ఆసక్తిగా సిర్పూర్ పోరు.. రెండు పార్టీల అభ్యర్థుల ఖరారు

ఆసక్తిగా సిర్పూర్ పోరు.. రెండు పార్టీల అభ్యర్థుల ఖరారు
  • కారు పార్టీ కొనప్ప.. ఏనుగు పార్టీ ప్రవీణ్
  • బీజేపీ రేసులో పాల్వాయి?
  • కాంగ్రెస్ లో కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్ పోటాపోటీ?


విధాత ప్రతినిధి, ఉమ్మడి అదిలాబాద్: సిర్పూర్ లో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు కోసం గురి పెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిగా కోనేరు కోనప్పను ప్రకటించింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోనప్ప, సమీప కాంగ్రెస్ అభ్యర్థి పాల్వయి హరీష్ బాబుపై 24,038 ఓట్ల మెజార్టీతో భారీ విజయం సాధించారు.


కాగా.. ఆయన ఇప్పటికే ఒకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలవగా, రెండుసార్లు బీఆర్ఎస్ తరఫున విజయాన్ని అందుకున్నారు. తాజాగా నాలుగోసారి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ఆపార్టీలో వరుసగా రెండుసార్లు గెలిచిన కోనప్పకు ఈసారి బీజేపీ, బీఎస్పీ, కాంగ్రెస్ రూపంలో గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల్లో మూడు పార్టీలు ఓట్లు పంచుకుంటే, అధికార పార్టీ సంక్షేమ పథకాలు పొందినవారు ఓటు వేసినా సునయాసంగా గెలిచే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి.


పటిష్టంగా బీఎస్పీ క్యాడర్?


ప్రస్తుత సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 2014లో బీఎస్పీ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత వీరిద్దరూ పార్టీ మారారు. అధికార టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. అయినప్పటికీ సిర్పూర్ నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ క్యాడర్ పటిష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇప్పటికే ప్రకటించారు. ఆయన మొదటి నుంచి సిర్పూర్ నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు.


బీఎస్పీ అధ్యక్షుడిగా పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ, సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నారు. ఈ నేపథ్యంలో సిర్పూర్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామం ఎస్టీ వర్గానికి చెందిన సిడాం గణపతి సైతం ఈ ఎన్నికల్లో బీఎస్సీకి మద్దతు ఇస్తున్నారు.


బెజ్జూర్ కి చెందిన మాజీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ హర్షద్ ఉస్సేన్ బీఎస్పీలో కీలకంగా మారడంతో సిర్పూర్(టీ), బెజ్జార్, కాగజ్ నగర్లో ఉన్న ముస్లిం ఓట్లు కొంత బీఎస్పీకి పడే అవకాశాన్ని కొట్టిపారేయలేమని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ హామీలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి, 2018 నుంచి ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తారనే పేరు ఉంది.


అధికార బీఆర్ఎస్ పార్టీకి, బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్. ఐపీఎస్ అధికారిగా పలు సేవలందించారు. గతంలో ఐపీఎస్ అధికారిగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి, విద్యార్థుల తల్లిదండ్రుల మన్ననలు పొందారు. ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేశారనే మంచి పేరుంది.


రాజకీయ కుటుంబం నుంచి పాల్వాయి


2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి రెండో స్థానాన్ని సాధించిన పాల్వాయి హరీష్ బాబు ఆపార్టీని వీడి, బీజేపీలో చేరారు. కాంగ్రెస్ శ్రేణులు కొంతమంది ఆయన వెంటే నడిచారు. బీజేపీ టికెట్ కోసం పాల్వాయి దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ టికెట్ హరీష్ బాబుకి ఇస్తారనే ప్రచారం ఆపార్టీలో కొనసాగుతుంది. పాల్వాయి హరీష్ బాబు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజల్లో ఉంటూనే ప్రజాభిమానం చురగొన్నారు.


రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబ సభ్యుడు. గతంలో స్వతంత్ర అభ్యర్థిగా తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా అమ్మ ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొదటి నుంచి రాజకీయ కుటుంబంగా పేరుంది. 2018 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థి కోనేరు కోనప్పకు 50.57 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 35.94% ఓట్లు సంపాదించుకున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రావి శ్రీనివాస్ కు 4 వ స్థానంలో 3.27 ఓట్లు వచ్చాయి.


అప్పటివరకు కాంగ్రెస్ లో ఉన్న పాల్వాయి హరీష్ బీజేపీలోకి వెళ్లడంతో, బీఎస్పీ అభ్యర్థిగా ఉన్న రావి శ్రీనివాస్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ తరఫున సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి రావి శ్రీనివాస్ దరఖాస్తు చేసుకున్నారు. ఈయనతో పాటు కోరాండ్ల కృష్ణారెడ్డి కూడా పోటీ పడుతున్నారు. ఇద్దరిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరివైపే మొగ్గు చూపుతుందో వేచి చూడాలి. గత ఎన్నికల్లో ఎక్కువ సార్లు సిర్పూర్ ఎమ్మెల్యే గా పోటీ చేసి గెలిచిన అనుభవం బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు ఉంది.


సిర్పూర్ నియోజకవర్గ చరిత్ర


సిర్పూర్ నియోజకవర్గం 1962లో ప్రారంభమైంది. రాష్ట్రంలోనే మొదటి నియోజకవర్గమైన సిర్పూర్ లో 1962, 67లో కాంగ్రెస్ పార్టీ చెందిన బీ సంజీవరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అదే పార్టీకి చెందిన కేవీ కేశవులు 1972, 1978లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కేవీ నారాయణరావు 1983, 1985లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పాల్వాయి పురుషోత్తం రావు 1989, 1994లో రెండుసార్లు గెలిచారు.


అనంతరం తెలుగుదేశం పార్టీ తరఫున పాల్వాయి రాజ్యలక్ష్మి 1999లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో కాంగ్రెస్ తరఫున కోనేరు కోనప్ప ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో, 2010 ఉప ఎన్నికల్లో రెండు సార్లు కావేటి సమ్మయ్య ఎమ్మెల్యే గా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014లో బీఎస్పీ తరుపున కోనేరు కోనప్ప గెలిచారు. గెలువగానే ఏనుగు దిగి కారు ఎక్కారు. 2018లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.


సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు 1962 నుంచి 1999 వరకు ఒక్కో అభ్యర్థిని రెండుసార్లు గెలిపించారు. ఇప్పటికీ 1962 నుంచి ఆ నియోజకవర్గంలో వరుసగా మూడుసార్లు ఒకే పార్టీ తరపున గాని, ఇండిపెండెంట్ గాని గెలిచిన దాఖలు మాత్రం లేవు. సిర్పూర్ నియోజక వర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాలి కులస్తులు 38 వేల ఓటర్లు ఉన్నారు. ఎస్సీలు 53 వేలు, ఎస్టీలు 27 వేల వరకు ఉన్నట్లు సమాచారం. ఇక ముస్లిం ఓటర్లు సైతం 35 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా రాష్ట్రంలో మొదటి నియోజకవర్గమైన సిర్పూర్ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో వేచి చూడాల్సిందే?