బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్: మనీశ్ తివారీ

బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ గా ఉంద‌ని కంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ, మాజీ కేంద్ర‌మంత్రి మ‌నీశ్ తివారీ ఆరోపించారు. పార్లమెంట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తూ వచ్చిందన్నారు.

బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్: మనీశ్ తివారీ
  • అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బీజేపీకి మ‌ద్ద‌తుగా బీఆరెస్‌
  • జ‌మ్మూకాశ్మీర్ స్వ‌యం ప్ర‌తిప‌త్తి ర‌ద్ద‌కు అనుకూలంగా ఓటేసిన బీఆరెస్‌
  • కేంద్రం తెచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు మ‌ద్ద‌తు ప‌లికిన బీఆరెస్‌
  • ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి మనీశ్ తివారీ


విధాత‌, హైద‌రాబాద్‌: బీజేపీకి బీఆర్‌ఎస్ బీ టీమ్ గా ఉంద‌ని కంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ, మాజీ కేంద్ర‌మంత్రి మ‌నీశ్ తివారీ ఆరోపించారు. పార్లమెంట్‌లో అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీకి బీఆర్‌ఎస్ మద్దతిస్తూ వచ్చిందన్నారు. ముఖ్యంగా నోట్ల రద్దును అన్ని పార్టీలూ వ్యతురేకించినా బీఆర్‌ఎస్ మాత్రం సమర్థించిందని తెలిపారు.అలాగే వ్యవసాయ చట్టాలను పార్టీలు వ్యతిరేకించినా బీఆర్‌ఎస్ మద్దతు తెలిపింద‌న్నారు. రాష్ట్రాల సమాఖ్యవాదాన్ని కేంద్రం దెబ్బతీస్తున్నా బీఆర్‌ఎస్ అండగా నిలిచిందనిచెప్పారు. జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేస్తే అనుకూలంగా ఓటేసిందని వివ‌రించారు.


తెలంగాణ‌లో కుటుంబ పాలన నడుస్తున్నదని తివారీ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరిపైనా రూ.1.60 ల‌క్ష‌ల‌ అప్పు ఉందన్నారు. నాడు మిగులు బ‌డ్జెట్‌తో ఏర్ప‌డిన రాష్ట్రం నేడు అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, అన్ని స్కీముల్లో అవినీతికి పాల్పడుతున్నారన్నారు. దళితబంధు, డబుల్ బెడ్రూం ఇండ్ల స్కీమ్‌లలో కమీషన్లు తింటున్నార‌ని చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సెక్రటేరియెట్, మిషన్ భగీరథ వంటి వాటిలో కేసీఆర్ దోచుకున్నారని తెలిపారు. అందుకే ఈ ప్రభుత్వాన్ని పారదోలాల్సిన అవసరం ఉందన్నారు.


యువత బలిదానాలు, పోరాటం చూసి సోనియా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని తివారీ తెలిపారు. తెలంగాణ వచ్చి తొమ్మిదేళ్లవుతున్నా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చ‌లేద‌న్నారు. వచ్చే ఎన్నికల్లో కొత్త‌ప్రభుత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్న ఆయ‌న‌ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపు ఇచ్చారు.