రాష్ట్ర ఆర్థిక బండి కదలాలంటే.. మోదీ కనికరించాల్సిందేనా!
మోదీ కనికరిస్తేనే బండి కదిలే దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత ప్రభుత్వం అందిన కాడికి అప్పులు గుంజుకొచ్చి ఖర్చు

- మూడు క్వార్టర్లు పూర్తి కాకముందే
- ఏడాది కాలం అప్పు చేసిన గత సర్కారు
- కొత్త అప్పులకోసం దిక్కులు చూస్తున్న రాష్ట్రం
- 13 వేల కోట్ల రుణానికి అనుమతి ఇవ్వండి
- ప్రధానికి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
- డిసెంబర్లో బాండ్లపై 1400 కోట్లు రుణాలు
- ఎన్నికలప్పుడు రైతుబంధు జమకు సిద్ధమైన నాటి బీఆరెస్ ప్రభుత్వం
- ఫలితాలు వచ్చేనాటికి ఖజానా ఖాళీ
- రైతుబంధు నిధులు ఎవరు? ఎవరికి సర్దారు?
విధాత, హైదరాబాద్: మోదీ కనికరిస్తేనే బండి కదిలే దారుణమైన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. గత ప్రభుత్వం అందిన కాడికి అప్పులు గుంజుకొచ్చి ఖర్చు చేసి, ఖాజానా అంతా ఊడ్చేసింది. ఏ రోజుకారోజు చిల్లర ఖర్చుకు కూడా వెంపర్లాడాల్సిన దుస్థితి కలిగింది. కాగ్ విడుదల చేసిన నవంబర్ 30 నాటికి జమా ఖర్చుల వివరాలు రాష్ట్ర ఆర్థిక దుస్థితికి అద్దం పడుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బారోయింగ్ ద్వారా కానీ, కేంద్రం వద్ద నేరుగా కానీ కలిపి రూ.42,254 కోట్లు రుణం తీసుకోవడానికి గత ప్రభుత్వం అసెంబ్లీ అనుమతి తీసుకున్నది. వాస్తవంగా రిజర్వ్ బ్యాంకు వద్ద ఏడాది పొడవునా మార్చి 2024 వరకు మార్కెట్ బారోయింగ్ అప్పులు రూ.38,234.94 కోట్లు తెచ్చుకోవడానికి అనుమతి ఉండగా నవంబర్ 30 నాటికే రూ.38,151.01 కోట్ల అప్పులు తీసుకున్నది. ఇవి కాకుండా కొద్ది మొత్తంలో కేంద్రం నుంచి రుణం తీసుకోవడానికి అనుమతి ఉంది. కాగా ఈ రుణాలు కూడా తీసుకున్నట్లు కనిపించడం లేదు.
ఫలితాల వెల్లడినాటికే ఖజానా ఖాళీ
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే గత ప్రభుత్వం రూ.4872.67 కోట్లు రిజర్వ్ బ్యాంకు వద్ద మార్కెట్ బారోయింగ్ రుణం తీసుకున్నది. నవంబర్ 30న పోలింగ్ ముగిసింది. డిసెంబర్ 3వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో బీఆరెస్ ఓడి కాంగ్రెస్ గెలిచింది. డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది. తీరాచూస్తే అప్పటికే ఖజానా ఖాళీగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపై మొదటి క్యాబినెట్లో తీర్మానం చేసినప్పటికీ నిధులు వచ్చే మార్గం లేక, అప్పులు తెచ్చుకోవడానికి ఉన్న అవకాశాలపై కూడా అధికారులు సమాధానం చెప్పలేక పోవడంతో వెంటనే అమలు చేయలేక పోయారు. నగదును వెంటనే చెల్లించాల్సిన అవసరం లేని రెండు గ్యారెంటీలు మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, రూ.10 లక్షల ఆరోగ్య బీమా పథకాలను ప్రకటించి అమలు చేసింది. మిగతా గ్యారెంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని ప్రకటించింది.
పథకాలకు నిధులెలా?
