ఇది అమానుష ఘ‌ట‌న‌. ఓ యువ‌కుడు త‌న ప్రియురాలిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అత‌ని త‌ల్లి ప‌ట్ల అమ్మాయి త‌ర‌పు బంధువులు క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు

బెంగ‌ళూరు : ఇది అమానుష ఘ‌ట‌న‌. ఓ యువ‌కుడు త‌న ప్రియురాలిని తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అత‌ని త‌ల్లి ప‌ట్ల అమ్మాయి త‌ర‌పు బంధువులు క్రూరంగా ప్ర‌వ‌ర్తించారు. మ‌హిళ అని కూడా చూడ‌కుండా, ఆమెను వివస్త్రను చేసి స్తంభానికి క‌ట్టేశారు. ఆ త‌ర్వాత ఆమెను చిత‌క‌బాది హింసించారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బెళ‌గావికి చెందిన ఓ యువ‌కుడు.. స్థానికంగా ఉండే ఓ యువ‌తిని గ‌త కొన్నేండ్ల ప్రేమిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆ యువ‌తిని బ‌య‌ట‌కు తీసుకెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అమ్మాయి త‌ల్లిదండ్రులు, బంధువులు ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఆదివారం రాత్రి నేరుగా అబ్బాయి ఇంటికి వెళ్లి, అత‌ని త‌ల్లిని బ‌య‌ట‌కు ఈడ్చుకొచ్చారు.

ఆ త‌ర్వాత ఆమెను వివస్త్రను చేసి స్తంభానికి క‌ట్టేసి, తీవ్రంగా చిత‌కబాదారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, బాధితురాలిని చేరదీశారు. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం: సీఎం సిద్ధ‌రామ‌య్య‌

ఈ ఘ‌ట‌న‌పై క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్య తీవ్రంగా స్పందించారు. మ‌హిళ‌ను వేధించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. ఒక్క బెళ‌గావిలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్క‌డ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన స‌హించ‌మ‌ని తేల్చిచెప్పారు. ఈ ఘ‌ట‌న‌తో సంబంధం ఉన్న‌వారిని ఇప్ప‌టికే అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. బాధితురాలికి న్యాయం జ‌రిగేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఏడుగురిని అరెస్టు చేశాం: క‌ర్ణాటక హోంమంత్రి

మ‌హిళ‌ను వేధించిన కేసులో ఏడుగురిని అరెస్టు చేశామ‌ని క‌ర్ణాట‌క హోం మంత్రి జీ ప‌ర‌మేశ్వ‌ర తెలిపారు. నిందితుల‌ను వీలైనంత త్వ‌ర‌గా కోర్టులో హాజ‌రు ప‌రుస్తామ‌న్నారు. బాధితురాలిని ప‌రామ‌ర్శించి, మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించిన‌ట్లు పేర్కొన్నారు.

Updated On 11 Dec 2023 10:54 AM GMT
Somu

Somu

Next Story