ప్రలోభాలకు వేళాయే!.. గ్రామాల్లో మొద‌లైన ఓట్ల జాత‌ర‌

ప్రలోభాలకు వేళాయే!.. గ్రామాల్లో మొద‌లైన ఓట్ల జాత‌ర‌
  • పోటెత్తుతున్న‌ ఖర్చు ప్రవాహం
  • 25 నుంచి 100 కోట్ల మ‌ధ్య ఖ‌ర్చు!
  • కార్య‌క‌ర్త‌ల పోష‌ణ‌కే అధిక‌భాగం
  • ర్యాలీలు, స‌భ‌ల నిర్వ‌హ‌ణ స‌రేస‌రి
  • వేల కోట్లతో ఎన్నికల పందేరం
  • దేశంలోనే ఖ‌రైదైన ఎన్నిక‌లు
  • హుజూరాబాద్‌, మునుగోడు
  • వాటిని త‌ల‌ద‌న్నేలా ఈసారి?


విధాత : తెలంగాణలో ఎన్నికలంటేనే దేశంలోనే అతి ఖరీదైనవన్న ముద్ర పడింది. హుజూరాబాద్‌, మునుగోడు ఉప ఎన్నికలతో తెలంగాణలో ఎన్నికలు ఏ స్థాయిలో ప్రలోభాల పర్వంలో సాగుతాయో దేశమంతా తెలిసిపోయింది. ఈ నేప‌థ్యంలో బీఆరెస్, కాంగ్రెస్ మ‌ధ్య‌ అధికారమే లక్ష్యంగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నిలలో పార్టీల, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, ప్రలోభాలు ఏ రేంజ్‌లో ఉంటాయోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఎన్నికలంటేనే డబ్బులు, మద్యం పంచే జాతరగా, ప్రచార పర్వం పార్టీలకు అభ్యర్థులకు జై కొట్టే ఊరేగింపుల పర్వంగా మారిపోయాయ‌నే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు గెలుపు కోసం కోట్ల‌ రూపాయలను మంచి నీళ్ల‌లా ఖ‌ర్చుపెట్టేస్తున్నారు. గ‌తంలో చేసిన మంచి ప‌నులు చెప్పుకొని ఓట్ల‌డిగేవారు. లేదా చేయ‌బోయేవి చెప్పిన గెలిపించాల‌ని కోరేవారు. ఇప్పుడు మాత్రం డ‌బ్బులు, మ‌ద్యం పంచితే చాలు.. గెలిచేస్తాం అనే ధీమా అభ్య‌ర్థుల్లో వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. ఇది చాలా విచార‌క‌ర‌మ‌ని రాజ‌కీయ పండితులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.


క‌నీసం వంద కోట్లు పెట్టాల్సిందేనా?


తాజా ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో ఎన్నిక‌ల్లో పోటీకి దిగాలంటే అభ్యర్థులు ఒక్కోక్కరు కనీసంగా 25 కోట్ల నుంచి 100 కోట్లకు పైగానే ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని చెబుతున్నారు. జనాలు సైతం తమకు డబ్బులు అందలేదంటూ రోడ్లెక్కి నిరసనలు చేసే స్థాయికి చేరుకోవడం ఉప ఎన్నిక‌ల్లో చూసిందే. ఎన్నికల ప్రలోభాలు జ‌నాన్ని సైతం ఎంతగా దిగ‌జార్చుతున్నాయో అర్థం చేసుకునేందుకు ఇవే నిద‌ర్శ‌నాలు. ఇందుకు త‌గిన‌ట్టే.. పార్టీలు కూడా.. త‌యార‌య్యాయి.


ప్ర‌జాద‌ర‌ణ కంటే.. డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌గ‌ల‌వారినే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు లేక‌పోలేదు. కనీసం 10 కోట్ల నుంచి 50 కోట్లు పెట్టగలవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నాయ‌ని అంటున్నారు. గ‌తంలో స‌మాజ సేవ ల‌క్ష్యంగా ఉన్న‌వాళ్లు రాజ‌కీయాల్లో ఉండేవారు. కానీ.. ఎప్పుడైతే గెలుపును డ‌బ్బు శాసించ‌డం మొద‌లైందో.. అప్ప‌టి నుంచి సీన్ మారిపోయింది. వ్య‌క్తులూ మారిపోయారు. కొత్త‌గా రాజకీయాల్లోకి బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రియల్ట‌ర్లు ప్రవేశిస్తున్నారు. వారు ధ‌నం, మ‌ద్యం పంచ‌డం ద్వారా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను మ‌రింత ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా మార్చేశార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.


