Tirupati Laddu | తిరుపతి లడ్డూ వివాదంపై ప్రత్యేక సిట్ దర్యాప్తు : సుప్రీంకోర్టు ఆదేశాలు

తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల రావడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయమై ఎటువంటి ఆధారాలు లేకుండా మీడియాతో మాట్లాడంపై సుప్రీంకోర్టు ఏపీ ముఖ్యమంత్రిని తప్పబట్టింది. వివాదంపై నిజానిజాలు తేలాలని సుబ్రహ్మణ్యస్వామి, సుబ్బారెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో కేసులు వేసారు.

  • By: Tech    ttd    Oct 04, 2024 1:47 PM IST
Tirupati Laddu | తిరుపతి లడ్డూ వివాదంపై ప్రత్యేక సిట్ దర్యాప్తు : సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈరోజు తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణలో ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై విచారణకు స్వతంత్ర సిట్‌(independent SIT) ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఆదేశించింది. తిరుమల లడ్డూ వ్వవహారంపై దాఖలైన పిటిషన్‌లపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు మరోమారు విచారణ జరిపింది. ‘‘రాష్ట్ర పోలీసులు(AP State Police), సీబీఐ(CBI), ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ (FSSAI) ప్రతినిధులతో కూడిన స్వతంత్ర సిట్ ద్వారా దర్యాప్తు నిర్వహించాలని మేము సూచిస్తున్నాం. సీబీఐ డైరెక్టర్‌ (CBI Director) ఆధ్వర్యంలో విచారణ జరిపితే అది సముచితంగా ఉంటుంది’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది.

ఐదుగురు సభ్యుల సిట్‌(5 member SIT)లో సీబీఐ డైరెక్టర్ ద్వారా ఎంపిక చేయబడిన ఇద్దరు సీబీఐ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల నుంచి ఇద్దరు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్ఏఐ నుంచి ఒక సీనియర్ అధికారి ఉండాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి సీనియర్ అధికారి ఎవరనేది ఆ సంస్థ చైర్‌పర్సన్ ఎంపిక చేస్తారని న్యాయస్థానం  తెలిపింది. శ్రీనివాసుడిపై అచంచల భక్తివిశ్వాసాలున్న కోటానుకోట్లాది మంది భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని ఈ ఉత్తర్వును జారీ చేస్తున్నామని జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.

కాగా,  తిరుపతి లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రమణ్యస్వామి(Subramanya Swamy), టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy), తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై ఇటీవల విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగించాలా? లేదా ఏదైనా స్వతంత్ర సంస్థ చేత దర్యాప్తు కొనసాగించాలా? అనేది తెలుపాలని సొలిసిటర్ జనర్ తుషార్ మోహతా(SG Tushar Mehta)కు సూచించింది. తిరుమల లడ్డూపై విచారణ పూర్తి కాకముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై బహిరంగ ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టింది. ఈ అంశంపై తదుపరి విచారణను గురువారానికి (అక్టోబర్ 3) వాయిదా వేసింది.

అయితే నిన్న సొలిసిటర్ జనర్ తుషార్ మోహతా సమయం కోరడంతో విచారణ నేటికి (అక్టోబర్ 4) వాయిదా పడింది. దీంతో ఈరోజు ఉదయం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి పై ఆదేశాలు జారీ చేసింది.