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ పథకాల అమలుకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరిస్తోంది. కానీ వీటికి ఏవిధంగా నిధులు సమకూర్చాలా? అన్నది సీఎం రేవంత్‌రెడ్డికి, ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు సవాల్‌గా మారింది. వాస్తవంగా డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు సొమ్ము అంతా రైతుల ఖాతాల్లో పడుతుందని ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి వాగ్దానం చేశారు. దీనికి ముందు మాజీ అర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు రైతు బంధు డబ్బులన్నీ జమచేసి ఉంచామని, బ్యాంకు ఖాతాలో వేస్తామని ప్రకటించారు. కానీ ఎన్నికల తరువాత చూస్తే ఆ డబ్బులన్నీ ఎటు పోయాయో కానీ కొత్త ప్రభుత్వానికి ఖజానా ఖాళీగా దర్శనమిచ్చింది. ముందుగానే ఫలితాలపై అంచనాకు వచ్చిన నాటి ప్రభుత్వ పెద్దలు రైతు బంధు కోసం ఉంచిన సొమ్మును తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి.
రైతు బంధు కోసం నిల్వ చేసిన డబ్బు ఏమైందో కానీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డికి ఖజానా మాత్రం ఖాళీ కుండలా దర్శనం ఇచ్చింది. దీంతో రిజర్వ్ బ్యాంకు వద్ద ఏదో చేసి డిసెంబర్ నెలలో రూ.1400 కోట్లు తీసుకు వచ్చి బండి నడిపించారు. బీఆరెస్ సర్కారుకు భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం నెల మొదట్లోనే ఉద్యోగులకు జీతాలిచ్చింది. కానీ జనవరి నుంచి మార్చి వరకు బండి నడపడమే కాదు.. హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అసలే పార్లమెంటు ఎన్నికలు ముంచుకు వస్తున్నాయి. ఎన్నికల ముంగిట హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మని పరిస్థితి ఏర్పడింది. ఇది పార్లమెంటు ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్నిచూపే ప్రమాదం ఉంది. దీంతో ఎలాగైనా ఈ హామీలను అమలు చేయాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక అనుమతుల కోసం వినతి
హామీల అమలు తొలి ప్రాధాన్యంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రుణాల కోసం ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. సిద్ధాంతపరంగా వేర్వేరు రాజకీయ పార్టీలైనప్పటికీ తెలంగాణ ప్రజల కోసం తమకు అనుమతివ్వాలని అడిగారు. ఈ మేరకు జనవరి 9వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఏ తేదీన ఎంత మేరకు రుణం అవసరం ఉంటుందో తెలియజేస్తూ మొత్తం రూ.13 వేల కోట్లు అవసరం అవుతుందని కేంద్రానికి ఇండెంట్ పెట్టారు. ఈ ఇండెంట్ రిజర్వ్ బ్యాంకు వద్ద ఉన్నది. దీనికి కేంద్రం అనుమతిస్తే రేవంత్ రెడ్డి సర్కారుకు నిధుల కొరత కొంతమేర తీరుతుంది. ఇవికాకుండా మరో రూ. 5 వేల కోట్లు పబ్లిక్ అకౌంట్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రెండు రకాల అప్పులు కలిసి రూ.18 వేల కోట్ల వరకు నిధులు అందుబాటులోకి వస్తే పథకాల అమలు సులువు అవుతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయ వైరుధ్యాలు పక్కకుపెట్టి ప్రధాని నరేంద్ర మోదీ అప్పులకు అనుమతి ఇస్తారా? లేదా? అన్నది వేచి చూడాలి.
కేంద్రం వద్ద రాష్ట్రం పెట్టిన అదనపు అప్పుల ఇండెంట్ ఇదే..
తేదీ డబ్బులు (రూ. కోట్లలో)
9 జనవరి రూ.1000
16 జనవరి రూ.2000
30 జనవరి రూ.1000
13 ఫిబ్రవరి రూ 1000
20 ఫిబ్రవరి రూ. 1000
27 ఫిబ్రవరి రూ.1000
5 మార్చి రూ.2000
12 మార్చి రూ.1000
19 మార్చి రూ. 2000
26 మార్చి రూ.1000
మొత్తం రూ.13000