అంద‌రికీ “అందాల్సిందే” !


పార్టీ జెండా మోసే కార్యకర్త నుంచి ఊరేగింపులు, సభలకు వచ్చే కూలీ జనం వ‌ర‌కూ! ప్రచార వాహనాల ఖర్చు మొద‌లు.. ఓటర్లకు డబ్బు, మద్యం, బిర్యానీల‌ స‌ర‌ఫ‌రా..! పండుగలో ప‌బ్బాలో అయితే.. మాంసం వంటివి ఎక్స్‌ట్రాలే!! ఇక పార్టీ ప్రచార సామాగ్రికి, బహిరంగ సభలకు, నామినేషన్ల ర్యాలీలకు అవ‌స‌ర‌మ‌య్యే జన సమీకరణ ఖర్చు అదనం. పోలింగ్ సందర్భంగా ఇంటింటికీ నగదు, మద్యం పంపిణీ తప్పనిసరి చర్యగా తయారైంది. లేదంటే బహిరంగంగానే జనం తమకు డబ్బులందలేదని గొడవ చేస్తున్నారు.


ఇటువంటి ప‌రిస్థితుల్లో నిస్వార్థంగా ప్ర‌జాసేవ చేయాల‌న్న ఆకాంక్ష ఉన్న‌వారు, స‌మాజ మార్పు కోరుకునే పార్టీలు ఎన్నిక‌ల బ‌రిలో నిలువ‌డ‌మే గ‌గ‌న‌మైంది. ఒక వేళ నిలిచినా.. గెలిచే అవ‌కాశాలు మాత్రం నూటికి నూరు శాతం సున్నాయే! మ‌ణిపూర్‌లో సాయుధ ద‌ళాల ప్ర‌త్యేకాధికారాల చ‌ట్టానికి వ్య‌తిరేకంగా సాగిన పోరాటంలో ప్ర‌ముఖ పాత్ర పోషించి, ఉక్కు మ‌హిళ‌గా పేర్గాంచిన ఇరోం ష‌ర్మిల చాను.. ఎన్నిక‌ల్లో నిల‌బ‌డితే ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు.


తన మాట విని మద్దతునిచ్చే పార్టీలకు దేశమంతా ఎన్నికల ఖర్చు తానే పెడుతానంటూ తెలంగాణ సీఎం చెప్పిన‌ట్టుగా ప్ర‌చారం జ‌రిగిన వార్త‌లు.. ఒక్క‌సారిగా తెలంగాణ‌పై దృష్టి కేంద్రీక‌రించేలా చేశాయి. దీనికి తోడు పక్క రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ర‌వాణా అవుతున్న కోట్ల‌కొద్దీ నోట్ల క‌ట్ట‌లు.. రాబోయే తెలంగాణ ఎన్నిక‌లు ఎంత ఖ‌రీదైన‌విగా మారుతాయోన‌న్న చ‌ర్చ‌కు తెర లేపాయి.



భారీగా పెరిగిన ఎన్నికల వ్యయం


వాస్తవానికి రాష్ట్రాల పరిస్థితుల మేరకు ఎంపీ అభ్యర్థులకు 77లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు 30.80లక్షల మేరకు ఎన్నికల వ్యయంగా నిర్ణయించారు. అయితే.. ఈ వ్యయ పరిమితులు ఏనాడో అపహాస్యమైపోయాయి. దేశంలోనే సంచలం రేపిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏకంగా వేయికోట్ల ఖర్చు చేశార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఒక పార్టీ 800 కోట్లు, మరో పార్టీ 200 కోట్లు ఖర్చు చేసిందని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. రెండు లక్షల మందికి ఓటుకు 6000 చొప్పున పంచేశార‌ని వార్త‌లు వ‌చ్చాయి. పోలింగ్ రోజునే రెండు ప్ర‌ధాన‌ పార్టీలు 200 కోట్లకుపైగా ఖర్చు చేశాయ‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక‌ మునుగోడు ఉప ఎన్నికలోనూ అదే తీరు. 2020లో అమెరికా ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డు సృష్టించాయి. ఆ ఎన్నికల్లో లక్ష 3 వేల కోట్లు ఖర్చు తేలింది. 2012- 16 ఎన్నికల ఖర్చుతో పోలిస్తే రెండింతలుగా ఎన్నికల వ్యయం పెరిగిందని అమెరికా సంస్థలు తెలిపాయి.


