MLA Maheshwar Reddy | కేంద్ర నిధులను బంధువులకు ధారదత్తం చేసిన సీఎం: బీజేఎల్పీ నేత ఏలేటి
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చీకటి టెండర్లు కోడ్ చేసి 1200కోట్ల కుంభకోణం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.

విచారణలో ఉన్న మెఘాకు కొత్త కాంట్రాక్టులు
ఈడీ, సీబీఐ విచారణకు డిమాండ్
విధాత, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చీకటి టెండర్లు కోడ్ చేసి 1200కోట్ల కుంభకోణం చేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం తమ్ముడు, బామ్మర్ది భాగస్వాములుగా ఉన్న కంపెనీలకు ఇష్టానుసారంగా కాంట్రాక్టులు ధారాదత్తం చేశారన్నారు. మేఘా, కేఎన్ఆర్,, శోధ కంపనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని, సీఎం రేవంత్‌రెడ్డి బామ్మర్ది సుజన్‌కు 400కోట్ల్లు, మెగా కృష్ణారెడ్డికి 1100కోట్ల పనులు అప్పించారని, ఎస్టిమేట్స్ అన్ని కాంట్రాక్టర్లే తయారు చేసుకున్నారని, 600కోట్లతో అయ్యే పనికి 1000కోట్ల ఎస్టిమేట్స్ తయారు చేశారని ఏలేటి ఆరోపించారు.
కాంట్రాక్టర్లు 30నుంచి 35శాతం లెస్తో టెండర్లు వేసి కాంట్రాక్టు దక్కించుకున్నారంటేనే అవినీతి అర్థం చేసుకోవచ్చన్నారు. వాటికి సంబంధించిన ఒక జీవోను కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదన్నారు. టెండర్ డాక్యుమెంట్స్‌ను పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదని మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై ఒక వైపు జ్యుడిషియల్ విచారణ జరుగుతుంటే… అదే మెఘా కృష్ణారెడ్డికి రూ. 11 వందల కోట్ల పనులు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఏడు నెలల్లో చేసిన చీకటి ఒప్పందాలపైన, టెండర్లపై.. విచారణకు సిద్ధమా అని రేవంత్‌రెడ్డిని సవాల్ చేశారు. హెటిరో డ్రగ్స్ భూమి విషయంలోనూ, సివిల్ సప్లై అవినీతిపై విచారణకు సిద్ధమా అని నిలదీశారు. కొడంగల్ ప్రాజెక్టు కూడా మెఘా కృష్ణారెడ్డికే అప్పగించబోతున్నారని,. తెలంగాణలో చీకటి కోణంలో చీకటి పాలన కొనసాగుతోందని, కేంద్ర ప్రభుత్వం నిధుల దుర్వినియోగంపై సీబీఐ, ఈడీ విచారణ చేయాలని కోరనున్నట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు.