ కు టికెట్ వచ్చింది. ఎన్నంకు అవకాశం లేకుండా పోయింది. మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్ ఘోరంగా ఓటమి చెందారు. తెరాస అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ కు 86474 ఓట్లు రాగా, మహాకూటమి అభ్యర్థి ఎర్ర శేఖర్ కు 28699 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి పద్మజా రెడ్డికి కేవలం 5945 ఓట్లు మాత్రమే రావడంతో బీజేపీ నేతలు అయోమయంలో పడ్డారు. శ్రీనివాస్ గౌడ్ భారీ విజయం తన ఖాతాలో వేసుకోవడంతో మంత్రి పదవి దక్కింది.
బీఆరెస్ లో ప్రచార హోరు.. కాంగ్రెస్, బీజేపీలో అయోమయం
ప్రస్తుతం పాలమూరు నియోజకవర్గంలో ప్రధాన మూడు పార్టీల ప్రచారం జోరందుకుంది. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అభ్యర్థిని ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల పరిశీలనలోనే ఉన్నాయి. దీంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. అయినా టికెట్ తమకే వస్తుందనే నమ్మకంతో ఆ రెండు పార్టీల నేతలు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇచ్చినా మద్దతుగా ఉంటామనని ప్రకటిస్తూ ఎన్నం ప్రచారం చేస్తున్నారు.
కాగా టికెట్ ఎన్నంకే వస్తుందనే ధీమాతోనే ఆయన ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆయన జిల్లాకేంద్రంలో ప్రచారం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే అంటూ ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. కాంగ్రెస్ లో ఎన్నం రాకతో ఈ నియోజకవర్గంలో కొంత బలం పెరిగిందనే భావనలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ తన ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఇప్పటికే ప్రచారం చేస్తూ చుట్టి వచ్చారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కుల సంఘాల సమావేశాలను నిర్వహించి, ఆ సంఘాల భవనాలకు కావాల్సిన భూములు కేటాయించి తన వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో మంత్రి సఫలం అయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. నియోజకవర్గంలో ప్రచారాలను తనకు కలిసొచ్చేలా మంత్రి పావులు కదుపుతూ, మళ్లీ పట్టు నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పట్టణ ఓటర్లే కీలకం
పాలమూరు నియోజకవర్గం రెండు మండలాలకే పరిమితమైంది. మహబూబ్ నగర్, హన్వాడ మండలంతో పాటు పాలమూరు పట్టణం ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. పట్టణ ప్రాంతంలో ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ ఓట్లే ఎన్నికల్లో కీలకంగా కానున్నాయి. పాలమూరు పట్టణం లో ముస్లిం మైనారిటీ ఓట్లు గణనీయంగా ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఈ వర్గం తెరాస వైపు ఉండడంతో ఆ పార్టీకి భారీ మెజారిటీ వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. రానున్న ఎన్నికల్లో ఈ వర్గం ఓట్లు గతంలో మాదిరిగా బీఆర్ఎస్ కు వెళతాయా? లేకుంటే కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ వైపు ఉన్న మైనార్టీలు ఇక్కడ కూడా నిలుస్తారా అనేది త్వరలో తేలనుంది. పాలమూరులో గెలుపు మాదే అంటూ ఈ మూడు పార్టీల నేతలు ధీమాగా ఉన్నారు.