భారత్‌లో 2019 లోక్ సభ ఎన్నికల్లో, వాటితో పాటు జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కలిపి 55వేల‌ కోట్ల నుంచి నుంచి 60 వేల కోట్లు ఖర్చు జరిగింది. అంటే.. 2014 ఎన్నికల ఖర్చు కంటే 40% ఎక్కువ. ఆ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లకు మించిన ఖర్చు జరిగింద‌ని అంచ‌నా. 2018 ఎన్నికల్లో తెలంగాణలో ఒక్కో సీటుకు సగటున 25 కోట్లు ఖర్చు చేశారని ఫోరమ్ ఫర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పేర్కొన్న‌ది. ప్రస్తుతం జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కనీసంగా 10వేల కోట్లకు పైబడినే ఖర్చు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పోటీలో ఉన్న పార్టీలు, అభ్యర్థుల సంఖ్య మేరకు ఖర్చు కూడా పెరిగే పరిస్థితి నెలకొంది. త్రిముఖ, చతుర్మఖ పోటీలున్న చోట అధికంగా ఖర్చు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అంటున్నారు. ఎన్నికల్లో డబ్బు.. విజ‌యానికి కొలబద్దగా మారిపోయింది. ఎన్నికల వ్యయం ప్రతి ఎన్నికలో పెరుగుతూ పోతున్నది.


పెరుగుతున్న ధ‌నిక ప్ర‌జాప్ర‌తినిధులు


1990-91లో ధనిక ఎంపీలు 7.24 శాతం ఉంటే.. 14వ లోక్ సభలో నాటికి అది 22.33 శాతానికి పెరిగింద‌ని అంచ‌నా. ఇప్పుడు అది మ‌రింత పెరిగింది. సంపన్న వర్గాలు రాజకీయాల్లో ఆధిప‌త్యం చెలాయించ‌డం ద్వారా.. ఎన్నిక‌ల్లో గెలిచి, మ‌రింత సంపాదించుకునేందుకు మార్గం ఏర్ప‌ర్చుకుంటున్న‌ర‌న్న చ‌ర్చ స‌ర్వ‌త్రా ఉన్న‌దే. ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌తోపాటు.. అస‌మ్మ‌తి స్వ‌రాల‌ను శాంత‌ప‌ర్చేందుకు కూడా నోట్లే ఆయుధాలు అవుతున్నాయి. వెర‌సి.. డ‌బ్బుంటే రాజ‌కీయాల్లో ఉండొచ్చ‌ని, అదే రాజ‌కీయాల్లో ఉండి.. ఆ డ‌బ్బును తిరిగి సంపాదించుకోవ‌చ్చ‌నేది ఒక సిద్ధాంతంగా బ‌ల‌ప‌డిపోయింది.


దీంతో ఎన్నికల ప్రక్రియలో విజేతగా ధనం నిలుస్తుండగా, ప్రజాస్వామ్యం పరాజితగా మిగిలిపోతున్నది. ఈ తీరు మారనంత వరకు ఎన్నికల ప్రక్రియ అభ్యుదయ వాదులను కలచివేస్తునే ఉంటుంది. అయితే ఈ ప‌రిస్థితి మార‌దా?? మారుతుంది! త‌ప్ప‌నిస‌రిగా మారితీరుతుంది. కాక‌పోతే.. ప్ర‌జ‌లు చైత‌న్య‌వంతులు కావాలి. మ‌న ఓట్ల‌ను డ‌బ్బుకు అమ్మేసుకున్నాక దానితో గెలిచిన ప్ర‌జాప్ర‌తినిధిని ఏమ‌ని ప్ర‌శ్నిస్తాం? అనే సృహ వారిలో క‌ల‌గాలి. డ‌బ్బుల ఖ‌ర్చు చేస్తున్న అభ్య‌ర్థి ప్ర‌జా సేవ‌లో త‌రించేందుకే డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నాన‌ని చెప్పే మాట‌ల‌ను తిప్పికొట్టాలి. ప్ర‌త్యేకించి స‌మాజాన్ని అవ‌గాహ‌న చేసుకునే శ‌క్తి క‌లిగి ఉన్న యువ‌త‌లో ఈ మార్పు మొద‌ల‌వ్వాలి. ఎందుకంటే.. దేశ భ‌విష్య‌త్తు వారి చేతుల్లోనే ఉన్న‌ది! ఈ దేశాన్ని మార్చే శ‌క్తి వారికే ఉన్న‌ది.