ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారులు. ఇప్పుడు!

బీఆ­రెస్ స‌ర్కారు హయాంలో కీల‌క స్థానాల్లో ఉండి హ‌వా న‌డి­పిం­చిన పలు­వురు అధి­కా­రులు కాంగ్రెస్ ప్ర‌భు­త్వంలో లూప్‌­లై­న్‌­లోకి వెళ్లారు

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారులు.  ఇప్పుడు!
  • బీఆ­రెస్‌ ప్రభు­త్వంలో కీలక విభా­గాల్లో
  • కొత్త ప్రభు­త్వంలో ప్రాధా­న్యం­లేని శాఖ­లకు
  • మరో విడత ఐఏ­ఎస్‌, ఐపీ­ఎ­స్‌ల బదిలీ
  • ఇన్నాళ్లూ ఎదురు చూపుల్లో ఉన్న­వా­రికి కీల­క­మైన శాఖ­లలో పోస్టిం­గులు
  • ముఖ్య­మంత్రి రేవం­త్‌­రెడ్డి మార్క్ బ‌ది­లీలు
  • మ‌రి­కొంత మందికి త్వ‌ర‌­లోనే స్థాన‌­చ‌­ల‌నం!

విధాత‌, హైద‌­రా­బాద్‌: బీఆ­రెస్ స‌ర్కారు హయాంలో కీల‌క స్థానాల్లో ఉండి హ‌వా న‌డి­పిం­చిన పలు­వురు అధి­కా­రులు కాంగ్రెస్ ప్ర‌భు­త్వంలో లూప్‌­లై­న్‌­లోకి వెళ్లారు. ఉన్న‌­త­స్థా­యికి చెందిన ఐఏ­ఎస్‌, ఏపీ­ఎస్ అధి­కా­రుల బ‌ది­లీలు, పోస్టిం­గ్‌­ల‌లో సీఎం రేవంత్ రెడ్డి త‌న మార్క్ చూపిం­చారు. ఆర్టీఐ కింద ద‌ర‌­ఖాస్తు చేయ‌­డా­నికి పీసీసీ అధ్య‌­క్షుడి హోదాలో నాడు స‌చి­వా­ల‌­యా­నికి వెళ్ల‌­డా­నికి ప్ర‌య‌­త్నిం­చిన రేవం­త్‌­రె­డ్డిని క‌లు­వ‌­డా­నికి నిరా­క‌­రించి, స‌చి­వా­ల‌యం బ‌య‌­ట‌నే పోలీ­సు­ల‌తో నిలి­పి­వే­యిం­చిన అధి­కా­రులు.. ప్రస్తుత బది­లీల్లో అప్రా­ధాన్య శాఖ­లకు వెళ్లటం గమ­నార్హం. బీఆ­రెస్ హార్డ్‌­కోర్‌ కార్య‌­క‌­ర్త‌­లుగా, నాయ‌­కు­లుగా ప‌ని చేశా­ర‌న్న ఆరో­ప‌­ణ‌లు ఎదు­ర్కొం­టున్న కొందరు అధి­కా­రు­ల‌­పైనా వేటు వేసి­న‌ట్లు క‌ని­పి­స్తోంది.

కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వ ప‌గ్గాలు చేప‌­ట్టిన వెంట‌నే మొద‌ట కీల‌­క‌­మైన పోలీస్ అధి­కా­రు­ల‌పై వేటు వేశారు. క్లీన్ ఇమే­జ్‌­తో­పాటు ముక్కు­సూ­టిగా వెళ‌­తా­ర‌నే పేరున్న సీని­య‌ర్‌ ఐపీ­ఎస్ అధి­కా­రు­ల‌కు హైద‌­రా­బాద్‌, సైబ‌­రా­బాద్‌, రాచ‌­కొండ సీపీ­లుగా పోస్టిం­గ్‌లు ఇచ్చారు. ఇదే తీరుగా పలు­వురు ఐఏ­ఎస్ అధి­కా­రు­ల‌ను కీలక విభా­గాల్లో నియ­మిం­చారు. ముఖ్యంగా మృదు స్వ‌భావి, సౌమ్యుడు, ప్ర‌ధాని కార్యా­ల‌­యంలో ప‌ని చేసిన అను­భ‌­వంతో పాటు రెవెన్యూ అంశా­ల‌పై ప‌ట్టున్న సీని­య‌ర్ ఐఏ­ఎస్ అధి­కా­రిగా పేరు­ప­డిన శేషా­ద్రిని సీఎం కార్య‌­ద‌­ర్శిగా నియ‌­మిం­చు­కు­న్నారు. ఆ త‌రు­వాత కేంద్ర స‌ర్వీ­సులో ఉన్న ఆమ్ర‌­పా­లిని తెలం­గా­ణ‌కు తీసుకు వ‌చ్చి, హుడాలో పోస్టింగ్ ఇచ్చారు. దీంతో పాటు కీల‌­క‌­మైన విద్యా­శా­ఖ‌ను వ‌రం­గ‌ల్ జిల్లాకు చెందిన బీసీ అధి­కారి బీ వెంక‌­టే­శంకు అప్ప‌­గిం­చారు.

