Suicide | పెద్దల తీరుపై కినుక.. ఇద్దరు బాలుర ఆత్మహత్య

ఆత్మహత్యలు చేసుకునే బలమైన కారణాలు కనిపించకపోయినా పెద్దలు తమ పట్ల ప్రదర్శించిన వైఖరి నచ్చని ఇద్దరు బాలురు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మారుతున్న పిల్లల మానసిక ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచాయి

Suicide | పెద్దల తీరుపై కినుక.. ఇద్దరు బాలుర ఆత్మహత్య

విధాత, హైదరాబాద్: ఆత్మహత్యలు చేసుకునే బలమైన కారణాలు కనిపించకపోయినా పెద్దలు తమ పట్ల ప్రదర్శించిన వైఖరి నచ్చని ఇద్దరు బాలురు క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మారుతున్న పిల్లల మానసిక ప్రవర్తనకు నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఎండలో ఆడుకోవద్దన్నందుకు ఒకరు.. నచ్చని హెయిర్ కటింగ్ చేయించారని మరొక బాలుడు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు విషాదం రేపాయి.

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన సిద్దు(9) మూడో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఎండలో ఎక్కువగా తిరుగుతూ ఆడుకుంటున్నాడు. పిల్లాడి క్షేమం తలిచిన తల్లి ఎండలో తిరగవద్దని కాస్తా కటువుగా మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన సిద్దు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరో సంఘటనలో మహబూబాబాద్ జిల్లా గంగారాం మండలం చింతగూడెం గ్రామానికి చెందిన కాంతారావు చిన్న కుమారుడు హర్షవర్ధన్ (9) హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు. వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. తండ్రి తనకు నచ్చని విధంగా హెయిర్ కటింగ్ చేయించాడని హర్షవర్ధన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లల మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది