అద్దంకి దయాకర్‌కు అడ్డుపడ్డది ఎవరు?
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన అద్దంకి దయాకర్ పేరు అనూహ్యంగా మరుగునపడి.. అవకాశం దక్కకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు

- గవర్నర్ కోటాపై పీటముడి వీడేదెన్నడు?
- కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చలు
విధాత ప్రత్యేకం: గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రచారం జరిగిన అద్దంకి దయాకర్ పేరు అనూహ్యంగా మరుగునపడి.. అవకాశం దక్కకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఆయన అవకాశాలను దెబ్బతీశాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడిన సమయంలో చండూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సభలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పినా వారి మధ్య వైరం అలాగే ఉన్నదనే ప్రచారం జరుగుతున్నది. అద్దంకికి ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డకున్నదని వెంకట్‌రెడ్డే అనే ఆరోపణలున్నాయి. తాజాగా ఎమ్మెల్సీగా కూడా అవకాశం రాకపోవడంపై మరోసారి ఆయన పేరే తెరమీదికి వస్తున్నది. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణాల ఆధారంగా మహేశ్‌కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ హైకమాండ్ అవకాశం కల్పించిదనేది పార్టీ వర్గాల వాదన. ఎవరి వాదనలు ఎలా ఉన్నా అద్దంకి దయాకర్‌కు మరోసారి అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో ఆయన అభిమానులు, ఆయన అనుచరులు వాపోతున్నారు.
గవర్నర్ కోటాపై పీటముడి వీడేదెన్నడు?
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా కీలక పాత్ర పోషించి, తర్వాత తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించిన ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎంపిక చేసినా.. వారికి రాజకీయ నేపథ్యం ఉన్నదంటూ గవర్నర్ తమిళిసై అప్పట్లో తిరస్కరించిన సంగతి తెలిసిందే. మంత్రివర్గ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదించాలి కానీ తిరస్కరించడానికి వీల్లేదని బీఆర్‌ఎస్ నేతలు అప్పట్లో వాదించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే.. కోదండరామ్‌తో పాటు మరొకరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ప్రతిపాదనలు పంపే యోచనలో ఉన్నది. అయితే కోర్టు తీర్పు వచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు తీసుకోరాదని నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో జనసమితి పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపింది. కాబట్టి కోదండరామ్‌కు ఎమ్మెల్సీతో పాటు ఆయన సేవలను ప్రభుత్వం వినియోగించుకోవాలన్నది ఉద్యమకారుల డియాండ్‌గా వస్తున్నది. ఆయన మంత్రి కూడా అవుతారనే ప్రచారం జరుగుతుండగానే గవర్నర్ తాజా నిర్ణయంతో ఈ పీటముడి వీడేదెన్నడు? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కోర్టు తీర్పు వరకు వేచి చూడక తప్పదని అంటున్నారు. కానీ గత ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి రాని వారికి ఇతర అవకాశాలు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. తమ వంతు వస్తుందని ఎదురుచూస్తున్న ఆశావహులు షాక్ తినేలా అనుహ్య పరిణామాలు ఇవాళ చోటుచేసుకున్నాయి. రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ ఆశిస్తున్న నేతల జాబితా ఆ పార్టీలోనే ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.