అయితే బీఆ­రెస్ పాల‌­న‌లో పుర‌­పా­ల‌­క‌­శాఖ బాధ్య‌­త‌లు నిర్వ‌­హించి, ఆనాటి పెద్ద‌­ల‌కు త‌ల‌­లో­నా­లు­క‌లా వ్యవ­హ­రిం­చా­రన్న ఆరో­ప­ణలు ఎదు­ర్కొన్న అర‌­విం­ద్‌­కు­మా­ర్‌ను డిజి­స్ట‌­ర్‌కు బ‌దిలీ చేశారు. తాజాగా నాడు సీఎం కార్య‌­ద‌­ర్శిగా ఒక వెలుగు వెలి­గిన స్మితా స‌బ­ర్వా­ల్‌ను పెద్దగా ప్రాధాన్యం లేని ఫైనాన్స్ క‌మి­ష‌న్ మెంబ‌ర్ సెక్ర‌­ట‌­రీగా బ‌దిలీ చేశారు. మెద‌క్ జిల్లా క‌లె­క్ట‌ర్ నుంచి నేరుగా సీఎం కార్య‌­ద‌­ర్శిగా వెళ్లిన స్మితా స‌బ­ర్వాల్ బీఆ­రెస్ నాయ‌­కు­రా­లిగా వ్య‌వ‌­హ‌­రిం­చా­రన్న ఆరో­ప‌­ణ‌లు ఎదు­ర్కొ­న్నారు. ఆమె వ్య‌వ‌­హార శైలిపై అనే­క­సార్లు కాంగ్రెస్ పెద్ద‌లు విమ‌­ర్శిం­చారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్య‌­త‌లు చేప‌­ట్టిన త‌రు­వాత ఆమె మర్యా­పూ­ర్వ­కంగా కూడా కలు­వ­లేదు.

సాగు­నీ­టి­శాఖ సెక్ర­ట­రీగా ఉండి కూడా.. ఆ శాఖపై నిర్వ‌­హిం­చిన స‌మీ­క్ష‌కు హాజ‌రు కాలేదు. అలాగే రాష్ట్రం­లోనే రెవె­న్యూ­ప­రంగా అత్యంత కీల­క­మైన జిల్లా అయిన రంగా­రె­డ్డికి క‌లె­క్ట‌­ర్‌గా పని­చే­సిన భార‌తి హోళి­కే­రిని కూడా ప్రాధాన్యం లేని పురా­వ‌స్తు శాఖ డైరె­క్ట‌­ర్‌గా బ‌దిలీ చేశారు. భార‌తి హోళి­కేరి ఎన్ని­క‌ల్లో బీఆ­రె­స్‌కు అను­కూ­లంగా వ్య‌వ‌­హ‌­రిం­చా­ర‌న్న సందే­హాల్లో కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్టు తెలు­స్తు­న్నది. అందుకే ఆమెను వెంటనే బ‌దిలీ చేసి, జీఏ­డీకి అటాచ్ చేశా­ర‌ని, ఆ త‌రు­వాత‌ ఏమాత్రం ప్రాధాన్య‌ం లేని విభా­గా­నికి పంపా­రన్న చ‌ర్చ జ‌రు­గు­తోంది. 

త్వరలో మరి­కొం­ద­రికి స్థాన చలనం?

