కాషాయానికి గుడ్ బై.. గులాబీ గూటికి ఉమ..
సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో బి.జె.పి.కి ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ టిక్కెట్ ఆశించి భంగపడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ తిరిగి మాతృ సంస్థకే చేరుకున్నారు.

- దొరలపై గళమెత్తి.. వారి గడీల్లోకే..
సిరిసిల్ల జిల్లా వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో బి.జె.పి.కి ఎదురుదెబ్బ తగిలింది. వేములవాడ టిక్కెట్ ఆశించి భంగపడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు తుల ఉమ తిరిగి మాతృ సంస్థకే చేరుకున్నారు. కాషాయ జెండాను వీడుతున్న లేఖను మీడియాకు విడుదల చేసిన ఉమ బి.ఆర్.ఎస్.లో చేరేందుకు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. వేములవాడ టిక్కెట్టును తొలుత తుల ఉమకు కేటాయించిన బి.జె.పి. నామినేషన్ల చివరి రోజున అనూహ్యంగా బి ఫామ్ చెన్నమనేని వికాస్ రావుకు కేటాయించింది. అప్పటికే తన నామినేషన్ దాఖలు చేసిన ఉమ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో షాక్ కు గురయ్యారు.
దొరల గడీలకు వ్యతిరేఖంగా
తాను మొదటి నుండి దొరల గడీలకు వ్యతిరేఖంగా పోరాడానని.. బి.ఆర్.ఎస్. నుండి కూడా దొరల అహంకారంతో బయటకు వచ్చానని గత రెండు రోజులుగా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. జీవితాంతం దొరలకు వ్యతిరేఖంగా పోరాడిన తాను వారి వద్ద చేతులు కట్టుకొని ఉండలేనని వ్యాఖ్యలు చేశారు. వేములవాడ శాసనసభ బరిలో ఖచ్చింతంగా పోటీలో ఉంటానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు వేములవాడ శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి. చివరి నిముషంలో బి.జె.పి. ఆమె అభ్యర్థిత్వాన్ని నిరాకరించడంతో ప్రజల్లో సానుభూతి కూడా వెల్లువెత్తింది. దీంతో ఆమె బి.సి.లతో కలిసి నడుస్తారనే అభిప్రాయలు వ్యక్తం అయ్యాయి.
మరోవైపు “అలిగి వెళ్లిన కూతురు తిరిగి తండ్రి పంచన చేరుతుందని” సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్ అయ్యాయి. బి.జె.పి. టిక్కెట్టు నిరాకరించిన వెనువెంటనే కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, ఆ పార్టీ ముఖ్య నేతలు ఉమను కలుసుకొని సానుభూతి ప్రకటించారు. దొరలపై చేసే యుద్ధంలో తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. బి.ఆర్.ఎస్. నేతలు కూడా ఉమ ఇంటికి క్యూ కట్టారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఆమెతో ఫోన్ లో మాట్లాడి పార్టీలోకి తిరిగి రావాల్సిందిగా ఆహ్వానించారు.

వేములవాడ బి.ఆర్.ఎస్. అభ్యర్థి లక్ష్మీ నరసింహా రావు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఉమ అధికార పార్టీలో చేరుతుందనే ప్రచారం ఊపందుకొంది. అయితే ఆదివారం వరకు ఆ వార్తలను తోసిపుచ్చిన ఉమ తన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తాను బి.ఆర్.ఎస్.లో చేరుతున్నాననే ప్రచారం కూడా తప్పేనని ప్రకటించారు. రాజకీయంగా తాను ఇప్పటికే చాలా నష్టపోయానని, మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకూడదనే కోరుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని అన్నారు. కానీ అనూహ్యంగా సోమవారం ఆమె తన అనుచరులతో కలిసి ప్రగతి భవన్ బాట పట్టారు.
టిక్కెట్ నిరాకరణ వెనుక కారణాలేమిటి..?
వేములవాడ టిక్కెట్టును బి.జె.పి.అధిష్టానం తొలుత తుల ఉమకు కేటాయించింది. చివరి క్షణంలో తన నిర్ణయాన్ని మార్చుకొని చెన్నమనేని విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావుకు భీ ఫామ్ కేటాయించింది. ఉమకు టికెట్ వచ్చిన వెంటనే స్థానిక బి.జె.పి. నాయకత్వం ఆమెకు వ్యతిరేఖంగా పార్టీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళనలను చేపట్టింది. గతంలో జనశక్తిలో పని చేసిన తుల ఉమ తమ పార్టీ నేతలు టార్గెట్ గా వ్యవహరించిన విషయాన్ని స్థానిక నాయకత్వం రాష్ట్ర పార్టీ ముందు ఏకరువు పెట్టింది.
మేడిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బాబుమియాతో పాటు మరో ఇద్దరు పార్టీ సర్పంచులను జనశక్తి హత్య చేసిందని, సిరిసిల్ల జిల్లా బి.జె.పి. ప్రస్తుత అధ్యక్షుడు రామకృష్ణపై కూడా జనశక్తి దాడులు చేసిన విషయాన్ని వారు పార్టీ నాయకత్వానికి నివేదించారు. జనశక్తిలో ఉన్నప్పుడు తమ పార్టీ నేతలే టార్గెట్ గా వ్యవహరించిన ఉమకు టిక్కెట్ ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. ఇక విద్యాసాగర్ రావు జీవితం బి.జె.పి.తో పెనవేసుకుపోయిందని, ఆయన తనయుడు వికాస్ రావుకు టిక్కెట్ ఇస్తే తప్పేమిటని వారు పార్టీ రాష్ట్ర నేతలను నిలదీశారు. దీంతో పునరాలోచనలో పడ్డ బి.జె.పి. రాష్ట్ర నాయకత్వం చివరి క్షణంలో వికాస్ రావు అభ్యర్థిత్వం వైపు మొగ్గు చూపడానికి కారణం అయినట్లు తెలుస్తోంది.
తిరిగి దొరల గడీలలోకే..
దొరల గడీలు బద్ధలు కొడతానని, వారికి వ్యతిరేఖంగా జీవితాంతం పోరాడానని మాట్లాడిన ఉమ అనూహ్యంగా దొరల గడీల్లోకే వెళ్లాలని నిర్ణయించడం ఆమె అనుచరవర్గానికి రుచించడం లేదు. నిన్నటి వరకు తాను ఎత్తిన గళానికి అనుగుణంగా ఆమె నిర్ణయం తీసుకుంటారని భావించిన అనుచరులకు బి.ఆర్.ఎస్.లో చేరాలన్న ఆమె నిర్ణయం మింగుడుపడటం లేదు.
