Nagaur Fair | రాజస్థాన్‌లో ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలున్నాయి. పురాతన కట్టాలు, చారిత్రక కోటలు దేశవిదేశాల్లో పర్యాటకులను ఆకర్షిస్తుంటాయి. ఏటా లక్షల్లో పర్యాటకులు తరలివస్తుంటారు. ఏటా ఎన్నో జాతరలు జరుగుతూ వస్తుంటాయి. ఇందులో జనవరి-ఫిబ్రవరి మధ్యజరిగే నాగౌర్‌ జాతర కీలకమైంది. ప్రతి సంవత్సరం జనవరి లేదంటే ఫిబ్రవరిలో కొనసాగుతుండగా.. ఈ జాతరలో జంతు ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది ఫెయిర్‌ ఫిబ్రవరి 15న మొదలై.. 18 వరకు కొనసాగుతున్నది.


దీన్ని రామ్‌దేవ్‌ జీ పశువుల జాతర లేదంటే.. నాగౌర్‌ పశువుల జాతరగా పిలుస్తుంటారు. ఈ జాతర దాదాపు 56 సంవత్సరల కిందట ప్రారంభమైంది. నాగౌర్ జాతర రాజస్థాన్‌లో రెండో అతిపెద్ద జాతరగా పేర్కొంటారు. ఈ జాత‌ర‌లో పశువులు తమ జంతువులను కొనడానికి, విక్రయించడానికి సుదూర ప్రాంతాల నుంచి జాతరకు తరలివస్తుంటారు. ఇందులో అనేక రకాల జాతుల జంతువులు కనిపిస్తాయి. ప్రతి ఏటా 75వేల ఒంటెలు, ఎద్దులు, గుర్రాల వ్యాపారం జరుగుతుంటుంది.


నాగౌర్ బికనీర్-జోధ్‌పూర్ మధ్య ఉన్న నగరం. నాగౌర్‌ జాతరను ఏటా మాఘ శుక్ల సప్తమి రోజున నాగౌర్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోని మన్సార్ గ్రామంలో ప్రారంభమవుతుంది. పశువుల యజమానులు జాతరకు తీసుకువచ్చే ముందు వాటిని అందంగా అలంకరిస్తారు. నాగౌరి జాతికి చెందిన ఎడ్లను పెద్ద ఎత్తున జాతరలో విక్రయిస్తుంటారు. ఒంటెలు, ఆవులు, గుర్రాలు, గొర్రెలు క్రయ విక్రయాలే కాకుండా సుగంధ ద్రవ్యాల వ్యాపారం సైతం ఇక్కడ జోరుగా సాగుతుంది. ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ మిర్చీ బజార్‌. నాగౌర్‌ ఎర్ర మిరిపకాయలు ఎంతో ప్రసిద్ధి చెందాయి.


అలాగే, చెక్కతో అందంగా చెక్కిన వస్తువులు, తోలుతో చేసిన వస్తువులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. జాతరలో టగ్ ఆఫ్ వార్, ఒంటెల నృత్యం, గుర్రపు నృత్యంతో సహా అనేక ఆటలు సైతం నిర్వహిస్తుంటారు. కూచమణి ఖయాల్ గానం, నాగౌర్ స్థానిక కళ, సంస్కృతి గురించి తెలుసుకునే వీలు జాతరలో ప‌ర్యాట‌కుల‌కు దొరుకుతుంది. ఇక ఈ జాతరకు చేరుకునేందుకు సమీపంలోనే జోధ్‌పూర్లో విమానాశ్రయం ఉన్నది. ఇది 137 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జోధ్‌పూర్‌, జైపూర్‌, బకనీర్‌, నాగౌర్‌కు రైళ్లతో పాటు బస్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా జాతరకు చేరుకోవచ్చు. ఎవరైనా రాజస్థాన్‌ పర్యటనకు వెళ్తున్నట్లయితే ఈ జాతరను మిస్సవకుండా చూసివచ్చేయండి.

Somu

Somu

Next Story