తాజాగా 26 మంది ఐఏ­ఎస్‌, 23 మంది ఐపీ­ఎ­స్‌­ల‌ను బ‌దిలీ చేసి పోస్టిం­గ్‌లు ఇచ్చిన స‌ర్కారు.. త్వ‌రలో మ‌రి­కొంత మందికి స్థాన­చ‌­ల‌నం క‌లి­గించే అవ‌­కాశం ఉన్న‌ట్లు అధి­కార వర్గాలు పేర్కొం­టు­న్నాయి.

ముఖ్యంగా బీఆ­రెస్ పాల‌­న‌లో సుదీ­ర్ఘ‌­కా­లంగా ప‌రి­శ్ర‌­మలు, ఐటీ శాఖ‌ల ముఖ్య కార్య‌­ద‌­ర్శిగా ప‌ని­చే­సిన జ‌యేశ్ రంజ‌న్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్య­ద­ర్శిగా, ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌­ద‌­ర్శిగా ప‌ని చేసిన కే రామ­కృ­ష్ణా­రావు, ప్ర‌స్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్య‌­ద‌­ర్శిగా, సీసీ­ఎ­ల్ఏగా ప‌ని­చే­స్తున్న న‌వీన్ మిట్ట‌­ల్‌­తో­పాటు మ‌రి­కొంత మంది అధి­కా­రునూ కూడా బ‌దిలీ చేస్తా­ర‌న్న చ‌ర్చ జ‌రు­గు­తోంది. ఈ మేర‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నాయ‌­కులు కూడా వీరిని బ‌దిలీ చేయా­ల‌ని సీఎం రేవం­త్‌­రె­డ్డిని కోరి­నట్టు సమా­చారం. ఈ అధి­కా­రులు ఆ నాటి ప్ర‌భు­త్వంలో కీల‌­కంగా ఉండి, బీఆ­రె­స్‌కు అను­కూ­లంగా వ్య‌వ‌­హ‌­రిం­చా­ర‌ని సీఎంకు ఫిర్యాదు చేశా­రని తెలి­సింది. 

ఉన్న­త­స్థాయి అధి­కా­రుల విష­యంలో ఆచి­తూచి నిర్ణయం!

ఉన్న‌­త­స్థాయి అధి­కా­రుల బ‌ది­లీలు, పోస్టిం­గ్‌­ల‌పై సీఎం రేవంత్ రెడ్డి ఆచి­తూచి వ్య‌వ‌­హ‌­రి­స్తు­న్న‌ట్లు తెలు­స్తోంది. ఆరో­ప‌­ణ‌లు లేకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న అధి­కా­రు­ల‌ను నియ‌­మిం­చు­కునే ప‌నిలో సీఎం ఉన్నా­ర‌ని సచి­వా­లయ వర్గాలు చెబు­తు­న్నాయి.

అదే విధంగా సమ­ర్థు­లని తాను భావిం­చిన అధి­కా­రు­లను సీఎం ఏరి­కోరి త‌న పేషీలో నియ­మిం­చు­కుం­టు­న్నా­రని రాజ‌­కీయ పరి­శీ­ల‌­కులు అంటు­న్నారు. ఇలా మాజీ కేంద్ర మంత్రి స‌ర్వే స‌త్య‌­నా­రా­య‌ణ కూతురు, ఐఏ­ఎస్ అధి­కా­రిణి సంగీతం స‌త్య­నా­రా­య‌­ణ‌ను త‌న పేషీలో నియ­మిం­చా­రని చెబు­తు­న్నారు. ఇలా రేవంత్ రెడ్డి పాల‌­న‌పై, అధి­కా­రు­ల‌పై ప‌ట్టు సంపా­దిం­చు­కుం­టు­న్నా­ర‌ని, త‌ద్వారా ఎన్ని­క‌ల్లో ఇచ్చిన హామీల అమ‌లు సుల‌­భంగా, ఎలాంటి ఆటం­కాలు ఎదురు కాకుండా టీమ్‌ను ఏర్పాటు చేసు­కుం­టు­న్నా­ర‌న్న చ‌ర్చ రాజ‌­కీయ వ‌ర్గా­ల‌లో జ‌రు­గు­తోంది.