కాంగ్రెస్‌కు వైఎస్ షర్మిల బేషరతు మద్ధతు

- పోటీ నుంచి ఉపసంహరణ
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ పోటీ నుండి తప్పుకుని కాంగ్రెస్‌కు బేషరతు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల ప్రకటన చేశారు. శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో కాంగ్రెస్‌కు మద్దతునిస్తు వైఎస్సార్టీపీ తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించారు. తాను కూడా పాలేరు నుంచి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. గతంలో తమ కోసం పనిచేసిన కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని గెలుపు కోరుతు తాను పాలేరు పోటీ నుంచి తప్పుకుంటున్నానని తెలిపారు.
పార్టీ నిర్ణయం అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్టీపీ శ్రేణులు అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలని కోరారు. తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ రాజ్యం తేవాలని, నియంతృత్వ, అవినీతి కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయాలన్న లక్ష్యాలతో తాను వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించానన్నారు. పార్టీ స్థాపన నుంచి తెలంగాణ ప్రజల సమస్యల సాధనకు 3వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేశానన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేసిన పోరాటాల్లో భాగంగా జైలుకు కూడా వెళ్లానన్నారు. అయితే వైఎస్సార్టీపీ ఎన్నికల పోరాటానికి ఇంకా సిద్ధం కావాల్సివుందన్నారు. ఈ నేపధ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఈ ఎన్నికల్లో సెక్యులర్ పార్టీ కాంగ్రెస్‌కు మద్దతునివ్వాలని నిర్ణయించామన్నారు. దివంగత వైఎస్సార్ గతంలో రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలని కోరిన తొలి వ్యక్తి అన్నారు. ఆయన ఆకాంక్షల సాధనకు వైఎస్సార్టీపీ మద్దతునిస్తుందన్నారు.