గుడిసెపై గులాబీ జెండా ఎగిరేనా?

గుడిసెపై గులాబీ జెండా ఎగిరేనా?
  • కాలనీలపై బీఆర్ఎస్ ఫోకస్
  • జీవో 58, 59 ద్వార పట్టాలు
  • దరఖాస్తుకు ఎమ్మెల్యేల సహకారం
  • 70 సెంటర్లలో పేదల నివాసం
  • ప్రాథమిక సౌకర్యాల కల్పనపై దృష్టి
  • అన్ని పక్షాల కన్ను ఆ వర్గాలపైనే..


విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: నగరంలోని గుడిసెవాసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోకస్ ఎన్నికల్లో ఫలితాన్నిస్తుందా? గుడిసెలపై గులాబీ జెండా ఎగురుతుందా? అనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. వరంగల్ నగర పరిధిలో ప్రధానమైన వరంగల్ పశ్చిమ, తూర్పు ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ గుడిసె వాసులకు పట్టాలిప్పించేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. జీవో 58, 59 ద్వారా ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన ఎమ్మెల్యేలు, వారికి పట్టాలు వచ్చే విధంగా కృషి చేశారు.


వీరికి తోడు పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్ తమవంతు ప్రయత్నం చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో 8 మేరకు గుడిసె వాసులకు పట్టాలిస్తున్నట్లు చెబుతున్నారు. రానున్న ఎన్నికల్లో గుడిసెవాసులు తమకు అనుకూలంగా ఓటేస్తారని నమ్మకంతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ రాక సందర్భంగా పట్టాల పంపిణీ చేపట్టడంతో ఎమ్మెల్యేలు గుడిసెవాసులతో ప్రత్యేకంగా సమావేశమై, తమకు ఓటేయాలని విన్నవిస్తున్నారు. దాస్యం వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్లు గుడిసె వాసుల కాలనీలను సందర్శించి వారి మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు.


ఏళ్లుగా గుడిసె వాసుల నివాసం


చాలా ఏళ్ల క్రితం చెరువు శిఖం, దేవదాయ శాఖ భూములు, సీలింగ్, ప్రభుత్వ స్థలాలు తదితర ప్రాంతాలలో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో ఈ గుడిసె కాలనీలు వెలిశాయి. నివసించేందుకు గూడు కరువైన పేదలు కమ్యూనిస్టు పార్టీల సహకారంతో దశాబ్ద కాలంగా ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.


ఈ సందర్భంగా ప్రభుత్వం, పోలీసులు, అధికారులతో గుడిసెవాసులు అనేక పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. గుడిసెలను తొలగించి లాఠీచార్జీ చేసిన సంఘటనలు, అక్రమ కేసులు బనాయించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజా పోరాట ఫలితంగా అని ప్రభుత్వాలు సైతం వారికి హక్కులు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. మెజారిటీ గుడిసెవాసుల కాలనీలో కనీస వసతులు కూడా లేని ఆ ప్రాంతంలో వారి మనుగడ దినదిన గండంగా కొనసాగుతూ వచ్చింది.


గులాబీల వైపు మొగ్గు చూపేనా..


కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో గుడిసెవాసుల కాలనీలు వెలసినప్పటికీ క్రమంగా కాలనీలలో ఇతర పార్టీల నాయకుల ఆధిపత్యం పెరిగింది. గత కొద్ది సంవత్సరాల క్రితం సీపీఐ, సీపీఎంకు చెందిన పలువురు నాయకులు ఇతర పార్టీల్లో చేరడంతో గుడిసె వాసుల కాలనీపై కమ్యూనిస్టుల పట్టు తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ సీపీఐ, సీపీఎంలు తమవంతు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రెగ్యులరైజేషన్ చేసుకొనే క్రమంలో బీఆర్ఎస్ తో వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎంలతో పొత్తు ఉంటుందని చర్చ సాగింది. తాజాగా రాజకీయ పరిస్థితి రాష్ట్రంలో మారిపోయింది.


బీఆర్ఎస్‌కు సీపీఐ, సీపీఎం పక్షాలు దూరమయ్యాయి. పైగా ఇండియా కూటమిలో ఆ రెండు పార్టీలు భాగస్వామ్యమైన నేపథ్యంలో గులాబీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో గుడిసె వాసులు గులాబీ జెండా వైపు మొగ్గు చూపుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. పేదలు, రోజువారి కూలీలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతాల ఓటు బ్యాంకుపై సహజంగానే అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క బీఆర్ఎస్ వైపే గుడిసెవాసులు మొగ్గుచూపుతారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదిఏమైనా పట్టాలు ఇచ్చిన పార్టీ వైపు కొంత సానుకూలంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు.


కాలనీల్లో కనీస వసతులు


గ్రేటర్ వరంగల్ నగర పరిధిలో మొత్తం 70 వరకు సెంటర్లలో గుడిసెవాసుల ఆవాసాలున్నాయి. కొద్ది సంవత్సరాలుగా గుడిసెవాసులు చేపట్టిన పోరాట ఫలితంగా ఆవాసాల్లో కనీస వసతుల కల్పనకు చర్యలు చేపట్టారు. రహదారులు, మంచినీటి సౌకర్యం, వీధిలైట్లు, డ్రైనేజీ ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. దీంతో ఆయా ఆవాసాల్లోని ప్రజలు ఊపిరి పీల్చుకున్నట్లైంది.


మురుగునీరు సజావుగా డ్రైనేజీ ద్వారా వెళ్లడం, రాత్రి వేళ వీధిదీపాల వెలుతురు తదితర సౌకర్యాలతో చాలా ఇబ్బందుల నుంచి వారు బయటపడినట్లయ్యింది. గుడిసెలకు మున్సిపల్ ఇంటినంబర్లు ఇచ్చే విషయమై జరిపిన కృషి ఫలించింది. అన్ని సెంటర్లలో ఉన్న గుడిసెలకు ఇంటి నంబర్లు రావడంతో తమ గుడిసెలో జీవనం కొనసాగుతుందనే భరోసా పేదల్లో నెలకొంది. తాజాగా పట్టాలిచ్చిన సందర్భంగా గుడిసె వాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది.